వాళ్లు తలచుకుంటే తెరాస ప్రభుత్వం కుప్ప కూలిపోతుందా..! అవునట. తాము తలచుకుంటే కేసీఆర్ ప్రభుత్వం దెబ్బకు దిగిపోతుందని చెబుతున్నారు మజ్లిస్ నాయకులు.
ఎంఐఎం పార్టీకి చెందిన చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే జరగనున్న గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఆయన ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.
తమ పార్టీయే గనుక తలచుకుంటే రెండు నెలల్లో తెరాస ప్రభుత్వాన్ని దించేయగలదని, తమకు కుర్చీలో కూర్చోబెట్టడం తెలుసు, అలాగే దించేయడం కూడా తెలుసునని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ ను ఆయన ఈ సందర్భంగా ఇప్పుడే కళ్లు తెరిచిన చిలుక అంటూ వ్యాఖ్యానించారు. రాజకీయాలు తమ పార్టీకి కొత్త కాదని, గతంలో ఎన్నో పార్టీలు తమను ఎన్నో రకాలుగా విమర్శించాయని, అయితే అలాంటి పార్టీలు నామరూపాలు లేకుండా పోయాయని, తమ పార్టీ ఎన్నో ప్రభుత్వాలను చూసిందని, ఎవరు ఎన్ని శాపనార్థాలు పెట్టినాకూడా ఎంఐఎం పార్టీ దినదినాభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
అయితే ముంతాజ్ అహ్మద్ ఖాన్ కు అసదుద్దీన్ కు ఎదురైన చేదు అనుభవం ఇంకా ఎదురైనట్టు లేదు. అలా జరిగి వుంటే ఇలా వ్యాఖ్యానించి ఉండరేమో… కేవలం మీడియా ముందుకు వచ్చి మాత్రమే మాట్లాడుతుంటే జనం నాడి తెలియదు కదా…! అప్పుడప్పుడూ జనాల్లోకి కూడా నాయకులు వస్తూవుంటే… వారి బాధలు, వారి పట్ల వీరి బాధ్యతలు కూడా తెలుస్తుంటాయి. అప్పుడు ఎన్నికలు రాగానే హామీల మూటలు పట్టుకుని వారి ముందుకు వెళ్లాల్సిన పనిఉండదేమో కదా!
.

Discussion about this post