గుణశేఖర్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న అద్భుతమైన దర్శకుల్లో ఒకడు. సమంత కూడా టాలీవుడ్ అద్భుతమైన నాయికల్లో ఒకరు. కానీ.. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే నెలలో సెట్స్ పైకి వెళుతుందని అనుకుంటున్న ‘శాకుతలం’ సినిమా విషయంలో మాత్రం.. సమంత ఫ్యాన్స్‌కు అనేక రకాల అనుమానాలున్నాయి.
మహాభారతం ఆదిపర్వంలో శకుంతల- దుష్యంతుల ప్రస్తావన వస్తుంది. శకుంతల అంటే అద్భుత సౌందర్యరాశి. ఆమెను దుష్యంతుడు వలచి, వరిస్తాడు. ఇదంతా చాలా పెద్ద కథ! ఆ కథనే సెల్యులాయిడ్ ఫార్మాట్ లోకి మలిచే సాహసం చేస్తున్నాడు గుణశేఖర్. నిజానికి ఇలాంటి చిత్రాల మేకింగ్ లో గుణశేఖర్ ది అందె వేసిన చేయి. ఆయన ఒకప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే రాముడి పాత్ర చేయిస్తూ.. ఎంఎస్ రెడ్డి నిర్మాతగా.. అంతా పసిపిల్లలే పాత్రధారులుగా రూపొందించిన రామాయణం చిత్రం ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలుసు.
ఆ తర్వాత గుణశేఖర్ టెక్నాలజీ బాట పట్టాడు. కొత్త కొత్త టెక్నాలజీలను వడిసిపట్టుకోవడం ప్రారంభించాడు. ప్రధానంగా సెట్టింగ్‌లలో ఇన్నోవేటివ్ పోకడలకు తను పర్యాయపదంగా మారాడు.
ఒక్కడుసినిమాకోసం వేయించిన చార్మినార్ సెట్టింగ్ ఒక ట్రెండ్ సెట్టర్. చార్మినార్ తాలూకు ఒక దీవార్, రెండు మీనార్లతో సెటింగ్ వేయించి.. వాటినే కెమెరా పనితనం, టెక్నాలజీ మేళవింపుతో నాలుగు మీనార్ లుగా ప్రతి ఫ్రేములోనూ భ్రమింపజేస్తూ గుణశేఖర్ చేసిన ప్రయోగం ప్రేక్షకులను అలరించింది. అయితే.. ఆ రకమైన టెక్నిక్ మీద గుణశేఖర్ ఆసక్తి కాస్తా పిచ్చిగా మారింది. మహేష్ బాబు హీరోగా రూపొందించిన అర్జున్ చిత్రం కోసం.. మధురై ఆలయాన్ని కూడా అదే మాదిరి సెట్టింగ్ వేయించారు. ఒక గోపురం సెట్టింగ్ రూపొందించి.. దానిని నాలుగు గోపురాలుగా చూపించేందుకు ప్రయత్నించారు. ప్రయోగం సక్సెస్ అయింది గానీ.. సెట్టింగ్, టెక్నిక్ మీద ఉండే శ్రద్ధ కథ మీద లేకపోవడం వల్ల సినిమా బాక్సాఫీసు వద్ద పతనమైపోయింది. ఆ విషయానికొస్తే వరుడు ఇంకా పెద్ద డిజాస్టర్ అని చెప్పాలి. అప్పటికి కంప్యూటర్ గ్రాఫిక్స్ కూడా ముదరడం వల్ల.. వాటిని వాడడంలో చాలా నాసిరకం సీజీ వర్క్ తో సినిమాలో విసుగెత్తించారు. క్లయిమాక్స్ ఫైట్ ఒక కామెడీగా మిగిలిపోగా.. కనీసం పెళ్లి వేదిక చుట్టూ పొలాలుగా చూపించిన గ్రాఫిక్స్ కూడా చాలా నాసిరకంగా తయారయ్యాయి.
గుణశేఖర్ సెట్టింగుల పిచ్చి గ్రాఫిక్స్ మీదికి మళ్లడం సహజమే. కానీ.. అందులో క్వాలిటీ పట్టించుకోకపోవడం.. కంప్యూటర్ స్క్రీన్ మీద నచ్చినవి.. సెల్యులాయిడ్ తెరపై ఏమేరకు రంజింపజేస్తాయో ఊహించలేకపోవడం ఆయన వైఫల్యం. తర్వాతి కాలంలో..
అనుష్క కెరీర్ టాప్ గేర్ లో ఉన్నప్పుడు ‘రుద్రమదేవి’ ప్రయోగం చేశాడు. అది దారుణంగా దెబ్బతింది. గ్రాఫిక్స్ వర్క్ పరంగా చాలా నాసిరకంగా తయారైందనే విమర్శలు మూటగట్టుకున్నాడు. సుదీర్ఘకాలం గ్యాప్ తర్వాత.. ఇప్పుడు సమంతతో ‘శాకుంతలం’ అంటున్నాడు. రుద్రమదేవి చారిత్రక సినిమా అయితే.. శాకుంతలం ఏకంగా పౌరాణిక సినిమా. మహాభారత గాధ. మరింత భారీ స్థాయిలో గ్రాఫిక్స్ వర్క్ అవసరం అయ్యే సినిమా. కోటలను కంప్యూటర్లో తయారుచేసి మభ్యపెట్టడం ఒక ఎత్తు.. కానీ.. అడవులను కూడా కంప్యూటర్లో సృష్టించి.. ప్రేక్షకుల్ని మాయ చేయాలనుకుంటే.. సీజీ వర్క్ మీద చాలా శ్రద్ధ పెట్టాలి. పట్టుండాలి. ఓపిక కూడా ఉండాలి. కానీ.. రుద్రమదేవిని రూపొందించిన గుణశేఖర్ ను గుర్తు చేసుకుంటే.. అంత ఓపికగా సినిమా చేయగలడా అనే అనుమానం కలుగుతుంది.
నాసిరకం వర్క్ చేసినట్లయితే.. సమంత కెరీర్ లో చాలా గ్యాప్ తర్వాత.. ఒక ఫ్లాప్ నమోదు అవుతుందేమో అనే అభిప్రాయం కూడా పలువురిలో కలుగుతోంది. సాధారణంగా సమంతకు సినిమాల విషయంలో అక్కినేని ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటుందని అంటుంటారు. ఆ రకంగా వారు కూడా శ్రద్ధ తీసుకుని, మేకింగ్ తీసికట్టుగా తయారుకాకుండా.. దర్శకుడు గుణశేఖర్ ను హెచ్చరిస్తే తప్ప మంచి ప్రోడక్ట్ సాధ్యం కాదు. లేదా, రుద్రమదేవి పరాజయం గుణశేఖర్ లో మార్పు తెచ్చి ఉంటే.. క్వాలిటీ పరంగా మంచి చిత్రం వస్తుందనుకోవచ్చు. కేవలం సమంత క్రేజ్ ని వాడుకుంటూ.. తన స్టయిల్ చీప్ గ్రాఫిక్స్ తో చుట్టేద్దాం అనుకుంటే.. సమంత కెరీర్ ను ఈ దర్శకుడు పడుకోబెట్టేస్తాడనే అనుకోవాలి.
.

Discussion about this post