పెట్రో ధరలు యావద్భారత దేశంలో సామాన్యుడి జీవితంతో ఆటాడుకుంటున్నాయి. రోజురోజుకూ కొండెక్కుతూ ఉన్నాయి. లీటరు పెట్రోలు 200 రూపాయల మార్కును చేరినా ఆశ్చర్యం లేదనిపించే పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో.. పెట్రో ధరల పెంపునకు వ్యతిరేకంగా పోరాడే వైఖరి మాత్రం రాజకీయ నాయకుల్లోను, ప్రజల్లోను కూడా కొరవడుతోంది. భారతీయ జనతా పార్టీ మాత్రం.. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే సామెత గుర్తు చేయడమే తమాషా!
భారతీయ జనతా పార్టీ ఉద్యమంలోకి దిగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు చేయడానికి శనివారం నాటికి రంగం సిద్ధం చేసుకుంది. ఇంతకూ వారి పోరాట అంశం ఏమిటో తెలుసా? పెట్రో ధరల పెంపుపై వ్యతిరేకత!
ఇదేంటి చెప్మా..! పెట్రోధరలను పెంచుతున్నదే భారతీయ జనతా పార్టీ కదా.. ధరల పెంపునకు వ్యతిరేకంగా వారు ఆందోళనలు ధర్నాలు చేయడం ఏమిటా? అనుకుంటున్నారా? అదే మరి ట్విస్టు. పెట్రోలియం ధరల మీద రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్ పన్నును తగ్గించాలనే డిమాండ్ తో వారు ధర్నాలకు దిగుతున్నారు.
శనివారం నాడు కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల వద్ద పెట్రోలు, డీజిల్ ధరలు పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ టాక్స్ తగ్గించాలంటూ బిజెపి ధర్నాలు చేయబోతోంది. ఈ మేరకు బీజేపీ అధ్యక్షుడు శ్రీ సోము వీర్రాజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరలపై ఏపీ ప్రభుత్వం వ్యాట్ తగ్గించక పోవడాన్ని బీజేపీ నిరసిస్తోంది. అన్ని జిల్లా, పార్లమెంట్ కేంద్రాల వద్ద ఉదయం 11 నుండి 12 గంటల వరకు భారీ నిరసనలు చేపట్టనున్నారు. ప్రభుత్వం దిగి రాకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని కూడా బిజెపి రాష్ట్ర అద్యక్షుడు శ్రీ సోమువీర్రాజు హెచ్చరిస్తున్నారు. అచ్చంగా వీరి ఉద్యమంలో పాలుపంచుకోకపోయినప్పటికీ.. జనసేన కూడా ఇదే తరహా డిమాండ్ ను వినిపిస్తోంది.
పెట్రోధరల పెంపు విషయం పూర్తిగా కేంద్రానికి సంబంధించింది. అయితే ఒక వైపు ధరలను అమాంతం పెంచేస్తూ.. వాటిమీద కేంద్రం విధించే వ్యాట్ ను మాత్రం కొంత తగ్గించారు. అక్కడికేదో తాము దేశ ప్రజలకు మహోపకారం చేసేసినట్టుగా భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. కేంద్రం చేసిన పని రాష్ట్రాలన్నీ కూడా చేయాల్సిందేనని, రాష్ట్రాలన్నీ కూడా వ్యాట్ ను తగ్గించాలని భావిస్తున్నట్టుగా ఉంది.
ఆ నేపథ్యంలోనే ఏపీ సర్కారు వ్యాట్ తగ్గించాలనే డిమాండ్ తో ప్రస్తుతం బీజేపీ దీక్షలు జరగబోతున్నాయి. అసలు ధరలను భారీగా వడ్డించేస్తూ.. వ్యాట్ తగ్గించాం అనే ఉపశమనపు మాటలు పలకడం.. వాత పెట్టి వెన్న రాసినట్టుగా ఉన్నదని బీజేపీ తీరుమీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆ ధైర్యం వైసీపీకి ఉందా..
ఏదో కేంద్రం కొంత వ్యాట్ తగ్గించింది ఓకే. కానీ.. పెట్రో ధరల భారం పాపం మొత్తం రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదే అన్నట్టుగా రంగు పులుముతూ.. బీజేపీ ఉద్యమాలకు దిగుతోంది. వీరి పోరాటాన్ని ప్రజలు గమనిస్తే.. వైసీపీ ప్రభుత్వానిదే నేరం అనుకునే ప్రమాదమూ ఉంది. అయితే ఇలాంటి సమయంలో.. పెట్రోభారం అనేది కేంద్రం పాపం అని ప్రజలకు తెలియజెప్పేది ఎవరు?
also read : బద్వేలు ఫలితం నుంచి జగన్ నేర్చుకోవాల్సిన పాఠమేంటి?
ముష్టి విదిలించినట్టుగా వ్యాట్ కొంత తగ్గించి.. రాష్ట్రాలను నిందిస్తున్న కేంద్రం- అసలు పెంపు విషయంలోనే నియంత్రణ ఎందుకు పాటించడంలేదని అడగగల ధైర్యం ఎవరికి ఉంది? జగన్ సర్కారు మీద నింద వేయడానికి బీజేపీ తెగించింది. అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే భారం పెంచుతున్నదని… వారికి వ్యతిరేకంగా రాష్ట్రమంతా దీక్షలు, నిరసనలు చేయగల ధైర్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా? అనేది కీలకమైన అంశం.
టీడీపీ మీదనైతే ఒంటికాలిపై లేస్తారు..
ఇటీవలి పరిణామాలను గుర్తు చేసుకోవాలి. టీడీపీ ఆఫీసుపై దాడి జరిగితే.. వారు రాష్ట్రవ్యాప్త ధర్నాలకు పిలుపు ఇచ్చారు. దానికి కౌంటర్‌గా వైసీపీ శ్రేణులు కూడా రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు నిర్వహించాయి. టీడీపీమీదనైతే ఒంటికాలిపై లేచే వైసీపీ దళాలు.. అదే పోరాట పటిమను, కౌంటర్ దీక్షలు చేసే తెగువను బీజేపీపై కూడా ప్రదర్శిస్తాయా? మోడీ పాలన వల్లనే పెట్రో ధరలు పెరుగుతున్నాయనే విషయం ప్రజలకు అర్థమయ్యేలా వైసీసీ ఉద్యమాలు చేయగలుగుతుందా? అనే ప్రశ్న పలువురిలో కలుగుతోంది.
తెలుగుదేశంపై పోటీ దీక్షలు చేస్తూ.. నిందలతో బీజేపీ విరుచుకుపడినా.. పోటీ దీక్షలు చేయకపోతే గనుక.. కేంద్రానికి, మోడీకి జగన్ సర్కారు సాగిలపడినట్లే భావించాల్సి ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
.

Discussion about this post