అల్లు అర్జున్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప’! రంగస్థలం వంటి హిట్ తర్వాత.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంగా మరింత మాస్ కథను తయారుచేసుకున్న దర్శకుడు సుకుమార్.. బన్నీతో చేస్తున్న పాన్ ఇండియా ప్రయోగమిది.
ఆర్య 2 వచ్చిన దశాబ్దం తర్వాత అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన చిత్రమిది. సహజంగానే బన్నీ అభిమానులకు ఈ చిత్రంపై ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువగానే ఉంటాయి. ఆర్య తర్వాత ఆర్య-2 వచ్చేసరికి దర్శకుడు సుకుమార్ క్రియేటివ్ కోషెంట్ పెరిగి.. సక్సెస్ రేటు కాస్త తగ్గింది. అయినా వీరిద్దరిదీ హిట్ కాంబినేషన్ గానే పేరు తెచ్చుకుంది. అయినప్పటికీ.. హ్యాట్రిక్ చిత్రం సెట్స్ మీదకు వెళ్లడానికి పదేళ్లు పట్టింది. అల్లు అర్జున్‌కు ఇది మొదటి పాన్ ఇండియా సినిమా. తెలుగుతోపాటు, తమిళ్, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదలైంది.
2019 అక్టోబరులో షూటింగ్ ప్రారంభమైన చిత్రం ఇది. అచ్చంగా కరోనా కష్టాలపాలై ఇప్పటికి తొలిభాగం విడుదల అయింది. కరోనా కష్టాలంటే.. ఆ కారణంగా షూటింగ్ ఆలస్యం కావడం మాత్రమే కాదు.. షూటింగుల పునరుద్ధరణ జరిగిన వెంటనే అల్లు అర్జున్ సహా.. సగం మంది యూనిట్ కరోనా బారిన పడి మళ్లీ పని ఆగింది. సినిమా రెండు భాగాలు చేయాలనుకున్న తర్వాత.. మొదటి భాగాన్ని 2020 డిసెంబరులో క్రిస్ మస్ కానుకగా తెస్తాం అని ప్రకటించారు. సరిగ్గా ఏడాది ఆలస్యంగా 2021 క్రిస్ మస్ కానుకగా, అనేక బాలారిష్టాల్ని దాటుకుని, ఇప్పటికి ‘పుష్ప- దిరైజ్’గా తొలిభాగం డిసెంబరు 17న ప్రేక్షకుల ఎదుటకు వచ్చింది.
పుష్ప- ది రైజ్ సినిమా ఎలా ఉందో చూద్దాం..
కథ :
అక్రమసంతానం కావడం వలన.. వివక్షకు గురవుతూ పెరిగిన కుర్రాడు పుష్ప- పుష్పరాజు (అల్లు అర్జున్). ఎవరినైనా ఖాతరు చేయకపోవడం అతడి నైజం. యజమానిని కూడా. ఆ నైజాన్ని యజమాని సహించడు అని తెలిసి.. పని మానేసి వెళ్లిపోతాడు. ఆ నైజం నచ్చిన మరొకడు కేశవ- (జగదీష్ ప్రతాప్ భండారీ) అతనికి అనుచరుడిగా తయారవుతాడు. ఇల్లీగల్ పనిలో రిస్క్ ఉంటుందిగానీ.. డబ్బులెక్కువ వస్తాయని తెలిసి అటు మొగ్గుతాడు. అడవిలో అక్రమంగా ఎర్రచందనం దుంగలు నరికే కూలీగా కొండారెడ్డి (అజయ్ ఘోష్) వద్ద పనికి కుదురుతాడు. ఆ కొండారెడ్డికి ఇద్దరు తమ్ముళ్లు. వ్యాపారంలో లెక్కలు, జాగ్రత్తలు తెలిసిన జగ్గారెడ్డి, కనిపించిన అమ్మాయినెల్లా పక్కలోకి రప్పించుకోవాలని చూసే జాలీరెడ్డి (కన్నడ నటుడు ధనుంజయ్) అన్నకు అండదండగా దందా నడిపిస్తుంటారు.
