విశాఖపట్టణంలో రైల్వే జోన్ వస్తుందా? రాదా? కేంద్రప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా చెబుతున్న మాటలను గమనిస్తే రాదని తేలిపోయినట్టే. దేశంలో కొత్త రైల్వేజోన్లు ఏమైనా రాబోతున్నాయా? అని పార్లమెంటులో ఎదురైన ప్రశ్నకు అలాంటి ఆలోచన ఏదీ లేదని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెగేసి చెప్పారు. ప్రస్తుతం ఉన్న 17 జోన్లు మాత్రమే కొనసాగుతాయని కూడా అన్నారు. తతిమ్మా దేశం పరిస్థితి ఏమో గానీ.. ఈ వ్యాఖ్య ఆ:ధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చాలా కీలకమైనది.
విభజన చట్టం నేపథ్యంలో రాష్ట్రానికి విశాఖ రైల్వే జోన్ రావాలి. అది చట్టంలో భాగం. ప్రత్యేక హోదా విషయంలో మొండి చెయ్య చూపించిన మోడీ సర్కారు.. ఈ విషయంలో కూడా నాటకాలే ఆడింది. ప్రత్యేకహోదా అనేది విభజన చట్టంలో లేదు అంటే.. పార్లమెంటు సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీని తుంగలో తొక్కిన వాళ్లు.. విశాఖ జోన్ విషయంలో చట్టంలో భాగంగా ఉన్న దాన్ని కూడా పట్టించుకోలేదు.
అందుకోసం రాష్ట్ర ప్రజలు చాలా పోరాడాల్సి వచ్చింది. ఎట్టకేలకు జోన్ ఇస్తున్నట్లు ఒక ప్రకటన చేశారు. ఆలస్యం అయితే కావొచ్చు గానీ.. విశాఖ జోన్ రావడం మాత్రం పక్కా అని రాష్ట్ర ప్రజలు అనుకుంటూ ఉన్న తరుణంలో ఇప్పుడిలా.. కేంద్రం కొత్త జోన్ల ఆలోచనే లేదని చేసిన ప్రకటన చర్చనీయాంశం.
ఈ సమయంలోనే రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు తమకు ఎంతెంత చిత్తశుద్ధి ఉన్నదో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. నాలుగు పార్టీలూ చాలా యాక్టివ్ గానే రాజకీయాలు చేస్తున్నాయి. కేంద్ర మంత్రి ప్రకటన నేపథ్యంలో.. విశాఖ జోన్ గురించి గళమెత్తే వారెవ్వరు? అనేది ప్రశ్నార్థకం.
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ విశాఖ పట్నం మీద తమకు అవ్యాజమైన ప్రేమ ఉన్నదని.. అందుకే కార్యనిర్వాహక రాజధాని అక్కడ పెడుతున్నామని చెబుతుంది. తెలుగుదేశం పార్టీ విశాఖలో ఇప్పుడున్న అభివృద్ధి మొత్తం తాము చేసినదే అని ప్రకటించుకుంటుంది. పవన్ కల్యాణ్ తీరు ఇంకో ఎత్తు. విశాఖ ఉక్కును తాను సాధించుకు వచ్చేస్తానని చెప్పిన తర్వాత.. ఆయన మళ్లీ ఇప్పటిదాకా పట్టించుకోలేదు.
ఇలా అన్ని పార్టీలు కూడా.. విశాఖ మీద ప్రేమానురాగాలను కురిపించే పార్టీలే. అయితే ఇప్పుడు విశాఖకు పెను నష్టం జరుగుతోంది. విశాఖకు హక్కుగా రావాల్సిన రైల్వే జోన్ ను కేంద్రం వంచనపూర్వకంగా ఎగ్గొడుతోంది. ఈ సందర్భంలో విశాఖ కన్నీళ్లను తుడవడానికి ఏ పార్టీ ముందుకు వస్తుంది? విశాఖ మీద తమకు నిజంగానే ప్రేమ ఉన్నదని నిరూపించుకునే పార్టీ ఏది? వారే తేల్చుకోవాలి.
తమ అవసరార్థం, తమ స్వార్థం, తమలో ఇతరుల పట్ల ద్వేషం కొద్దీ తీసుకునే నిర్ణయాలకు ‘విశాఖ ప్రేమ’ను పులిమి.. ప్రజల ఎదుట నాటకాలు ఆడడం కాదు. అసలు విశాఖ పట్టణం ప్రయోజనాలు, విశాఖ ప్రజల నిజమైన అభివృద్ధి, గురించి ఆలోచించే పార్టీ ఏదో, పనిచేసే వారెవ్వరో, పోరాడే పటిమ ఉన్నవారెవ్వరో ఇప్పుడు తేలాలి.
.

Discussion about this post