సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారు. ప్రస్తుతం సీజేగా ఉన్న బోబ్డే పదవీకాలం పూర్తి కానుండడంతో ఆయన ఎన్వీ రమణ పేరును, తదుపరి సీజే స్థానానికి సిఫారసు చేస్తూ కేంద్ర న్యాయశాఖకు ఉత్తరం కూడా రాశారు. తెలుగువ్యక్తి అయిన జస్టిస్ ఎన్వీ రమణ భారత సుప్రీం కోర్టుకు 48వ ప్రధానన్యాయమూర్తి కాబోతున్నారు. ఏప్రిల్ 23న బోబ్డే పదవీకాలం పూర్తయ్యాక, ఆయన నియామకం అమల్లోకి వస్తుంది.
అయితే ఎన్వీ రమణ ఈ అత్యున్నత స్థానాన్ని అధిరోహించనున్న నేపథ్యంలో.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోటరీలో ఒక రకంగా భయం వ్యాపిస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులతో పాటు, సుప్రీం జస్టిస్ ఎన్వీ రమణపై కూడా అనేక ఫిర్యాదులు చేస్తూ జగన్మోహన్ రెడ్డి.. కొంతకాలం కిందట సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఆ తర్వాత లేఖను, జగన్ సలహాదారు అజేయకల్లం మీడియాకు విడుదల చేశారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం రేకెత్తించింది. ఎన్వీ రమణ కుటుంబానికి చెందిన వారు అమరావతిలో భూముల కొనుగోళ్ల అక్రమాలకు కూడా పాల్పడ్డారనే ఆరోపణలు కూడా జగన్మోహనరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఏతావతా.. ఎన్వీ రమణ.. తమ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రాజధాని విషయంలో అనుచిత నిర్ణయాలకు కారణమయ్యే అవకాశం ఉన్నదని అందరూ భావించేలా జగన్ లేఖ సాగిపోయింది. అయితే.. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి లేఖ రాసిన నేపథ్యంలో.. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కావడానికి రమణకు గల అవకాశాలు తగ్గిపోవచ్చునని పలువురు అంచనా వేశారు. అయితే అలాంటి అంచనాలు నిజం కాలేదు. ఇప్పుడు ఆయన సీజే అవుతున్నారు.
ఈ నేపథ్యంలో జగన్ కోటరీలో కొంత గుబులు మొదలైంది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన, ఏపీ ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించిన కేసులు సుప్రీం కోర్టు దాకా వెళ్లిన సందర్భాల్లో తీర్పులు తమకు ప్రతికూలంగా వస్తాయేమోననే భయం వారిలో మొదలవుతున్నట్లుగా కనిపిస్తోంది. తమకు నచ్చని రీతిలో తీర్పులు వచ్చినట్లయితే.. తాము ఎన్వీ రమణకు వ్యతిరేకంగా లేఖ రాసినందువల్లనే కక్షపూరితంగా ఇలాంటి తీర్పులు వచ్చాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు ఆరోపించే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ముందు ముందు ఎలాంటి రాజకీయ మలుపులు చోటు చేసుకుంటాయో వేచిచూడాలి.
.
Discussion about this post