పోలీసులకు భయపడని సాహసం, పోలీసులు దాడిచేసినా సరుకు దొరక్కుండా తప్పించేసే తెలివితేటలు పుష్కలంగా ఉన్న కూలీ పుష్ప త్వరగానే కొండారెడ్డి కళ్లలు పడతాడు. తన పనికి ‘కూలీగా’ ఆఫర్ చేసే డబ్బు కంటే ఓ లక్ష తక్కువే అయినా సరే.. ‘పర్సంటేజీ’ రూపంలో తీసుకుని.. తనను తాను కూలీ కాదు.. సిండికేట్ మెంబర్, పార్టనర్ అని ఒక హోదా కల్పించుకుంటాడు.
ఆ సిండికేట్ కింగ్ పిన్ మంగళం శ్రీను (సునీల్) సరుకును కాపాడి అతడి దృష్టిలో పడతాడు. మదరాసులో దక్కే రేటు గురించి తమకు అబద్ధం చెబుతున్నాడని తెలుసుకుని, రేటు గురించి బేరమాడి అతనితో వైరం పెంచుకుంటాడు. మదరాసు మురుగన్ తో నేరుగా డీల్ చేసి, ఈ సిండికేట్‌కు అండగా ఉండే ఎంపీ/ఎమ్మెల్యే (రావు రమేష్) ప్రాపకం సంపాదిస్తాడు. సిండికేట్ హెడ్ గా ఎదుగుతాడు. సరిగ్గా అప్పుడు.. అప్పటిదాకా పుష్ప ఎత్తులకు ఓడిపోయిన డీఎస్పీ గోవిందప్ప (తమిళనటుడు హరీష్ ఉత్తమన్) రాజీనామా చేసి వెళ్లిపోవడమూ, కర్కోటకుడైన భన్వర్ సింగ్ శెఖావత్ ఐపీఎస్ (మళయాళ నటుడు ఫహాద్ ఫాజిల్) ఎస్పీగా రావడమూ జరుగుతుంది.
ఈ కథకు సమాంతరంగా కొండారెడ్డి దగ్గర పనిచేసే లారీడ్రైవరు కూతురు శ్రీవల్లి (రష్మిక మందన్నా), పుష్పకు తెగనచ్చుతుంది. రెండొందల రూపాయలకు ఓసారిచూసి నవ్వడానికి, ఐదువేల రూపాయలకు ఓ ముద్దు పెట్టడానికి ఒప్పుకునే ఆ అమ్మాయితో పుష్ప- ప్రేమలో పడతాడు. ఎంతో కష్టపడి ఆ ప్రేమను నిశ్చితార్థం దాకా లాక్కు వస్తే.. సవతిసోదరుల పుణ్యమాని చెడిపోతుంది.
ఇక పుష్ప ప్రేమ ఎలా ఫలించింది. కొండారెడ్డితో పార్టనర్ షిప్ ఏ మలుపులు తీసుకుంది? భన్వర్ సింగ్ శెఖావత్, మంగళం శ్రీను వంటి కర్కోటకులతో తలపడడం ఎలా చోటుచేసుకుంది.. అనే విషయాలు వెండితెర మీదనే చూడాలి.
