‘మా కన్నీళ్లు తుడవడానికి వచ్చారా.. ఇంకా అవెక్కడున్నాయి సారూ.. ఏడ్చి ఏడ్చి ఎప్పుడో ఎండిపోయాయిగా’ అంటున్నారు వరద బాధిత ప్రజలు. దాదాపు వరద తాకిడి ముగిసిన నెలరోజుల తర్వాత వచ్చిన కేంద్రబృందం బాధిత ప్రజలు, రైతుల్లో ఎలాంటి సంతోషాన్ని నింపలేకపోయింది.
వెనుకటికో సామెత ఉంది… దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగాయట… అలా వుంది కేంద్ర ప్రభుత్వ పరామర్శ. ఇటీవల విపరీతమైన వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే… వదరల వల్ల చాలా నష్టం వాటిల్లింది. వరద బాధితులకు పలువురు పెద్దలు తమవంతు ఆర్ధిక సాయాన్ని అందించారు. అయితే ఇవన్నీ ఇలా నడుస్తుండగా కేంద్ర ప్రభుత్వం మాత్రం వరదల వల్ల జరిగిన నష్టాలను గురించి విచారించడానికి ఏడుగురు సభ్యులతో కూడాని ఒక బృందాన్ని రాష్ట్రానికి పంపింది.
సౌరవ్ రాయ్ నేతృత్వంలోని ఇంటర్ మినిస్టీరియల్ బృందం సచివాలయంలో వరద నష్టాలపై ఉంచిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. అనంతరం సిఎస్ తోబాటు వివిధ శాఖల అధికారులతో కూడా ఈ బృందం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వివిధ శాఖల వారిగా జరిగిన నష్టం వివరాలను కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు. ఈ సందర్భంగా వర్షాల వల్ల తడిసిన రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు, అలాగే వేరుశనగ పంటను కూడా కొనుగోలు చేసేందుకు తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఎఫ్. ఏ. క్యు. నిబంధనలను సడలించేలా సిఫార్సు చేయాలని ఈ సందర్భంగా సిఎస్ కేంద్ర బృందానికి విజ్ఙప్తి చేశారు. తుఫాను వల్ల రాష్ట్రంలో సుమారు 6వేల 386కోట్ల రూ.లు నష్టం వాటిల్లిందని ఈ సందర్భంగా సిఎస్ తెలిపారు.
నీలం సాహ్ని వినతులు ఇవే…
ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదల వల్ల రాష్ట్రానికి సుమారుగా 6వేల 386కోట్ల రూ.లు నష్టం వాటిల్లిందని కేంద్ర బృందానికి సిఎస్ వెల్లడించారు. వరదల వల్ల జరిగిన నష్టానికి తాత్కాలిక పునరుద్దరణ సహాయ చర్యలకు చేపట్టడానికి రాష్ట్రానికి 840 కోట్లు అవసరం ఉందని ఆయన కేంద్ర బృందానికి తెలిపారు. ఇంకా…శాశ్వత పునరుద్ధణర చర్యలకు 4వేల 439కోట్ల రూ.లు అవసరం అని, అయితే ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలతో ఆస్థి,ప్రాణ నష్టాలను చాలా వరకూ తగ్గించగలిగిందని ఆయన తెలిపారు.
వరదల వల్ల నష్టపోయిన రైతులకు ఇనుపుట్ సబ్సిడీని వెంటనే అదించి రైతులకు కొంతమేర ఉపశమనం కలిగించామని తెలిపారు. వరదల వల్ల వ్యవసాయ రంగానికి సంబంధించి 2లక్షల 12వేల హెక్టార్లు దెబ్బతిని 903 కోట్లు నష్టం వాటిల్లిందని, అలాగే ఉద్యానవన పంటలు 24వేల 515 హెక్టార్లు దెబ్బతిని 483 కోట్లు నష్టం వాటిల్లిందని, ఇంకా రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన 5వేల 583 కి.మీ రోడ్లు దెబ్బతిని 2వేల 976కోట్లు నష్టం వాటిల్లిందని, పంచాయితీరాజ్ శాఖకు 3వేల 125 కి.మీలు దెబ్బతిని 781కోట్లు నష్టం వాటిల్లిందని, ఇంకా నీటిపారుదలకు 1074కోట్లు, మున్సిపాలిటీలకు 75కోట్లు నష్టం వాటిల్లినట్లు నీలం సాహ్ని తెలిపారు.
మరి ఇన్ని వినతులకు కేంద్రం నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంది. అయితే వర్షం వచ్చి చాలా రోజులైంది. ఇప్పుడు వర్షాల వల్ల కలిగిన నష్టాల నుండి ప్రజలు కాస్త కోలుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో కేంద్ర బృందం వచ్చి పరిశీలిస్తే వారికి జరిగిన నష్టం ఏమాత్రం తెలుస్తుంది…? నష్టం వల్ల కలిగిన బాధ ఎంతవరకు అర్థం అవుతుంది…? అనేది కాస్త ఆలోచించాలి. ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు అన్నం పెడితే… ఆ పెట్టిన అన్నానికి పరమార్థం ఉంటుంది… అలాకాకుండా ఆకలిగా ఉన్నపుడు అన్నం పెట్టకుండా… మీన మేషాలు లెక్కించుకుంటుంటే… పుణ్యకాలం కాస్తా గడచిపోతుంది. అప్పుడు మీరు చేసే సాయానికి కూడా పెద్దగా విలువ ఉండదు అనే విషయం కేంద్రం ప్రభుత్వం గుర్తించాలి. వరదలు వచ్చాయి… అని అటు మీడియా అంతా గగ్గోలుగా చెబుతుంటే… వెంటనే వచ్చి జరిగిన నష్టాన్ని పరిశీలించి ఎంతో కొంత ఆర్ధిక సాయం అందించాలేకానీ… జరగాల్సినదంతా జరిగిన తర్వాత ఏం జరిగింది అని పరిశీలించి, నష్ట నివారణ చర్యలు చేపడతామంటే… పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇప్పుడైనా కేంద్రం రాష్ట్రం అడిగిన అంశాలను అంగీకరించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటే కాస్తైనా నష్ట నివారణకు పూనుకున్నట్లు ఉంటుంది.
.
Discussion about this post