అరిషడ్వర్గం అనేవి మనకు తెలుసు. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఇవి. అవి మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే లక్షణాలు. వ్యక్తిత్వం సంగతి సరే.. కార్యసాధనలో మన ప్రయత్నాన్ని దెబ్బతీసే లక్షణాలు కొన్ని ఉంటాయి.
కార్యసాధనలో సంకల్పబలం, శ్రమకు వెరవకపోవడం, పట్టుదల ఇలాంటి లక్షణాలెన్నో మనకు ఉపయోగపడతాయి. ముందుకు నడిపించే లక్షణాలు మనకు అనేకం తెలుసు. ఇంకా సక్సెస్ కు బాటలు వేసే టెక్నిక్స్ అనేకం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం కూడా. కానీ కార్యసాధనలో వెనక్కు లాగే అంశాలు ఏమిటి? వాటి గురించి తెలుసుకోవడం కూడా సక్సెస్‌కు అంతే ముఖ్యం.
పంచతంత్రం మనకు చెప్పే సుభాషితం ఇది..
షడ్ దోషాః పురుషేణేహ హాతవ్యా భూతిమిచ్ఛతా
నిద్రా తంద్రా భయం క్రోధః ఆలస్యం దీర్ఘసూత్రతా
ఈ ప్రపంచంలో సఫలవంతమైన వ్యక్తిగా మనుగడ సాగించాలనుకునేవాడు.. ఆరుగుణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టాలి. అతినిద్ర, ఉదాసీనత, భయం, క్రోధం, ఆలస్యం చేయడం, పనిని సాగతీయడం.. అనేవే ఆ ఆరుగుణాలు. ..అనేది శ్లోకభావం.
కార్యసాధకుడు ఈ ఆరు లక్షణాలను విడిచి పెడితే చాలు.. సక్సెస్ దానంతట అదే వచ్చి వరిస్తుందని అన్నట్లుగా ఈ సుభాషితం మనకు ఓ స్ఫూర్తినిస్తుంది.
విజయం సాధించాలంటే.. When to fight తెలియడం మాత్రమే కాదు.. When to quit తెలియడం కూడా చాలా చాలా ముఖ్యం. ‘ఎక్కడ నెగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పవాడని’ మనకు సినిమా డైలాగులు కూడా ఉన్నాయి. అదే రీతిగా కార్యసాఫల్యతకు ఏయేగుణాలు కలిగిఉండాలో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో.. ఏయే గుణాలు విడిచిపెట్టాలో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం.
ఈ సుభాషితం ప్రత్యేకత ఏంటంటే.. ఆరుగుణాలు విడిచిపెట్టాలని చెబుతుంది. కానీ.. ఒకటిరెండు గుణాలు ఒకేతరహాగా మనకు కనిపిస్తాయి. కానీ వాటి మధ్య చాలా సున్నితమైన తేడా ఉంటుంది. అంటే అంత సునిశిత దృష్టితో- వివరణతో- ఆ లక్షణాలను విడిచి పెట్టాల్సిందిగా పంచతంత్రం మనకు ఉద్బోధిస్తోంది. ఇంతకూ ఆ ఆరు లక్షణాలను మరింత వివరంగా చూద్దాం.
నిద్ర.. నిద్రపోకుండా పనిచేయాలనేది సుభాషితం ఉద్దేశం కాదు. అతినిద్ర తగదని మాత్రమే ఇది చెబుతుంది. పనిచేయాల్సిన సమయంలో నిద్రావస్థలో ఉండడం తగదని చెబుతుంది. అలాగే.. చుట్టూ ఏంజరుగుతోందో తెలుసుకోకుండా ఉండడం కూడా నిద్రావస్థగానే పరిగణించాలి. అలాంటి లక్షణం తగదనేదే ప్రథమ హెచ్చరిక.
తంద్రా అంటే ఉదాసీనత. చేయవలసిన పనుల పట్ల ఉదాసీనంగా ఉండడం, అలసటతో బద్ధకంగా ఉండడం తగదు.
భయం దీనికి వివరణ అక్కర్లేదు. ఒక పని చేయాలని అనుకున్న తర్వాత.. దాని గురించి భయపడడం అనవసరం. అవుతుందో లేదో అనే భయం, గుంజాటన వెనక్కు లాగుతాయి. అందుకే నిర్భయంగా ముందుకు సాగిపోవాలి.
క్రోధం ఎలాంటి పనినైనా, బంధాన్నయినా చెడగొట్టగలిగేది క్రోధం. కోపంలో తీసుకునే ప్రతి నిర్ణయమూ ఖచ్చితంగా చేటు చేస్తుంది. అందుకే దానిని కూడా విడిచిపెట్టాలి.
ఆలస్యం అంటే జాప్యం చేయడం. చేయవలసిన పనిని ప్రారంభించకుండానే.. వాయిదా వేసుకుంటూ పోవడం ఆలస్యం. జాప్యం తగదు.
also read : జగన్.. ప్రభువు ప్రార్థన మిస్ కాకూడదనేనా? లేదా..
‘జగనన్నా ఆగలేం..’ వైఎస్సార్సీపీ ఆశావహుల గగ్గోలు
బద్వేలు ఫలితం నుంచి జగన్ నేర్చుకోవాల్సిన పాఠమేంటి?
దీర్ఘసూత్రతా ఇది కూడా ఒక రకం ఆలస్యం లాంటిదే. ప్రారంభించకుండానే జాగు చేయడం ఆలస్యం అయితే.. ప్రారంభించిన తర్వాత సరైన సమయంలో పూర్తి చేయకుండా సాగదీస్తూ పోవడమే ఈ దుర్లక్షణం. ఒక పనిని నిర్ణీత సమయంలో చేయకపోవడమే దీర్ఘసూత్రత.
ఈ లక్షణాల గురించి తెలుసుకున్న తర్వాత.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవి విడిచిపెట్టాల్సినవే అనే నమ్మకం మనకు కలుగుతుంది. ఈ ఆరింటినీ నిత్యం స్మరణలో ఉంచుకుంటే.. కార్యసాధనలో సక్సెస్ కూడా దక్కుతుంది.
శుభోదయం.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
.

Discussion about this post