నటవర్గం :
నటుల పెర్ఫార్మెన్స్ పరంగా అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రాన్ని ఒంటిచేత్తో మోశాడు. యాక్షన్ సన్నివేశాలను పండించాడు. ఉద్వేగాలను కూడా చక్కగానే చేశాడు. ప్రేమ విషయంలో కూడా పరవాలేదు. పాటల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ కేలిబర్‌కు తగినంతగా పాటలు కనిపించవు. సీరియస్‌గా హీరోయిజం ఎలివేట్ అయ్యే సన్నివేశాల్లో తన మార్కు చిలిపితనంతో కూడిన నటన, అంచనాలకు అందని ప్రేమ ప్రపోజల్స్, బిజినెస్ డీల్స్ ఇవన్నీ బాగానే చేశాడు. అర్జున్ లోని టేలెంట్‌ను పూర్తిస్థాయిలో పిండుకున్న సినిమా కాదుగానీ.. అందరిలోకీ తనే బాగా చేశాడు. ఇక హీరోయిన్ గా రష్మిక మందన్నా పెద్దగా చేయడానికి ఏమీ లేదు. ఎక్కడైనా చేయడానికి అవకాశం ఉంటే.. అక్కడ ఆమె నటన తేలిపోయింది. అతి కొద్ది సన్నివేశాల్లో మాత్రం పరవాలేదని అనిపిస్తుంది.
మిగిలిన వారిలో ఫహాద్ ఫాజిల్ పెద్ద నటుడు.. కానీ పుష్ప ది రైజ్ మొదటి భాగంలో అతని పాత్ర నిడివి తక్కువ. ఉన్నంతలో తన ముద్ర చూపిస్తాడు. రెండో భాగం మీద కొంత ఆసక్తిని పుట్టించగలడు. మంగళం శ్రీనుగా సునీల్ బాగానే చేశాడు. నటన కొంత కృతకంగా అనిపిస్తుంది గానీ.. తననుంచి ఎలా కోరుకున్నారో అలా చేసినట్టే అనిపిస్తుంది. అతడి భార్యగా అనసూయ భరద్వాజ్ చేసింది. రంగస్థలంలోని పాత్రతో పోలిస్తే.. ఇది ప్రాధాన్యం లేని పేలవమైన పాత్ర. నటన కూడా దానికి తగ్గట్టుగానే ఉంది. హీరో అనుచరుడుగా, కామెడీ పండించడంలో జగదీష్ ప్రతాప్ భండారి బాగా చేశాడు. అల్లు అర్జున్ తర్వాత అంతో ఇంతో బాగా చేసినది అతనే. అజయ్ ఘోష్ దగ్గరినుంచీ.. ధనుంజయ్ వరకు మిగిలిన వారి నటన గురించి పెద్ద చెప్పుకునేంతగా ఏం లేదు.
మిగిలిన పాత్రల్లో ‘అబ్బా’ అనిపించగల రీతిలో చేసే స్కోప్ ఎవ్వరికీ లేకుండా, ఎవ్వరూ అంతగా చేయకుండా ఉంటే.. కేవలం ఒక్క హీరో పెర్ఫార్మెన్స్ మీదనే ఆధారపడాలంటే.. ఆ సినిమా ఎలాఉంటుందో.. పుష్ప అలాగే ఉంది.
సాంకేతికవర్గం :
బ్యానర్ : మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా
నిర్మాణ విలువల పరంగా సినిమా రిచ్ గానే ఉంది. ఎక్కడా రాజీపడలేదు. అంతవరకు నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్లను అభినందించొచ్చు. కానీ, ఆ ఖర్చు సద్వినియోగం అయిందా లేదా.. ఖర్చుకు తగిన లాభాలను నిర్మాతకు ఇవ్వడం సంగతి తర్వాత.. కనీసం ఖర్చుకు తగిన ఫీల్ ను ప్రేక్షకుడికి ఇచ్చిందా లేదా అనేది చెప్పలేం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్. పాటలు బాగున్నాయి.
కెమెరా పని కోసం మీరోస్లావ్ కూబా బ్రోజెక్ ను ప్రత్యేకించి ఎందుకు తీసుకువచ్చారో తెలియదు. మరీ అంత అద్భుతాలు సృష్టించనట్టుగా అనిపించదు. డ్రోన్ తో ప్రేక్షకుడికి భిన్నమైన ఫీల్ ఇవ్వడం అనేది ఇవాళ్టి రోజుల్లో.. ఐదు నిమిషాల షార్ట్ ఫిలిం చేసే కుర్రాళ్లు కూడా చేస్తున్నారు. కాబట్టి అది లెక్కలేదు. కెమెరా పనితనం పరంగా ప్రత్యేకమైన మెరుపులేమీ లేవు.
