అబ్బబ్బ.. ఏం మ్యాచ్‌రా బాబూ.. అన్ని మ్యాచ్‌లూ నాకు నచ్చలేదా.. లేక పాకిస్తాన్ ఓడిపోయిందనే నాకిలా అనిపిస్తుందా. ఏదో ఒకటి.. మొత్తానికి టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ ఓడిపోయింది.. అదే ఆనందం.. ఎందుకంటే నేను సాదాసీదా సగటు భారతీయుడిని.. నాకు పార్టీలూ, మతాలు, మన్నూమషాణాలేవీ లేవు.
నేనొక మామూలు క్రికెట్ అభిమానిని. ఆటలో గెలుపోటములు సహజమే అని నేను అస్సలు సర్దుకుపోలేను. ఇండియా ఓడితే బాధపడతా.. అలాగే మనల్ని ఓడించిన వాళ్లను ఇంకొకడు ఓడిస్తే సంతోషిస్తా..!
పాకిస్తాన్ చేతిలో ఓడినప్పటి నుంచీ లోలోపల రగిలిపోతున్న నేను.. సెమీస్ ఆశలతో అఫ్గానిస్తాన్ పార్ట్ టైమ్ ఫ్యాన్ అయ్యా.. కానీ లాభం లేదు.. ఈజీగా న్యూజీలాండ్‌కు మ్యాచ్ ఇచ్చేశారు.. సెమీస్ ప్లేసులు ఫిక్స్ కాగానే.. వెంటనే ఆస్ట్రేలియాను చీర్ చేయాలనుకున్నా..
చీర్ చేసినంత మాత్రాన మ్యాచ్ గెలిచిపోతారని అనుకోవడం అంత ఈజీ కాదని నాకు తెలుసు. కానీ ఏదో మూల చిన్న ఆశ.. సెమీ ఫైనల్ చేరడానికే నానా కష్టాలూ పడ్డ కంగారూలు.. సెమీస్‌లో పాకిస్తాన్ గర్వం కాస్తైనా అణిచేస్తార్లే అని ఏ మూలో ఫీలింగ్.. పాకిస్తాన్ టాస్ ఓడగానే దానికి మరింత బలమైంది.
ఒకప్పుడు సెకండ్ బ్యాటింగ్ అంటేనే ఒత్తిడిలో కూరుకుపోయే పాకిస్తాన్.. యూఏఈ పిచ్‌ల గురించి సర్వం తెలిసుండడంతో వెంటనే బ్యాటింగ్ ఎంచుకుంటూ వచ్చింది, బంతి స్వింగ్ అవడంతో ప్రత్యర్థి జట్లను ఇబ్బంది పెట్టింది ఆ టాస్ గెలవడం వల్లే కదా..
ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు.. పాక్ ఓపెనర్లు మళ్లీ నిలబడ్డంతో రెండొందలు కొట్టేసి మనోళ్లకు కష్టాలు తెస్తారా అనే ఎక్కడో సందేహం.. అదే జరిగింది.. 70 దాటించే వరకూ బాబర్ ఆజం ఆగలేదు, ఆ తర్వాత అతడి పార్టనర్ ఆ స్కోరుకు మరో 70 కలిపేవరకూ అవుటవలేదు.. ఇద్దరూ అవుటయ్యేక ఊపిరొచ్చింది. ఇక చివర్లో ఆసీస్ బౌలర్లు కంట్రోల్ చేయడం మూడు వికెట్లు పడగొట్టడంతో 200 అవుతుందని అనుకున్న స్కోర్ బదులు 176 పరుగులే వచ్చాయి..
కొట్టేస్తార్లే అనుకుంటున్న సమయంలోనే షాక్.. కెప్టెన్ ఆరాన్ ఫించ్ అదే షాహీన్ అఫ్రిదీకి డకౌట్.. మళ్లీ డౌట్.. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ స్కోరు 50 దాటించగానే కాస్త రెండో వికెట్ పడడం, ఆ తర్వాత వెంటవెంటనే మరో రెండు వికెట్లు పడడంతో టెన్షన్ పీక్స్ వెళ్లింది.. కానీ చివర్లో మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ ఈ టోర్నీలో ఓటమి ఎరుగని పాక్‌కు దాన్ని రుచిచూపించారు.
భారత్ సూపర్ 12లోనే ఇంటికొచ్చినప్పటి నుంచీ లోలోపల రగిలిపోతున్న నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. పాకిస్తాన్ జట్టుతో మనం ఓడిపోయామని కాదు. ఆ జట్టు మంచి టీమ్ స్పిరిట్‌తోనే ఆడింది. మనోళ్లలాగా.. కానీ ఆ వైపున్నోళ్లే #byebyeindia అని ట్రెండ్ చేసినందుకు నాకోపం నషాళానికంటింది.
ఇప్పుడు ఎంత హాయిగా ఉందో..
ఇప్పుడు ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ చూశాక ఎంత హాయిగా ఉందో! ముఖ్యంగా ఈ టోర్నీ తొలి మ్యాచ్ తొలి ఓవర్లో భారత తొలి వికెట్ పడగొట్టి టీమిండియా ఆత్మవిశ్వాసం దెబ్బతీసిన షాహీన్ అఫ్రిదీ బౌలింగ్‌లోనే మాథ్యూ వేడ్ వరసగా మూడు బంతులకు ఒక్కో సిక్సూ బాదుతుంటే.. చూడ్డానికి 43 ఇంచిల టీవీ కూడా సరిపోదేమో అనిపించింది. భారత్ విజయాలతో ఈ కిక్ రాకున్నా.. పాక్ ఓటమితో వచ్చిన ఈ ఫీలింగ్.. వచ్చే ఏడాది ప్రపంచకప్ వరకూ మనసంతా ఉంటుంది.
– ఒక సగటు భారత క్రికెట్ అభిమాని
.