మీకు కాఫీ పిచ్చి ఉందా..? రోజుకు అయిదారు సార్లయినా చిక్కటి పాలతో కాఫీ తాగందే.. మీకు మూడ్ సరిగా పనిచేయదా? మీ కాఫీ ప్రేమ మంచిదే కానీ.. ఆ దేశంలో అడుగుపెట్టారంటే మాత్రం.. ఆ స్థాయి పిచ్చికి మీరు ఆస్తులు అమ్మాల్సి వస్తుంది. ఎందుకంటారా?
లీటరు పాలు యాభైరూపాయలకు దొరికే మన హైదరాబాదులోనే.. కొన్ని స్టార్ హోటళ్లలో కప్పు కాఫీకి అయిదారు వందల రూపాయలు ముక్కుపిండి మరీ వసూలు చేస్తుంటారు. అలాంటిది లీటరు పాలు పన్నెండువందల రూపాయలు అంటే.. ఇక కాఫీ రేటు ఎంత ఉంటుంది? స్టార్ హోటల్ సంగతి పక్కన పెట్టండి.. రోడ్డు పక్కన కాకా హోటల్లో తాగాలన్నా సరే.. ధర వేలరూపాయలకు చేరుతుంది.. ఎందుకంటే.. పాలు ఒక్కటే కాదు.. వంటగ్యాస్ ధర కూడా అంటించకుండానే అతిభయంకరంగా మండుతుంటుంది..
Sri Lanka: లీటరు పాలు రూ.1195, సిలిండరు రూ.2657
మన పొరుగు దేశం శ్రీలంకలో ఆహార సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. ఇప్పటికే ఆ దేశంలో ఆహార అత్యవసర పరిస్థితి కూడా ప్రకటించారు. తాజాగా ఆహార పదార్థాల ధరలతో పాటు వంట గ్యాస్ ధర చుక్కలనంటుతోంది. నిత్యావసర, ఆహార పదార్థాలపై ధరల నియంత్రణ ఎత్తివేయడంతో లీటరు పాలు ఏకంగా రూ.1195కు చేరాయి. ఇక గ్యాస్ సిలిండరు ధర అయితే ఏకంగా రూ.2657కు చేరింది. దీంతో లంక ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేయలేక గగ్గోలు పెడుతున్నారు.
ధరాఘాతం ఎందుకు ఏర్పడింది
గత ఏడాది శ్రీలంక ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. రసాయనాలు, ఎరువులు వినియోగాన్ని నిలిపివేసి పంటలన్నీ సేంద్రీయ పద్దతిలో సాగు చేయాలని ఆదేశించారు. దీంతో అనేక పంటల దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. దీనికి తోడు కరోనా వల్ల దిగుమతులపై ప్రభావం చూపింది. దీంతో నిత్యావసరాల కొరత తీవ్రమైంది. వినియోగం, సరఫరా మధ్య అంతరం పెరిగిపోయింది. దీంతో లంక ప్రభుత్వం ఆహార ఎమర్జెన్సీని కూడా ప్రకటించింది. ధరలపై నియంత్రణ ఎత్తి వేసింది. దీంతో ఏ వస్తువు ధర ఎంత వరకు పెరుగుతుందో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
గత వారం రూ.1400 ఉన్న గ్యాస్ సిలిండర్ వారంలోనే రూ.2657కు ఎగబాకింది. అంటే వారంలో గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.1257 పెరిగింది. గత వారం లీటరు పాలు రూ.250 ఉండగా నేడు రూ.1195కు చేరింది. అంటే వారంలో లీటరు పాల ధర ఏకంగా 900 శాతం పెరిగింది. గోధుమపిండి, పంచదార, సిమెంటు ధరలు కూడా ఆకాశానికి అంటాయి. ధరలు విపరీతంగా పెరగడంతో ధరలు తగ్గించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
.

Discussion about this post