కొరియోగ్రఫీ చాలా మంది చేశారు. సమంత ఐటెం సాంగ్ బాగుంది. మిగిలిన పాటలు చెప్పుకోదగ్గంతగా లేవు. కార్తీక్ శ్రీనివాస్, రూబెన్ ఇద్దరు ఎడిటర్లు ఈ చిత్రానికి పనిచేశారు. కానీ వారసలు పనిచేసినట్టే అనిపించదు. రెండు భాగాలుగా తయారైని సినిమా.. మొదటి భాగం మూడుగంటలు (179 నిమిషాలు) ఉంది. చాలా చోట్ల కత్తెరకు పనిచెప్పలేదని అనిపిస్తుంది. సీన్ల సాగతీత బోలెడు సందర్భాల్లో చిరాకు పుట్టిస్తుంది. పాటల్లో చంద్రబోస్ మార్కు కనిపిస్తుంది. కొన్ని సాదాసీదాగానూ.. ప్రత్యేకించి కొన్ని కొన్ని లైన్లు చాలా గొప్పగానూ ఉన్నాయి.
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ సుకుమార్ వే. కథా విస్తరణ, రచన సహకారం.. లాంటి రకరకాల హోదాలతో బోలెడు పేర్లు పడతాయి. అయినా బాధ్యత సుకుమార్ దే గనుక.. ఆయన గురించే చెప్పుకోవాలి. సాధారణంగా చాలా గ్రిప్పింగ్ గా ఉండే స్క్రీన్ ప్లే రాసుకోవడంలో ఈ లెక్కల మాస్టారికి ఒక ప్రత్యేకమైన లెక్క ఉంది. రంగస్థలంలో కూడా దాన్ని ఆయన పర్ఫెక్ట్ గా నిరూపించుకున్నాడు.
పుష్ప సినిమాలో ఉండే ‘రానెస్’, రగ్‌డ్ లుక్ లను విస్మరిస్తే.. ఆ సినిమా తీసినవాడేనా ఈ సినిమా చేసినది అని సందేహం కలుగుతుంది. కామెడీ డైలాగులు కొన్ని చోట్ల చాలా బాగున్నాయి. కొన్ని చోట్ల తేలిపోయాయి. మాటలు శ్రీకాంత్ విస్సా అందించారు. పంచ్ డైలాగులు ఓకే. ‘నాతో ఒక్కసారి పడుకోరా.. ఈ జన్మకు మళ్లీ నీకు కనిపించను’ అనేది హీరోయిన్- హీరోకు ప్రపోజ్ చేసే డైలాగ్. సినిమాలో అది వచ్చే సందర్భానికి, చాలా హత్తుకుంటుంది. ఒక మామూలు డైలాగ్.. సినిమాలో భాగమైనప్పుడు చెప్పలేనంత ఫీల్ కలిగిస్తే.. అది రచయిత సక్సెస్ లెక్క. సుకుమార్ గత చిత్రాల్లో అలాంటి కొన్ని డైలాగుల మెరుపులు ఉంటాయి. ఇందులో ఈ మాటకూడా అలాంటిదే.
స్క్రీన్ ప్లే తేలిపోయింది. హీరో ఎంట్రీనే స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవరుగా వస్తుంది.. ఆ తర్వాత కూలీగా పని మొదలెట్టడం జరుగుతుంది. నిజానికి ఇంత మాస్ కమర్షియల్ సినిమాకు లాజిక్ లు వెతకడం కూడా తప్పే. దర్శకుడు సుకుమార్ కాకపోతే గనుక పట్టించుకోనక్కరలేదు. దర్శకత్వం పరంగా కూడా సుకుమార్ కు ఫుల్ మార్కులు రావు. హీరో మీద మాత్రమే తాను ఫోకస్ పెట్టి.. మిగిలిన కేరక్టర్లనుంచి సరైన నటనను రాబట్టుకోవడంపై దృష్టిపెట్టలేదని తెలిసిపోతుంది. సుకుమార్ నుంచి ఆయన అభిమానులు, హీరోల అభిమానులు ఆశించే తరహాలో మాత్రం దర్శకత్వం లేదు.
