కేంద్రప్రభుత్వం.. ఆదాయపు పన్ను శాఖను తమకు గిట్టని వారిని బెదిరించడానికి ఒక ఆయుధంగా వాడుకుంటున్నదా? తమకు వ్యతిరేకంగా గళం వినిపించే వారిని, తమ వ్యతిరేకులతో కలిసి పనిచేసేవారిని హెచ్చరించడానికి ఐటీ దాడులతో కుయుక్తులు పన్నుతున్నదా? అనే ప్రశ్నలు ఎదురైతే.. అవుననే అభిప్రాయమే కలిగేలా ఉంది.
నెటిజన్లు ఇప్పుడు కేంద్రప్రభుత్వం మీద మండిపడుతున్నారు. ఇదేమీ రాజకీయ మండిపాటు కాదు. తమ తమ పార్టీల భావజాలాల్ని బట్టి, తమ తమ కులాల ప్రాధన్యాలను బట్టి.. కేంద్రం మీద, మోడీ మీద ఆగ్రహించడం లేదు. కేవలం ఒక వ్యక్తికోసం నెటిజన్లు జట్టు కడుతున్నారు. ఆ వ్యక్తిని కేంద్రం టార్గెట్ చేస్తున్నదేమో అనే అనుమానంతో మండిపడుతున్నారు.
ఆ వ్యక్తి మరెవ్వరో కాదు.. సోనూసూద్.
సోనూసూద్ కు దేశవ్యాప్తంగా ప్రజల్లో ఎంత అసామాన్యమైన క్రేజ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కరోనాకాలంలో మన దేశంలో దిక్కులేని వారందరికీ అనుపమానమైన ఆపద్బాంధవుడిగా సోనూసూద్ పేరు తెచ్చుకున్నారు. ఆయనను బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోడానికి చాలా సంస్థలు ఎగబడ్డాయి. చాలా పరిమితంగా మాత్రమే ఒప్పుకున్నాడు. డబ్బు కోసం ఎగబడి ఎవడికి పడితే వారికి ప్రచారం చేయడానికి దిగజారలేదు.
సోనూసూద్ పేదలకు సాయంచేయడంలో మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని విలువలకు కట్టుబడిన జీవనశైలినే గడుపుతున్నాడు. తను నమ్మే విలువలకు భంగం రాని పనినే చేస్తుంటాడు. అలాంటి సోనూసూద్ నివాసంపై ఆదాయపు పన్ను అధికారులు సోదాలు నిర్వహించారు. ముంబాయిలో ఆయన నివాసంతో పాటు, లఖ్‌నవూలోని కంపెనీలో కూడా ఈ సోదాలు జరిగాయి. ఆదాయ వివరాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సోదాలు నిర్వహించినట్లుగా చెబుతున్నారు.
సోనూసూద్ ఆదాయపం విషయంలో పన్ను ఎగవేత విషయంలో దేశాన్ని వంచించడానికి ప్రయత్నిస్తాడా? లేదా ఇలాంటి ఐటీ దాడుల బూచిని చూపి ఆయనను లొంగ దీసుకోవడానికి కేంద్రంలోని రాజకీయ నేతలు, బడాబాబులు వ్యూహరచన చేస్తున్నారా? అనే సందేహాలు ఇప్పుడు అందరిలోనూ కలుగుతున్నాయి. అందుకే సోషల్ మీడియాలో ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి.
తెరవెనుక రీజన్ ఇదేనా..
దిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థలకు మార్గదర్శనం చేయడం కోసం ‘దేశ్ కే మెంటార్స్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్ ఇటీవలే నియమితులయ్యారు.
దేశంలో.. మోడీ సర్కారుకు చుక్కలు చూపిస్తున్న రాష్ట్రప్రభుత్వాల్లో దిల్లీ కూడా ఉంది. కేజ్రీవాల్.. మోడీ విధానాల్ని తూర్పారపడుతూ, భాజపాయేతర ముఖ్యమంత్రుల్ని కూడగట్టడంలో కూడా కీలకభూమిక పోషిస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వ కార్యక్రమానికి మంచి పేరు వచ్చేలా సోనూసూద్ వారికోసం పనిచేయడం కేంద్రానికి గిట్టలేదా? అనే అభిప్రాయం కలుగుతోంది. కేజ్రీ బంధాన్ని వదులుకోవాలని హెచ్చరించేలా ఐటీదాడులు చేయించారని అనుకుంటున్నారు.
సోనూసూద్ మాత్రం.. దేశ్ కే మెంటార్స్ కార్యక్రమం కోసం పనిచేయడానికి, రాజకీయాలకు సంబంధం లేదని అంటున్నారు. కానీ మంచి వాడిని చూసి ఉలికిపాటుకు గురయ్యే పాలకులు ఉన్నంత కాలం.. ఇలాంటి అవకతవక ఐటీదాడులు జరుగుతూనే ఉంటాయి.
ఇప్పటికీ ప్రతిరోజూ కొన్ని వందల వేల వినతులు పేదల నుంచి సోనూసూద్ కు అందుతూనే ఉన్నాయి. వాటిలో అనేకం పరిష్కారం అవుతూనే ఉన్నాయి. ఇలాంటి వ్యక్తిని టార్గెట్ చేసి అభాసుపాలుకావడం మోడీ సర్కారుకే చెల్లింది.
.
Discussion about this post