ఊరంతా ఒకదారైతే.. ఉలిపికట్టెది ఒక దారి అని తెలుగులో ఒక పాతకాలం నాటి సామెత. ప్రస్తుతం మన ప్రభుత్వాల తీరు కూడా అలాగే అనిపిస్తోంది. ఇటీవలి కాలంలో కరోనా మహమ్మారికి భయపడి అన్ని మతాల పండుగలపై హడావుడిగా నిషేధం విధించేసిన ప్రభుత్వాలు, కొన్నిసార్లు చేస్తున్న హంగామా చూస్తోంటే కరోనా తాను వెళ్లిపోతున్నట్లు వీళ్లకు చెవిలో గుడ్ బై చెప్పేసిందమో అనే అనుమానం కలుగుతుంది.
వివరాల్లోకి వెళ్తే… కరోనా మహమ్మారికి భయపడి మార్చి నెల నుండి అన్ని మతాలకు సంబంధించిన పండుగలపై నిషేధం విధించేసిన ప్రభుత్వాలలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒకటి. అప్పటి నుండి పేదలకు ధన సహాయం చేయడం, రోడ్లను చిమ్మేయడం, హాస్పిటల్‌లలో పండ్లు పంచేయడం వంటి వివిధ ఫీట్‌లను చేస్తూ వీడియోలు, ఫోటోలు తీసుకున్న వాళ్ల పార్టీ లీడర్‌లను, మీడియాల చేత మొట్టికాయలు తిన్న లీడర్‌లను కూడా చూశాం. ఒకవైపు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ అంటే.. ‘అమ్మో కరోనా బూచి పొంచి ఉంది.. మేం ఎన్నికలు పెట్టలేం.. జనానికి ప్రమాదం’ అంటూ ప్రభుత్వం తరఫున కోర్టుల్లో వినిపించిన వాదనల్ని కూడా మనం చూశాం. తెలుగుదేశం వాళ్లు ప్రజల్ని పరామర్శించే నెపం మీద అయినా సరే.. గుంపుగా తిరిగిన ప్రతిసందర్భంలో కరోనా నిబంధనల ఉల్లంఘన కేసులు పెట్టడాన్ని కూడా మనం చూశాం.
అయితే, ఇంతలో జగనన్న పుట్టినరోజు వచ్చేసింది. ఈ సందర్భంగా.. కొత్తగా రాబోతున్న తిరుపతి ఉప ఎన్నికలలో తమ బలం ఇలా ఉంటుందని ప్రతిపక్షాలకు చూపాలనుకున్నారో ఏమో గానీ.. సదరు నియోజకవర్గం నాయకులు చేసిన హంగామాలో భాగంగా ఆ జన సమీకరణ ఫోటో చూస్తూంటేనే కళ్లు తిరిగిపోతున్నాయంటున్నారు విశ్లేషకులు. ఇంత మంది జనాలలో ఎంత మంది మళ్లీ కరోనా బారిన పడాలో, ఎంత మంది మళ్లీ పిట్టల్లా రాలిపోవాలనుకుంటున్నారో మాత్రం సదరు కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్ద మనుషుల విచక్షణకే వదిలేయాల్సి ఉంటుంది. ఇంత వరకూ మందే కనుగొనలేని ఈ మహమ్మారిని బూచిగా చూపి అన్ని మతాల పండుగలను మాత్రం నిషేధించేసిన పెద్దలు మరి నాయకుల పుట్టినరోజులకైతే పట్టింపు ఏమీ లేకుండా ఊరేగుతారా? అని జనాలు గుసగుసలాడుతున్నారు.
ఎంతైనా పెద్ద వాళ్లు ఏమి చేసినా అడిగే వారు లేరుగా..!
.

Discussion about this post