విశ్లేషణ :
సినిమా మొదటి సగభాగం బాగుంది. లాజిక్ లు, ఇతర అంశాలు కొన్ని పట్టించుకోకపోతే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. శ్రీవల్లి కళ్లలో పడడానికి పుష్ప పడే కష్టాలు, ఆరాటం బాగుంది. దానికోసం కేశవ వేసే ఎత్తుల నవ్వు పుట్టిస్తాయి. ప్రేమించిన అమ్మాయికి అయిదువేల రూపాయలు ఇచ్చి హీరో ముద్దు పెట్టించుకోవాలనుకునే తరహా సన్నివేశాలను బహుశా సుకుమార్ మాత్రమే చూపించగలడు. ప్రేమ- వ్యవహారాల్లో విలక్షణమైన ఎప్రోచ్ కు పెద్దపీట వేసే సుకుమార్ శైలి అది. అక్కడినుంచి వారిద్దరి మధ్య ప్రేమను గాఢమైన అనుబంధంగా మార్చే తీరు కూడా అంతా బాగుంది. కొన్ని మలుపు చాలా సులువుగా ఊహించగలిగేవే అయినా.. ఫస్ట్ హాఫ్ కేవలం అభిమానుల్నే కాదు.. మాస్ సినిమాలను ఇష్టపడే అందరినీ మెప్పిస్తుంది.
సెకండాఫ్ తేలిపోయింది. ప్రేక్షకులకు చెప్పడానికి కథ లేక దర్శకుడు ఏదేదో డొంకతిరుగుడు పనులు చేస్తున్నాడనిపిస్తుంది. అసలే మూడు గంటల సినిమా ఒక భారం. నిడివి ఎక్కువైనా సరే.. కథ గ్రిప్పింగ్ గా సాగిపోతోంటే ప్రేక్షకుడు పట్టించుకోడు. సాగతీత బోరింగ్ సన్నివేశాలతో నిడివి పెంచి ఏం సాధించాలనుకున్నారో తెలియదు. పాటలు కథలోకి బాగానే ఇమిడాయి గానీ.. సెకండాఫ్ లో కథే లేదు.
అక్కడికీ కొన్ని సన్నివేశాలు- దర్శకుడు ఇంత హడావుడిగా చుట్టేస్తున్నాడేమిటా అనిపిస్తుంది. కానీ వాటన్నింటినీ ‘సెకండ్ పార్ట్ పుష్ప’ కోసం వండి వార్చిన లీడ్ సీన్లుగా మనం అర్థం చేసుకోవాలి. అదంతా చాలా కంగాళీగా అనిపిస్తుంది. ఫహాద్ ఫాజిల్ మీద ఆవేశం పుట్టిన తర్వాత.. తల్లికోసం నిగ్రహించుకున్న పుష్ప.. సరిగ్గా పెళ్లి జరిగే సమయానికి ఎందుకు వెళ్తాడో.. అదే పని పెళ్లి తర్వాత చేస్తే ఏంతేడా వస్తుందో మనకు అర్థం కాదు. సాగతీతకోసమే అన్నట్లుగా కొన్ని సీన్లు చిర్రెత్తిస్తాయి.
