పంచాయతీ ఎన్నికలు అందరి సమన్వయంతో విజయవంతంగా నిర్వహించామని, మునిసిపల్ ఎన్నికల్లో కూడా గతంలో కంటే ఎక్కువ పోలింగ్ శాతం జరిగేలా చర్యలు తీసుకుంటామని, మీడియాతో ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. మునిసిపల్ ఎన్నికల్లో కూడా వాలంటీర్ల వినియోగం ఉండదని తేల్చి చెప్పారు. మునిసిపల్ సిబ్బందే స్వయంగా ఓటరు స్లిప్పుల పంపిణీ చేయాలన్నారు. వాలంటీర్లంతా వైకాపా కార్యకర్తలు అనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో కూడా.. వాలంటీర్లకు కత్తెర వేసిన సంగతి తెలిసిందే.
ఓ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి ఓటర్ల అనుమానాలు నివృత్తి చేసేలా చర్యలు తీసుకోనున్నామని నిమ్మగడ్డ చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం నిన్న ప్రకటించిన ఎన్నికల నియమావళి రాష్ట్రంలోనూ అమలు అవుతుందని, అభ్యర్థులు ఐదు మందికి మించి ఇంటింటి ప్రచారం చేయకూడదు. అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు.
మద్యం, డబ్బు పంపిణీ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటామని, మునిసిపల్ పోరులో మొబైల్ స్వాడ్స్ చురుకుగా పనిచేస్తాయని చెప్పారు. ఎన్నికలను ప్రభావితం చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. సున్నిత, అతి సున్నిత కేంద్రాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. బలవంతపు విత్ డ్రా కేసులను స్వయంగా అభ్యర్థి వచ్చి అడిగితే పరిశీలిస్తామన్నారు. నామినేషన్ వేయకుండా అడ్డుకున్న కేసుల విషయంలో రుజువులు, ఆధారాలు చూపిస్తే వారి విషయాన్ని పునః పరిశీలన చేస్తామన్నారు. ప్రభుత్వ రేషన్ వాహనాలు దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా నిమ్మగడ్డ హెచ్చరించారు.
.

Discussion about this post