ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంపై ప్రభుత్వం మరోసారి హై కోర్టుకు వెళ్లింది. పంచాయతీ ఎన్నికలపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటోందని ఆరోపిస్తూ మంగళవారం పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల సంఘం తీరు సుప్రీం కోర్ట్ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉందని పేర్కొంది.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించాలని భావిస్తున్నట్లు ఎన్నికల సంఘం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో కరోన వ్యాప్తి ఇంకా తగ్గలేదని, చలికాలంలో సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఎన్నికల సంఘానికి సమాధానం ఇచ్చింది. దీంతో ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేమని, అంతేకాక క్షేత్ర స్థాయిలో సిబ్బంది కోవిద్ ను ఎదుర్కోవడంలో తలమునకలై ఉన్నారని పేర్కొంది. దీనిపై ఎన్నికల సంఘం ఘాటుగా స్పందించింది. తాము రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరలేదని, సమాచారం మాత్రమే ఇచ్చామని, ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కోర్టు తీర్పు ప్రతిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ఈ విషయమై రాష్ట్ర గవర్నర్కు ఎన్నికల సంఘం ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఎన్నికలను నిర్వహిస్తుందేమో అని అనుమానం రాష్ట్ర ప్రభుత్వానికి కలిగినట్లు ఉంది. దీంతో ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గలేదని, 6 వేల మందికి పైగా మృతి చెందారని, ఇప్పటికీ కేసులు నమోదు అవుతున్నాయని, మళ్లీ సెకండ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నట్లు వివరించింది. ఈ పరిస్థితుల్లో ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని కోర్టుకు విన్నవించింది. ఈ దిశగా ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించింది. దీనిపై హైకోర్టు తీర్పు ఎలా వస్తుందో చూడాలి.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంతకాలం స్థానిక సంస్థలకు ఎన్నికలను నిర్వహించ కూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే మార్చి నెలాఖరు కు రమేష్ కుమార్ పదవీకాలం ముగుస్తుంది. ఈలోగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం, ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పుడు బంతి హైకోర్టుకు చేరింది. పరిణామాలు ఎక్కడి వరకు దారితీస్తాయో చూడాలి.
ప్రభుత్వం వాదన నెగ్గుతుందా?
ఇటీవలి పరిణామాలను గమనిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికికి కోర్టుల్లో అనుకూల తీర్పులు వస్తున్నాయి. అయితే ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ప్రభుత్వం వేస్తున్న పిటిషన్లలో బలం ఉండబట్టే అవి నెగ్గుతున్నాయి. అదే తరహాలో.. ఇప్పుడు స్థానిక ఎన్నికల విషయంలో హైకోర్టులో వేసిన కేసు విషయంలో కూడా అదే జరుగుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. కొవిడ్ మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో అత్యావశ్యకం కాని ఎన్నికలు పెట్టి తీరాల్సిందే అని ఏ ఒక్కరూ ఒత్తిడి చేయలేరు. ప్రజల ప్రాణాలతో ముడిపడిన వ్యవహారం గనుక.. కోర్టులు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాయి. పూర్తి సానుకూల పరిస్థితి వచ్చిన తర్వాత మాత్రమే ఎన్నిక నిర్వహిస్తామనే ప్రభుత్వ వాదనే హైకోర్టులో నెగ్గే అవకాశం ఉన్నదని పలువురు భావిస్తున్నారు. అదే నిజమైతే తాను పదవినుంచి దిగిపోయే లోగా.. ఎన్నికలు పెట్టేసి.. తాను గెలిచినట్లుగా చూపించాలని భావిస్తున్న నిమ్మగడ్డ అశోక్ కుమార్ ఆశలు నెరవేరే అవకాశం తక్కువ.
.

Discussion about this post