ఎర్ర చందనం విషయంలో ఏదైనా కొత్తదనం ప్రేక్షకులు కోరుకుంటే వారికి నిరాశే. ఒక మామూలు మాఫియా డాన్ తరహా చిత్రానికి ఎర్రచందనం అనేది ఒక ఎలిమెంట్ గా మాత్రమే వాడుకున్నారు తప్ప.. అది కథగా ఇందులో కనిపించదు. చాలా ఎత్తుగడలు ప్రిడిక్టబుల్ గానే సాగుతాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ లో చాలా భిన్నమైన కోణాలుంటాయి. పెద్దగా టచ్ చేసినట్టు కనిపించదు. స్మగ్లర్లు- పోలీసులు తారసపడే సన్నివేశాలు.. ఎంతగా కమర్షియల్ సినిమా అయినప్పటికీ.. మరీ ఇంత లూజ్‌గా ఉంటే ఎలా అనిపిస్తుంది.
మూడు గంటల నిడివే చాలా ఎక్కువనుకుంటే.. అందులో మళ్లీ కథను ముందుకు నడిపించడానికి వాయిస్ ఓవర్ల సాయం తీసుకోవడం ఒక తమాషా. కథ చిక్కగా ఉండి- సమయం చాలనప్పుడు ఆ టెక్నిక్ ఉపయోగపడుతుంది. కథే లేకుండా సా…గుతోంటే.. మధ్యలో వాయిస్ ఓవర్ హెల్ప్ ఎందుకో తెలియదు.
ఒక సినిమా కోసం కథ తయారుచేసుకుని.. మేకింగ్ లోకి దిగిన తర్వాత.. ఖర్చు పెరిగిపోతే.. రిటర్న్స్ కూడా భారీగా పిండడానికి అదే కథను.. రెండు సినిమాలకు తగినట్టుగా తయారుచేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ చిత్రం. క్లయిమాక్స్ మీద చాలా శ్రద్ధ ఉండాలి. కీలకమైన ఎలిమెంట్ ను రెండో భాగం సినిమా కోసం ఆపేసినా.. మొదటి సినిమాను అర్థవంతంగా ముగించాలి. ఆ ప్రయత్నం ఇందులో ఉండదు. ఏదో తీసుకుంటూ పోగా.. ఎక్కడ మూడు గంటలు అయితే అక్కడ ముగించి ఒకటో భాగంగా రిలీజ్ చేసినట్టు అనిపిస్తుంది.
స్పెషల్ మెన్షన్ :
ఈ సినిమా కోసం స్పెషల్ సాంగ్ అని చెప్పుకుంటున్న ఐటెం సాంగ్ లో సమంత నటించింది. మామూలుగానే సుకుమార్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ చాలా గొప్పగా ఉంటాయి. ఐటెం సాంగ్ అంటే ఇలా ఉండాలి అనిపించేలా ఉంటాయి. 100% లవ్, రంగస్థలం అన్నీ ఇందుకు ఉదాహరణలే. ఇందులో సమంత పాట కూడా అలాగే ఉంది. విడుదలకు ముందు బన్నీ చెప్పినట్టు.. ‘ఊ అంటావా మామా.. ఊఊ అంటావా మామా..’ అంటూ సమంత ఇందులో రసహృదయాలను ఊరిస్తుంది. సుకుమార్ తన మార్క్ శ్రద్ధను చూపించాడు. సమంత దానికి ప్లస్ అయింది.
ఒక చందమామ కథ..
