సాధారణంగా లోకంలో పనులు రెండు విధాలుగా జరుగుతుంటాయి.. చెప్పి చేసేవి.. చేసి చెప్పేవి.. కానీ, చెప్పినవన్నీ చేస్తామా? చేసినవన్నీ చెప్తామా? అన్న ప్రశ్నకు ఎవరూ సరైన సమాధానం చెప్పలేరు.
ఎందుకంటే.. అలా ఉండడం ఎవరివల్లా సాధ్యంకాదు. కానీ, ఆ విషయాన్ని ఎవరూ అంగీకరించరు. పైగా ‘నేను చెప్పిందే చేస్తాను. చేసేదే చెప్తాను’ అని కొంతమంది తెగ వాగ్దానాలు చేసేస్తుంటారు. కానీ, నిజజీవిత వ్యవహారాలలో అందుకు విరుద్ధంగా నడచుకొంటుంటారు.
ఎలాగంటే.. ఉదాహరణకు:
సత్యమునే పలుకవలెను, ఎవరినీ మోసం చేయరాదు, సమయపాలన పాటించవలెను.. లాంటి వాక్యాలను తరగతి గదిలో ఉపాధ్యాయుడు పిల్లలకు తెగ బోధించేస్తుంటాడు. కానీ, తను మాత్రం నిజ జీవితంలో అబద్దాలు చెప్పడం, ఇతరులను మోసం చేయడం, అప్పుడప్పుడు పాఠశాలకు ఆలస్యంగా రావడం లాంటివి చేస్తుంటాడు. కానీ, తాను చేసేవి తప్పని అంగీకరించడు, ఆ దిశగా ఆలోచించడు కూడా. పైగా ఆలస్యంగా వచ్చిన పిల్లలను మందలించడం, దండించడం చేస్తుంటాడు. ఎంత విచిత్రమో చూడండి.
అలాగే.. మేం అధికారంలోకి వస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కాకుండా అవినీతి రహిత సమాజాన్ని నిర్మిస్తామని రాజకీయ నాయకులు తెగ వాగ్దానాలు చేసేస్తుంటారు. తీరా అధికారం లోకి వచ్చాక అందుకు విరుద్ధంగా పరిపాలన సాగుతూ ఉంటుంది.
అందుకు ప్రభుత్వాలను నిందించలేం. ఎందుకంటే ప్రభుత్వం అంటే ప్రజా ప్రతినిధులేకాదు. అధికారులు, ప్రజలు కూడా. ప్రభుత్వం సత్సంకల్పంతోనే పథకాలు ప్రవేశపెడుతుంది. కానీ, ఒక్కొక్కసారి కింది స్థాయి ఉద్యోగుల అవినీతి, అలసత్వంతోపాటు ప్రజల అత్యుత్సాహం వల్ల కూడా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది.
సమాజంలో జరిగే అక్రమాలు, అవినీతిని ఎండగడుతూ న్యూస్ పేపర్లలోనూ, టి.వీలలోనూ మీడియా వాళ్ళు తెగ ప్రసారం చేసేస్తుంటారు. తీరా నిజ జీవితంలో వాళ్ళే కొన్ని సందర్భాలలో చెప్పినదానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు.
ఎలాగంటే.. ఉదాహరణకు:
పలానా గుడిలో రాజకీయ నాయకులకు, బడాబాబులకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల సామాన్య భక్తులకు దైవ దర్శనం కష్టతరంగా మారిపోతోందని టీవీలలో చూపించడమో, పేపర్లో రాయడమో చేస్తుంటారు మీడియా వాళ్ళు. తీరా వాళ్ళు దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ రాజకీయ నాయకులు లేదా బడాబాబుల పలుకుబడినే ఉపయోగించి శీఘ్ర దర్శనాలు చేసుకుంటుంటారు. ఎంత విచిత్రమో చూడండి!!
టీచర్లు, రాజకీయ నాయకులు, మీడియా వాళ్ళే కాదు సమాజంలో సామాన్య ప్రజలు కూడా తెలిసో, తెలియకో ఇలా ప్రవర్తిస్తుంటారు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
ఇలా చేయడం తప్పని నేను చెప్పడంలేదు. దీనివల్ల వచ్చిన నష్టమేమిటంటే.. అలా ప్రవర్తించిన వ్యక్తులు సమాజంలో విశ్వసనీయత, గౌరవం కోల్పోతారు.
అందుకే.. సాధ్యమైనంత వరకు చెప్పిందే చేయడాన్ని, చేసిందే చెప్పడాన్ని అలవాటు చేసుకుంటే సమాజంలో మన పట్ల గౌరవం, విశ్వసనీయత ఏర్పడుతుంది.
…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159

.

Discussion about this post