కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శించుకుంటే మన కోరికలు ఈడేరుతాయని ప్రజల విశ్వాసం. దీనికితోడు పర్వదినంలో స్వామి దర్శనం మరింత ఫలప్రదమని భక్తుల నమ్మకం. శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలకు భక్తుల పోటెత్తారు. దీంతో అధికారులు కూడా అందినంత వరకు దండుకునేందుకు పథకం వేశారు.
శ్రీవాణి ట్రస్టు ద్వారా పలువురు భక్తులు స్వామి దర్శనం కోసం పదకొండు వేల రూపాయలు పెట్టి టిక్కెట్ కొనుక్కున్నారు. అయితే వారిని కూడా 300 రూపాయల క్యూలైన్ లోనే నిలబెట్టేశారు. దీంతో ఆగ్రహించిన శ్రీవాణి ట్రస్టు భక్తులు శ్రీవారి ఆలయం ముందు ఆందోళనకు దిగారు. తాము స్వామి దర్శనానికి ఇంత ఖర్చుపెట్టి టిక్కెట్టు కొన్నా కూడా తమను స్వామి దర్శనం చేసుకోనివ్వకుండా టిటిడి సిబ్బంది బంగారు వాకిలి నుండే తమను వెనక్కి పంపేశారని భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చివరికి పోలీసులు వారికి సర్దిచెప్పి పంపేశారు.
అయినా స్వామిని దర్శించుకోవాలనే కోరికతో ఉన్న భక్తుల ఆశలను శ్రీవాణి ట్రస్టు లాంటి వారు క్యాష్ చేసుకుంటున్నారు. అంతేగానీ భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారా లేదా అనే విషయం మాత్రం పట్టించుకోవడం లేదు. ఇకనైనా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇలాంటి విషయంలో భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుందేమో!
.

Discussion about this post