జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టు నుంచి మరో ఎదురుదెబ్బ తప్పలేదు. ఇలాంటి తీర్పు వస్తుందని ముందే ఊహించినట్లుగా.. ముందునుంచి వైసీపీ నాయకులు ఈ వ్యవహారంపై ప్రతికూల వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ప్రభుత్వం సహకరించకపోవడం గురించి.. ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఎన్నికల సంఘానికి నిధుల విడుదలపై ప్రభుత్వం సహకరించడంలేదని నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సహకరించడంలేదని హైకోర్టు అన్నది. ఈసీ ఇచ్చిన వినతులపై ప్రభుత్వం స్పందించకుండా బాధ్యతారాహి త్యంగా వ్యవహరిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
తాము తొలగించిన వ్యక్తి తిరిగి ఈసీగా రావటంతో ప్రభుత్వం నాన్ కో ఆపరేటింగ్ గా వ్యవహరిస్తోందని న్యాయ స్థానం వ్యాఖ్యానించింది. ఇది సరికాదని ప్రభుత్వానికి హైకోర్టు హితవు చెప్పింది. ప్రభుత్వాలు మారుతాయి తప్ప రాజ్యాంగ సంస్థలు ఎప్పుడూ ఉంటాయని హైకోర్టు పేర్కొంది.
రాజ్యాంగ బద్ధ సంస్థలను కాపాడుకోకపోతే ప్రజాస్వామ్యం కుప్పకూలే ప్రమాదం ఉందని హైకోర్టు న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం 3 రోజుల్లోగా ప్రభుత్వానికి సవివర వినతి పత్రం సమర్పించాలని ఆదేశించింది. ప్రభుత్వం దీన్ని పరిశీలించి ప్రభుత్వం ఏం చేసిందో నివేదిక రూపంలో 15 రోజుల్లోగా హైకోర్టుకి సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశించింది.
మాజీ జస్టిస్ కనగరాజ్ ఫీజు చెల్లింపుల విషయంపై కూడా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. కనగరాజ్ తన పదవికి సంబంధించి అడ్వకేట్ను నియమించుకుంటే ఆయనే న్యాయవాదికి సొంత చెల్లింపులు చేసుకోవాలని హైకోర్టు అభ్యంతరం తెలిపింది. కనగరాజ్ ఇంటి కోసం 20 లక్షలు, ఫర్నిచర్ కోసం కేటాయించిన 15 లక్షలు ఇవ్వాలా వద్దా అనేది ఈసీ మరోసారి పరిశీలించాలని హైకోర్టు సూచించింది.
కనగరాజ్ న్యాయవాది కోసం పెట్టిన ఖర్చు వివరాలు ప్రజలకు తెలియాలని, ఇదంతా ప్రజలకు చెందిన సొమ్మని హైకోర్టు వ్యాఖ్యానించడం కీలకంగా కనిపిస్తోంది.
.