‘పుష్ప ది రైజ్’ సినిమా చూసిన తర్వాత.. ఒక చిన్నప్పటి చందమామ కథ గుర్తొస్తోంది. ఒక నగరంలో చిత్రకళా ప్రదర్శన జరుగుతుంది. అద్భుతమైన చిత్రకారులు తమ పెయింటింగ్స్ ను అక్కడ ప్రదర్శనకు ఉంచారు. వాటిలో ఒక మేటి ఆర్టిస్టు గీసిన ‘రెండు ఎద్దులు పోరాడుకునే దృశ్యం’ అద్భుతంగా చూపరులందరి మనసులను చూరగొంటోంది. ఆ చిత్రం చూసిన వాళ్లంతా ముక్కున వేలేసుకుని ఎంత అద్భుతంగా ఉన్నదో కదా అని ఆ బొమ్మ దగ్గరే ఆగిపోయి మరీ ప్రశంసిస్తున్నారు. ఈ ఎద్దులు.. నిజం ఎద్దుల్లాగానే ఉన్నాయని అభినందిస్తున్నారు. వాళ్లందరూ కళాపిపాసులు, కళాకారులు, కళాభిమానులు.. ఆ ఎద్దులు నిజంగానే జీవకళ ఉట్టిపడేలా ఉన్నాయి. అవి పోరాడుతున్న చిత్రంలో అవి కొమ్ములు విసురుకుంటున్న వైనం, వెనుక గ్రామీణ నేపథ్యం అంతా అత్యంత సహజంగా ఉన్నాయి. అంతలో ఆ చిత్ర ప్రదర్శనలోకి ఒక పామరుడు వచ్చాడు. పల్లెటూరి వాడు. చదువుసంధ్యలు లేని, చిత్ర కళాభిరుచిలేని, కళ గురించి తెలియని వాడు. వచ్చి- ఆ ఎద్దుల పోరాటం చిత్రాన్ని చూడగానే.. పెదవి విరిచి, ‘‘ఏంటిది.. ఎద్దులు కొట్లాడుకుంటే తోక పైకెత్తుతాయిగదా.. ఇవి తోక వేళ్లాడేసుకుని ఉన్నాయేంటి’’ అనేసి చక్కా పోయాడు.
ఎద్దులు నిజంగా పోట్లాడుకుంటే తోకను పైకి లేపుతాయి. ఆ పౌరుషంలో వాటి భంగిమ అలా ఉంటుంది. కానీ.. ఎద్దు రూపాన్ని, రంగుల మేళవింపుని అద్భుతంగా చేసిన ఆ చిత్రకారుడికి ఈ బేసిక్ సంగతి తెలియదు. పట్టించుకోలేదు. కానీ.. రోజూ ఎద్దుల పోట్లాటలు చూసే పల్లెటూరివాడు ఆ లోపం ఇట్టే పట్టేస్తాడు!
పుష్ప చిత్రం చూస్తే ఆ చందమామ కథ గుర్తొస్తుంది. శేషాచలం అడవుల్లో తిరుగుతూ ఉంటే.. చందనం అన్ని చెట్ల మధ్యలో చందనం చెట్లు స్పష్టంగా తెలిసిపోతుంటాయి. స్థానికులు తిరుమల మార్గంలో వెళ్లేప్పుడు, దిగేప్పుడు కూడా.. రోడ్డుపక్కన చందనం చెట్లను సులువుగా గుర్తుపట్టేస్తారు. దాదాపుగా మన దేశంలోనే ఎర్ర చందనం వృక్షాలకు ఏకైక నెలవుగా ఉన్న శేషాచలం కొండలు, అడవులు కొలువుతీరిన చిత్తూరు జిల్లా, కడపజిల్లా అమాయకుడెవడైనా ఈ చిత్రం చూసి.. ‘‘యేందబ్బా పుస్పా.. నువ్వు నరికే అడవుల్లో యేడా ఒక్క చందనం చెట్టు గూడా లేదే.. యేణ్నించి స్మగ్లింగు జేస్తాండావూ.. మా సెవుల్లో పువ్వులు పెడతాండావా..’’ అని నవ్వేసేడంటే- ఇన్ని వందల కోట్ల ఖర్చు పెట్టి సినిమా తీస్తూ.. అసలైన ఎర్రచందనం వృక్షాలుంటే శేషాచలం కొండలప్రాంతంలో ఒక్క ఫ్రేం కూడా షూట్ చేయని చిత్ర బృందం సిగ్గుపడాలి.
మొదటి పార్ట్ పేరు ‘ది రైజ్’ అయితే రెండో పార్ట్ పేరేం పెడతారో..?
..అగస్త్య
.
Discussion about this post