పవన్ కల్యాణేమో.. నిరంతరం వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలన మీద ఒంటికాలిపై లేస్తూ, విరుచుకుపడుతూ ఉండే ప్రతిపక్ష నాయకుడు, మరోవైపు ఎమ్మెల్యే రోజా ఏమో.. అధికార పార్టీకి అత్యంత విశ్వసనీయంగా ఉండే పార్టీ నాయకుల్లో ఒకరు! అలాంటిది.. పవన్ కల్యాణ్ మాటను ఎమ్మెల్యే రోజా ఫాలో కావడం ఏమిటా? అని ఆశ్చర్యపోతున్నారా? అదే మరి నగరి నియోజకవర్గంలో ట్విస్టు.
ఓటీఎస్ (వన్ టైం సెటిల్మెంటు) పేరుతో.. పేదల నుంచి దాదాపు అయిదు వేల కోట్ల రూపాయల దాకా ఖజానాకు రాబడి సృష్టించడం లక్ష్యంగా జగన్మోహన రెడ్డి సర్కారు కొత్త ఆలోచనను అమల్లో పెడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎప్పుడో పక్కాఇళ్లు నిర్మించుకుని.. ప్రభుత్వానికి బకాయిపడిపోయిన పేదలకు ఇది మేం అందిస్తున్న అపురూపమైన అద్భుతమైన అవకాశం అని ఒకవైపు ప్రభుత్వం చెప్పుకుంటోంది. అదే సమయంలో విపక్షాలు మొత్తం దీనిని దుమ్మెత్తిపోస్తున్నాయి. ప్రభుత్వం చేస్తున్న దోపిడీగా అభివర్ణిస్తున్నాయి.
ఈ ఓటీఎస్ అనేది పేదలకు ఆప్షన్ మాత్రమే అని, తమ పక్కాఇళ్లపై పూర్తి హక్కు కావాలనే కోరిక లేనివారు కట్టవలసిన అవసరం లేదని ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఒకవైపు ఆప్షన్ అంటూనే.. మరోవైపు.. గ్రామాల్లో వాలంటీర్లకు టార్గెట్లు నిర్ణయించి.. ఓటీఎస్ కు డబ్బులు చెల్లించాల్సిందిగా.. ప్రజలపై ఒత్తిడి పెంచుతున్నారు.
వైసీపీ సర్కారు కేవలం వాలంటీర్లకు మాత్రమే టార్గెట్లు నిర్ణయించిందో.. అటు ఎమ్మెల్యేలకు కూడా టార్గెట్లు నిర్ణయించిందో తెలియదు గానీ.. నగరి ఎమ్మెల్యే, వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా మాత్రం.. అచ్చంగా ఈ కార్యక్రమాన్ని భుజానికెత్తుకున్నారు. ఓటీఎస్ పై తన నియోజకవర్గంలో అవగాహన కల్పించేస్తున్నారు. ఆ కార్యక్రమాల్లోనే ప్రజలతో డబ్బు కూడా కట్టించేస్తున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ విషయానికి సరైన ప్రచారం కరవైందని ఆమె బాధపడుతున్నారు. జగనన్న పేదలకు ఇళ్లపై పూర్తి హక్కులు ఇవ్వడానికి అద్భుతమైన ఆలోచన చేస్తే.. టీడీపీ విషప్రచారం చేస్తున్నదని.. ప్రచారంచేసుకోవడంలో పార్టీ కేడర్ వెనుకబడుతున్నారని.. వైసీపీ కార్యకర్తలంతా.. ఈ ఓటీఎస్ పథకాన్ని కీర్తిస్తూ, పొగుడుతూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె పిలుపు ఇస్తున్నారు.
గబ్బర్ సింగ్ లో పవన్ కల్యాణ్ ‘ఎవడి డప్పు వాడే కొట్టుకోవాలహె..’ అంటూ ఒక అద్భుతమైన జీవితసత్యాన్ని బోధిస్తాడు. ఇప్పుడు రోజా ఫాలో అవుతున్న సూత్రం కూడా అదే అన్నట్టుగా కనిపిస్తోంది. ఓటీఎస్ డప్పు పార్టీ కార్యకర్తలంతా కొట్టాలని ఆమె డప్పు కొట్టి మరీ చెబుతున్నట్టుగా ఉన్నదని నియోజకవర్గంలో ప్రజలు నవ్వుకుంటున్నారు.
మామూలుగా అయితే పవన్ పేరెత్తితే.. రోజా శివాలెత్తుతారు గానీ.. ఈ విషయంలో పవన్ డైలాగే ఆమెకు ఆదర్శం కావడమే తమాషా..!
.

Discussion about this post