పోలవరం ప్రాజెక్టు విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆంధ్రపదేశ్ నీటిపారుదల శాఖామంత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈరోజు అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈవిధంగా అన్నారు. పోలవరం విషయాన్ని రాజకీయం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రయత్నిస్తున్నారని, అలాంటి వాటిని తమ ప్రభుత్వం సహించబోదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు గురించి తెలుసుకోవాలంటే పదిమంది వెళితే సరిపోతుందని,
అలాకాకుండా రెండు వందల మంది పోలవరం వెళ్లి అక్కడ ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు హయాంలో పోలవరం గురించి రామకృష్ణ ఎందుకు పోరాటం చేయలేదనిఈ సందర్భంగా మంత్రి ప్రశ్నించారు. కేవలం చంద్రబాబు నాయుడు మెప్పుకోసమే ఇప్పుడు రామకృష్ణ పోరాటం చేస్తున్నారని అనిల్ కుమార్ అన్నారు. ప్రాజెక్టకు సంబందించిన ఎర్త్ డ్యాం పనులు ఫిబ్రవరి నుండి ప్రారంభం కానున్నాయని, రామకృష్ణ చెప్పినట్టు డ్యాం ఎత్తును అంగుళం కూడా తగ్గించేది లేదని, ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వాళ్లను కూడా పిలుస్తామని అప్పుడు టేపు తీసుకుని వచ్చి చక్కగా కొలుచుకోవచ్చని ఆయన ఎద్దేవా చేశారు.
నిజానికి చంద్రబాబుకు నష్టం కలిగించే విధంగా రామకృష్ణ ఎలాంటి వ్యాఖ్యలు చేయరని, ఇప్పుడు తమ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో చేపడుతున్న పనులను గురించి రచ్చ చేయడానికే ఇలా చేస్తున్నారని ఆయన అన్నారు. పోలవరం పనుల విషయంపై అన్ని పార్టీల నుండి పార్టీకి ఇద్దరు ప్రతినిధులు వచ్చినా కూడా తాము పనుల గురించి వివరించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు
.

Discussion about this post