ఇతరులు మనల్ని ఎంతగా ప్రభావితం చేయగలరు. సమూలంగా మన మౌలిక లక్షణాలను కూడా వారు మార్చేయగలరా? సాధ్యమేనా? మనలో ఎలాంటి ఆసక్తి లేకుండా.. కేవలం ఇతరుల ప్రభావం వల్లనే మనం ‘మారిపోవడం’ అనేది జరుగుతుందా?
‘ఆరునెలలు సావాసం చేస్తే వాడు వీడైపోతాడు’ అని అంటారు. ఇది నిజమేనా? సావాసదోషానికి అంత ప్రభావం ఉంటుంది. ‘వీడి’లోని లక్షణాలు వాడికి రుచించకుండానే.. మారడానికి స్వతహాగా వాడికి ఇష్టం లేకపోయినా సరే.. కేవలం సావాస దోషం వల్ల ‘వాడు’- వీడుగా మారిపోవడం జరుగుతుందా? ఇది చాలా చిక్కు ప్రశ్న.
ఈ సందేహానికి, ప్రశ్నకు ఓ సుభాషితం మనకు చాలా సరళమైన రీతిలో జవాబు చెబుతుంది.
వికృతిం నైవ గచ్ఛన్తి సంగదోషేణ సాధవః
ఆవేష్ఠితం మహాసర్పైః చందనం న విషాయతే
దుష్టులతో కలసి ఉండడం అనేది మంచివాళ్లలో చెడు అలవాట్లను ప్రేరేపించడం అనేది జరగదు. ఎలాగంటే.. చందన వృక్షాన్ని విషనాగులు చుట్టుకుని ఉన్నంత మాత్రాన.. ఆ చెట్టును విషపూరితం చేయలేవు కదా. .. అనేది శ్లోకభావం.
మనలో ఎవరైనా హఠాత్తుగా బాగుపడిపోతే.. ఫలానా వాళ్ల ప్రభావం వల్ల బాగుపడ్డాడని కొందరు అంటారు. అలాగే.. వాడి స్వయంకృషి, అని స్వయం ప్రతిభ అని కొందరు కితాబు ఇస్తారు. సక్సెస్ సాధించినప్పుడు మాత్రం రకరకాల కారణాలను అనేకరకాలుగా వివరిస్తారు. Success has many fathers అని సామెత చెప్పిన చందంగానే ఈ వ్యవహారం అంతా ఉంటుంది.
ఎవడైనా ఒక వ్యక్తి.. చెడు తోవ తొక్కితే.. పాడైపోతే.. అతని కుటుంబసభ్యులు, మిత్రులు ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేస్తారు. ఫలానావారితో చేరాడు.. సావాసదోషం వల్ల చెడిపోయాడు అని! చెడిపోయిన సందర్భాల్లో ఒకే ఒక్క కారణం ఎక్కువగా కనిపిస్తుంటుంది. అదే ‘సావాసదోషం’!
చెడిపోయినప్పుడు.. అందుకు గల కారణాల్ని నిందలుగా వేరే వాళ్ల మీదకు నెట్టేయడం అనేది చాలా సహజంగా జరిగిపోయే సంగతి. అయితే చెడిపోయే ప్రతివాడూ కేవలం సావాసదోషం వల్ల మాత్రమే చెడిపోతుంటాడా? కేవలం ఇతరుల వల్ల మాత్రమే చెడిపోతామా? అనేది అసలు చర్చ.
మనిషి బాగుపడినా, చెడిపోయినా అతనిలోని అంతఃచైతన్యమే అందులో ప్రధాన భూమిక పోషిస్తుంది. అంతే తప్ప.. కేవలం ఒకరి స్ఫూర్తి వలన మహానుభావులు అయిపోవడం గానీ, ఒకరి సావాసం వలన దుర్మార్గులుగా మారిపోవడం గానీ జరగదు.
అబ్దుల్ కలాం కొన్ని కోట్ల మందికి ఆదర్శంగా కనిపిస్తాడు. కానీ ఆయన బాటలో నిరాడంబరతను, నిజాయితీని అలవాటు చేసుకున్న వారెందరు ఉంటారు? కనీసం ఆయనతో కలసిమెలిసి తిరిగిన సహచరులైనా ఆ లక్షణాలను అంతగా అలవాటు చేసుకున్నారా? లేదు కదా?
అలాగే దుర్మార్గులు కూడా వారి అంతఃచైతన్యంలో అలాంటి బుద్ధి లేకుండా.. కేవలం సావాసదోషం వల్ల తోవ తప్పిపోరు. సుభాషితకారుడు చెబుతున్నది నిజం.. విషనాగులు అనేకం చుట్టుకుని ఉన్నా సరే.. చందన వృక్షం విషపూరితం అయ్యే అవకాశమే లేదు. అది చందన పరిమళాలు వెదజల్లుతుందే తప్ప.. విషం అనిపించదు. కాబట్టి ఎవరు పెడతోవ పట్టినా.. నింద మరొకరి మీదకు నెట్టేందుకు చూడకుండా.. అసలు కారణాల్ని విశ్లేషించుకోవడమే మంచిది. వ్యక్తులు బాగుపడినా కూడా అంతే. వారిలోని అంతఃచైతన్యమే అసలైన డ్రైవింగ్ ఫోర్స్.
శుభోదయం
EXCLUSIVE ARTICLES
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
.
Discussion about this post