ఇటీవల దుర్మార్గుల దురాగతానికి దగ్ధమయిన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం సెప్టెంబర్ నెలలో దగ్ధం అయిన విషయం తెలిసిందే. షెడ్డులో భద్రపరచబడిన రథం ప్రమాదవశాత్తూ (!) దగ్ధం అయింది. 40 అడుగుల ఎత్తుగా వుండే ఆ రథాన్ని సుమారు 60 సంవత్సరాల క్రితం టేకు కలపతో తయారు చేయబడింది. కాగా ఈ రథం అకస్మాత్తుగా దగ్ధం కావడంతో సర్వత్రా ఆందోళన చెలరేగింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నూతన రథం తయారీకి భారీ మొత్తంలో నిధులు కేటాయించడం జరిగింది. ఈ రథం యుద్ధప్రాతిపదికన రూపుదిద్దుకుంది.
ఈ నూతన రథాన్ని సోమవారం నాడు ట్రయల్ రన్ కు అధికారులు సిద్ధం చేశారు. సుమారు 95 లక్షలతో తయారవుతున్నఈ రథాన్ని పాత రథం నమూనాతోనే తయారుచేయడం గమనార్హం. ఈ రథం 21 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు, 41 అడుగులఎత్తు, ఆరుచక్రాలతో సిద్ధమవుతోంది. పాత రథం దగ్థమైన మూడు నెలల్లోనే ఈ కొత్తరథాన్ని సిద్ధంచేయడం గమనార్హం. ఈ రథం తయారీకి 1330 ఘనపుటడుగుల బస్తర్ టేకును అధికారులు ఉపయోగించారు. ట్రయల్ రన్ అనంతరం రథం తయారీలో ఏవైనా లోపాలు వుంటే వాటిని సరిచేయడానికి అధికారులు సిద్ధంగా వున్నారు. ఫిబ్రవరి నెలలో లక్ష్మీనరసింహస్వామి కళ్యాణానికి ఈ నూతన రథాన్ని సిద్ధం చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
.

Discussion about this post