ఊహకు అందనంత రాజకీయ వ్యూహాలకు ఇప్పుడు కుప్పం కేంద్ర బిందువుగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిగువన ఒక మూలకు ఎవ్వరి దృష్టి కూడా పడనంత అల్పంగా కనిపించే, కుప్పం ఇప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ గా నడుస్తోంది. కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికలు ఆ ఊరికి ఇప్పుడు ఎక్కడలేని ప్రాధాన్యాన్ని తెచ్చిపెట్టేశాయి.
నలభయ్యేళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన రికార్డు, మూడుసార్లు సీఎం అయిన చరిత్ర కలిగిఉన్న నారా చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాకపోతే గనుక.. అసలు కుప్పం గురించి ఎవ్వరూ పట్టించుకునే వాళ్లు కూడా కాదు. చంద్రబాబు నియోజకవర్గం కావడం వల్ల.. అందరి దృష్టి అక్కడ ఉంది.
కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశానికి ఠికానా లేకుండా చేయాలనేది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ వ్యూహం. స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగినట్టుగానే.. నామినేషన్ల పర్వంలోనే వారు తమ కార్యచరణను రుచిచూపించేస్తున్నారు.
కొందరి నామినేషన్లను చించేయడం, టీడీపీ అభ్యర్థి ప్రకాశ్ కిడ్నాప్ కు గురయ్యాడంటూ గుప్పుమన్న పుకారు.. ఆ తర్వాత దానికి కౌంటర్ గా ఖండన. అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించకుండా అధికారులు కుమ్మక్కు అయ్యారంటూ మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపణలు ఇవన్నీ హైడ్రామాను తలపిస్తున్నాయి.
నకిలీ, ఫోర్జరీ సంతకాలతో అసలు అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరించినట్లుగా ప్రకటిస్తున్నారనేది తెలుగుదేశం చేస్తున్న తీవ్రమైన ఆరోపణ. ఈ ఆరోపణ నిజమని తేలితే గనుక.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనం ఘనంగా చెప్పుకునే భారతదేశంలో ప్రజాస్వామ్యం- ఎన్నికల వ్యవస్థకు సంబంధించిన నియమ నిబంధనలను అన్నింటినీ ఒకసారి సవరించుకోవాలి. మన దేశం ప్రజాస్వామ్యం పూర్తిగా పరిహాసాస్పదం అయినట్లు లెక్క.
ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లను ఉపసంహరించారనే చంద్రబాబు ఆరోపణ నిజమో కాదో తేలాలి. ఆరోపణ నిజమని తేలాలంటే.. ఎన్ని మల్లగుల్లాలు పడాల్సి ఉంటుందో అర్థం కావడం లేదు. ఎన్నెన్ని కొత్త ఆధునిక సాంకేతిక విధానాాలు అవలంబించాల్సి ఉంటుందో తెలియడం లేదు. నామినేషన్లు కోల్పోయిన అభ్యర్థులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి.
వారికి ఈ సమయంలో బహు మంచి బేరం నడుస్తూ ఉంటుంది. ‘మేమే స్వచ్ఛందంగా నామినేషన్లు ఉపసంహరించుకున్నాం’ అని గనుక వారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారంటే.. అక్కడితో చంద్రబాబునాయుడు పరువు పోతుంది. వైరి పక్షానికి, వైఎస్సార్సీపీ కి కావాల్సింది కూడా అదే. కుప్పం విజయం కంటె చంద్రబాబు పరువు పోవడమే వారికి ముఖ్యం గనుక.. అందుకోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు.
ఇవాళ రేపట్లో కుప్పం మునిసిపల్ ఎన్నికల ఖాతాలో.. మరెన్ని అనూహ్యమైన రాజకీయ ఎత్తుగడలు, చరిత్రలో కొత్త అధ్యాయాలు సృష్టించే కుట్రలు, కూహకాలు, వ్యూహాలు ఎత్తుగడలు నడుస్తాయో వేచిచూడాలి.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
.

Discussion about this post