ఒకప్పుడు ఇంగ్లీషు భాషలో మాట్లాడితే అబ్బో అనేవారు… ఇప్పుడు తెలుగులో మాట్లాడితే… అబ్బా… ఇప్పుడు ఇంత చక్కటి తెలుగు భాష ఎక్కడ వింటున్నాం… అంటూ ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. రాను రాను తెలుగు భాషకు ఆదరణ కరువవుతోంది. ఈ నేపధ్యంలో తెలుగు భాషను అలక్ష్యం చేస్తే భావితరాల్లో పలు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని తెలుగు భాషా సంఘం ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు.
కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని కలెక్టరేట్ లో పాలనా భాష అమలుపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాషను అలక్ష్యం చేస్తున్నారని, ఫలితంగా భవిష్యత్తులో ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పాలనా భాషను ఖచ్చితంగా అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన సున్నితంగా తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ AMD ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవీలత, భాషా సంఘం ప్రతినిథులు పాల్గొన్నారు.
అంతా బాగానే ఉంది… ప్రభుత్వం తెలుగు భాషా సంఘం ఛైర్మన్ పదవిని కట్టబెట్టింది. చక్కగా దాన్ని నిర్వహించుకుంటూ తెలుగు భాషాభివృద్ధికి మేం ఎంతో చేస్తున్నాం… అంటూ పత్రికా సమావేశాలు పెట్టి సొంత డబ్బా కొట్టుకోవడమేగానీ… తెలుగు భాష పురోభివృద్ధికి ఏమాత్రం చిత్తశుద్ధి కనబరిచారో అర్థం కావడంలేదు. ఒకవైపు పాఠశాలల్లో తెలుగు మీడియంనే లేకుండా కనుమరుగు చేసేస్తుంటే నోరు మెదపకుండా… ఇలా ప్రభుత్వ కార్యాలయాల్లో సమావేశాలు నిర్వహించి తెలుగు గొప్పదనం గురించి లెక్చరిస్తే ఏం ఉపయోగం ఉంటుందో కాస్త ఆలోచించాలి. కేవలం అధికారం వచ్చింది కాబట్టి ఏదో చేశాం అనిపించుకోవడం కాదు… తెలుగు భాష అభివృద్ధికి ఏమాత్రం చిత్తశుద్ధి చూపారో నిరూపించుకోవాలి. ప్రభుత్వానికి తెలుగు గొప్పదనం గురించి వివరించి, తెలుగు మీడియంను రద్దు చేయడం గురించి మాట్లాడాలి.
.

Discussion about this post