నీ కొలువులో కొలువై ఉన్న
నందీ, భృంగీ, శృంగీలను సైతం
‘ఝుమ్మంది నాదం సై అంది పాదం’
అంటూ నాట్యం చేయించగల మహదేవన్ అనే స్వరబ్రహ్మను
నీ కాలి సిరి మువ్వను చేసుకున్నావు కదా!
నిన్ను శంకరా! అని గొంతెత్తి పిలిచిన ‘బాలు’నికి
గానాధిపత్యాన్నిచ్చి
గానసభలో పక్కన కూర్చోబెట్టేసుకున్నావు!
‘పంచభూతములు ముఖపంచకమై’
అంటూ నిన్ను ఎంతో నిష్ఠగా కొలిచిన
సుందరరాముణ్ణి
‘ఆదిభిక్షువు ఏది కోరేది!’ అంటూ
నిందా స్తుతి తో నిన్ను కొలిచిన సీతారావుణ్ణి
‘ఆనతినీయరా! హరా!’ అంటూ
సుధామృత జల్లులతో నిన్ను
అభిషిక్తం చేస్తుండిన వాణిని,
వీళ్ళందరి చేత నిన్ను కొలిపించి, ప్రేమించి,
ధ్యానించి, పూజించే లా చేయించిన
అధ్వర్యుడైన
విశ్వనాధుణ్ణి తెచ్చేసుకున్నావు.
ఏభై ఏళ్ళు మమల్నందరినీ
అలరించిన మా ఆప్తులను తీసుకుపోయి మా జీవితాలు
నిస్తేజం చేసేసావు కదా!
గరళం నువ్వు మ్రింగి,
అమృతమంతా దేవతలకిచ్చేసావు.
జీవుల పట్ల దయగల దేవదేవుడివి.
అలాగే కాస్త వెసులుబాటు చేసుకుని
ఈ మహానుభావులకు
చిరుబిందువైనా అమృతం మిచ్చి అమరుల్ని చేయచ్చు కదా!
నువ్వేమో ఇలాంటి మహోన్నత జీవులని దోసపండు తీగ నుంచి అతిసున్నితంగా వేరుపడినట్టుగా తెంపుకుని పట్టుకు పోతావు! అమృతం ఇస్తాను! కానీ వినడానికి, కనడానికి శాశ్వతంగా మీరుండాలి కదా అని సమాధానం చెప్తావు!
ఏం శివయ్యవయ్యా నువ్వు?
చంద్ర కళని నెత్తిన పెట్టుకున్న రూపంలో ఉన్న నిన్ను ధ్యానిస్తే, పూజిస్తే
గొప్ప కళాకారుడివి అవుతావని చెప్పావు.
వీళ్ళందరు నిన్ను ఆర్తిగా
ప్రార్ధించినవారే! పాపం!
‘ఏకబిల్వం శివార్పణం’ అంటూ నిన్ను గానమాధుర్యంతో
నీకు స్వరాభిషేకం చేస్తున్నాడు బహుముఖుడైన షణ్ముఖుడు (బాలు)
నీ ముందు కూర్చున్న
వాళ్ళలో సుందరుడు
అదే పనిగా చూస్తూ ప్రార్ధిస్తూ హరుడు,
మనోహరుడు అనే ప్రబంధాలతో నిన్ను సంబరపెడుతూ ఉంటాడు.
మరో ఆయన నీ శిరమునుండి జాబిలి పువ్వు వెదజల్లే సిరి వెన్నెల్లని చూసి పరవశించి
‘ఆనతినీయరా’ అని ప్రార్ధిస్తూ ఉంటాడు.
ఒక వాణి, వీణాతంత్రుల్లాంటి సన్నని మధురమైన గాత్రంతో
నిన్ను
‘దొరకునా ఇటువంటి సేవ’
అంటూ స్వరపుష్పాలతో పూజ చేస్తూ ఉంటుంది.
ఓం నమఃశ్శివాయ! చంద్ర కళా ధర సహృదయ
అంటూ నిన్ను స్మరించిన అద్భుత గాయని జానకి
నాదాన్ని నాద స్వరూపుడైన నువ్వు దగ్గరకు
తీసుకున్నావు ఆమె గానం మెచ్చి.
మంచుకొండల్లో
‘స్వరకైలాస వైభవం’
అనే చలనచిత్రాభరణాన్ని
నీకర్పిద్దామని నువ్వు
రాసిన విభూతి పెట్టుకుని,
నువ్విచ్చిన స్క్రిప్టు ఏకాగ్రతతో చదివి ఎలాతీయాలా అని
ఆలోచనామృతం గ్రోలుతూ నువ్వు ఎంపిక చేసిన జీవులకు ఎలానటించాలో నేర్పుతూ ఉంటాడా కళాతపస్వి.
కానీ శివ! నువ్వు నటకర్తవు!
జీవనదాతవు !
మా వాళ్ళను
తిరిగి పంపవచ్చుకదా!
వాళ్ళకి
శాశ్వతత్వం ఇవ్వలేవా
అని అడగడం సబబేనా? కాదా? మాకు తెలియదు కానీ
ఏమి కావాలనిపించినా అడగాల్సింది నిన్నే కదా.
మా నాన్నవు నువ్వే కదా!
నిన్ను తప్ప ఎవరిని అడగను?
ఆర్ద్రత నిండిన ప్రార్థనతో నిన్ను వేడుకుంటున్నాము.
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ
..చాగంటి ప్రసాద్
9000206163

.