జనసేనాని పవన్ కల్యాణ్ ఎవరు వచ్చి ఎలాంటి విన్నపాలు చేసుకున్నా.. వెంటనే వారికి వరాలు ఇచ్చేస్తుంటారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతానికి చెందిన ప్రజలైనా వచ్చి తనతో తమ సామాజిక సమస్యల గురించి చెప్పుకున్నప్పుడు.. పవన్: కల్యాణ్ వెంటనే వారికి హామీలు ఇవ్వడం, వారి సమస్యల పరిష్కారం కోసం తన వంతుగా.. శ్రద్ధ పెట్టి ప్రజాఉద్యమాలు చేయడం చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ.. ఈ సందర్భంలో వారు మూకుమ్మడిగా వచ్చి.. ఆయనను కలిసి విన్నపాలు చేసుకున్నారు గానీ.. వారి విజ్ఞప్తులను పవన్ పట్టించుకుంటారా? లేదా? అనేది ఇంకా సందేహంగానే ఉంది.
ఇంతకూ వారెవరు?
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ నాయకులు కట్టగట్టుకుని.. హైదరాబాదులోని పవన్ కల్యాణ్ నివాసానికి వచ్చి ఆయనతో భేటీ అయ్యారు. తిరుపతి పార్లమెంటు స్థానానికి జనసేన- బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా రిటైర్డు ఐఏఎస్ అధికారి కత్తి రత్నప్రభ పేరును ప్రకటించిన సంగతి తెలిసిందే. మర్యాదపూర్వకంగా ఆమె, ఇతర బీజేపీ నాయకులతో కలిసి పవన్ నివాసానికి వచ్చి కలిశారు. సాధారణంగా పవన్ కల్యాణ్ పార్టీతో మైత్రిని గానీ, పవన్ సహకారాన్ని గానీ లెక్క చేయకుండా ఒంటెత్తు పోకడలు పోతున్న ఏపీ బీజేపీ నాయకులు సోము వీర్రాజు, పురందేశ్వరి తదితరులందరూ కూడా ఈ భేటీలో ఉన్నారు.
Read this also
మంత్రి: చేతులు కాలితే తప్ప.. ఆకులు పట్టుకోం!
అయితే ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే కాదు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల ప్రచారానికి పవన్ సహాయాన్ని, స్వయంగా ఆయన బరిలోకి దిగి ప్రచారం చేయాలనే విజ్ఞాపనను కూడా ఆయన ముందుంచారు. తిరుపతి ఎంపీ నియోజకవర్గ పరిధిలో పవన్ కల్యాణ్ ప్రచారం అనేది బీజేపీకి చాలా కీలకం. అందుకే జనసేన మద్దతుతో తమ పార్టీ అభ్యర్థిని నిలబెడతామని తొలుత ప్రకటించిన వారు.. ఆ తర్వాత.. ‘రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థి’ అనే ట్యాగ్ లైన్ తో రత్నప్రభ పేరును ప్రకటించారు. అధికారికంగా ఆమె కమలం గుర్తు మీదనే పోటీచేస్తుంది గనుక.. గెలుపోటముల ఖ్యాతి వారికే దక్కుతుంది.
అయితే తిరుపతి ఎంపీ పరిధిలో బీజేపీకి ఉన్న బలం సున్నా అనే చెప్పాలి. ఆ పార్టీకి భానుప్రకాష్ రెడ్డి, కోలా ఆనంద్ వంటి కీలక నాయకులు ఆ ప్రాంతంలో ఉన్నప్పటికీ.. ఓట్ల రూపంలో ఆ బలం కనిపిస్తుందనే నమ్మకం లేదు. అదే సమయంలో.. పవన్ కల్యాణ్ కు చెందిన కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు విస్తృతంగా ఉంది. ఈ నేపథ్యంలో పవన్ స్వయంగా ఎన్నికల ప్రచారానికి వచ్చినట్లయితే.. ప్రభావం ఉంటుందని వారి ఆశ. ఆయన స్వయంగా ప్రచారానికి వస్తే.. తిరుపతి ఉప ఎన్నికలను పవన్ సీరియస్ గా తీసుకున్నారనే అర్థం వస్తుందని.. ఆయన పార్టీ కేడర్ కూడా కష్టపడి పనిచేస్తుందని.. దీనివల్ల బీజేపీ బలాన్ని నిరూపించుకోవచ్చునని వారు ఆశిస్తున్నారు.
పవన్ ఏమంటారో?
వారు విన్నపాలు చేశారు గానీ.. ఆ విన్నపాలకు పవన్ ఎలా స్పందిస్తారో క్లారిటీ లేదు. అసలే తెలంగాణ బీజేపీ నాయకులు- జనసేన గురించి కాస్త తేడాగా మాట్లాడిన నేపథ్యంలో.. అలిగిన జనసేనాని.. హైదరాబాదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని కాలదన్ని, టీఆర్ఎస్ అభ్యర్థి వాణీరావుకు ఓటు వేయాల్సిందిగా పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీ సిటింగ్ సీటులో.. టీఆర్ఎస్ గెలిచింది.
అలాంటి నేపథ్యంలో పవన్‌కు ఆగ్రహం రాకుండా చూసుకోవడంతో పాటు ఆయనను ఎన్నికల ప్రచారానికి తీసుకెళ్లాలనే బీజేపీ భావిస్తోంది. అయితే వారి విజ్ఞప్తులకు మొన్నటి భేటీలో పవన్ కల్యాణ్ ‘ఎస్’ చెప్పలేదని సమాచారం. అవకాశాల్ని పరిశీలిస్తానని మాత్రమే హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. బీజేపీ నేతల స్పందనను బట్టి.. పవన్ ఒప్పుకోవడం ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు.
.

Discussion about this post