మన టైం బాగాలేనప్పుడు అరటి పండు తిన్నా పళ్లు విరిగిపోతాయి… తాడు అనుకున్నదే పామై మనల్ని కాటేస్తుంది… అందుకే అన్ని విషయాలు గురించి కాస్త ఆలోచించుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. మొన్నటి వరకు వేడి వేడి టీ, కాఫీలను ప్లాస్టిక్ కప్పుల్లో తాగేవాళ్లు… తర్వాత అవి ఆరోగ్యానికి హానిరకమని హెచ్చరించడంతో పేపర్ కప్పులకు మారుతున్నారు. అయితే ఇవి కూడా ప్రమాదమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్లాస్టిక్ కప్పులను వాడడం వల్ల అవి త్వరగా భూమిలో కలిసిపోకుండా పర్యావరణానికి హాని కలిగిస్తాయని, అలాగే వేడి వేడి పదార్ధాలను వాటిలో పోస్తే ఆ వేడికి కొద్ది మోతాదులో ప్లాస్టిక్ కరిగి మన శరీరంలోకి వెళుతుందని తద్వారా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెప్పడంతో మనం మెల్లిగి పేపర్ కప్పుల్లోకి మారుతూ వచ్చాం. వాటిని కాస్త చక్కటి ఫినిషింగ్ ఇవ్వడం కోసం పేపర్ కప్పు తయారీదారులు తక్కువ మోతాదులో హైడ్రోఫోబిక్ ఫిల్మ్ ను వాడుతారు. తద్వారా పేపర్ కప్పులు త్వరగా తడికి నానిపోకుండా ఉంటాయి. అయితే తాజాగా ఐఐటి ఖరగ్ పూర్ కు చెందిన పరిశోధకులు నిర్వహించిన పరిశోధనలో ఈ పేపర్ కప్పులు కూడా మన ఆరోగ్యానికి హానికరమేనని తేలింది.
పేపర్ కప్పులైతే పర్యావరణానికి హాని కలిగించవు, అలాగే వాటివల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు ఉండదని మనం నిన్నటిదాకా నమ్మేవాళ్లం. ఇప్పుడు పేపర్ కప్పుల్లో వాడే పల్చని హైడ్రోఫోబిక్ ఫిల్మ్ వేడి వేడి ద్రవాలను వాటిలో పోసిన సమయంలో వాటి వేడికి అతి కొద్దిగా కరిగి మనం తాగే ద్రవంలో కలిసిపోయి, మనకు తెలియకుండానే మన శరీరంలోకి వెళ్లిపోతోందని వీరి పరిశోధనలో తేలింది. వేడి ద్రవం పోసిన 15 నిమిషాల్లోనే ఈ మైక్రోప్లాస్టిక్ కరిగి కప్పులోని ద్రవంలోకి కలిసిపోతుందని, ఈ ప్లాస్టిక్ రేణువుల్లో మన ఆరోగ్యానికి హాని కలిగించే విషపూరితమైన క్రోమియం, కాడ్మియం వంటి భారీ లోహాలు కూడా అతి తక్కువ మోతాదులో ఉంటాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన సుధాగోయెల్ తెలిపారు. కాబట్టి వేడి వేడిగా ఏమైనా తాగుదాం అనుకునేముందు… ఎందులో తాగుతున్నామో కాస్త ఆలోచించి, తర్వాత తాగండి..!
.

Discussion about this post