ఒక విజయం దక్కితే.. ఆ విజయానికి సంబంధించి అందరి పాత్ర సమానంగా ఉంటుంది. కానీ ఎమోషన్ అయ్యేంత గాఢత ఎవరో ఒక్కరితో మాత్రమే.. ఒక్కరికి మాత్రమే ఉంటుంది. కానీ.. పుష్ప విషయంలో వేరు. ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకుని థాంక్యూ మీట్ పెడితే.. దర్శకుడు, హీరో ఇద్దరూ కూడా ఎమోషనల్ అయ్యారు. తమ భావోద్వేగాలను దాచుకోలేకపోాయారు. ఒకరి పట్ల మరొకరు తమ కృతజ్ఞతను అలా ఎమోషనల్ గా ప్రకటించుకున్నారు.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే వసూళ్లు 280 కోట్లు దాటిపోయాయి. ఈ నేపథ్యంలోనే సినిమా థాంక్యూ మీట్ ఏర్పాటు చేసారు దర్శక నిర్మాతలు.
తన కెరీర్లో సాధించిన విజయం లో సుకుమార్ పాత్ర ఎంతో ఉంది అంటూ ఎమోషనల్ అయ్యారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆయన మాట్లాడుతూ.. ‘ ఈ రోజు సినిమా ఇంత పెద్ద విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. నా కెరీర్లో ఆర్య అనేది ఒక మైలురాయి.. సుకుమార్ లేకపోతే ఆర్య లేదు.. ఆర్య లేకపోతే నేనులేను.. ఈ రోజు నా కెరీర్ ఇంత అద్భుతంగా ఉంది అంటే దానికి కారణం సుకుమార్ అని గర్వంగా చెబుతాను.
సుకుమార్ నాకు మంచి స్నేహితుడు. ఇక సినిమా విషయానికి వస్తే హిట్ అయినా.. ఫ్లాప్ అయినా థాంక్యూ మీట్ అనేది కచ్చితంగా పెడతాను. ఎందుకంటే ఫలితంతో సంబంధం లేకుండా ఏ సినిమాకైనా కష్టపడేది అంతా సమానంగానే ఉంటుంది. థాంక్యూ చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. పుష్ప సినిమా కోసం అహర్నిశలు కష్టపడిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.
నాతో పాటు నటించిన నటీనటులకు.. సినిమా కోసం అడవుల్లో సైతం లెక్క చేయకుండా కష్టపడిన టెక్నికల్, అలాగే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పుష్ప సినిమాను ఇంత బాగా ఆదరించినందుకు మరొకసారి తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ సినీ అభిమానులకు థాంక్యూ..’ అని తెలిపారు.
పుష్ప సినిమా తన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకొచ్చింది రష్మిక మందన. తాజాగా పుష్ప థాంక్యూ మీట్లో ఆమె మాట్లాడుతూ.. ‘ ముందుగా ఈ చిత్రంలో నన్ను సెలెక్ట్ చేసినందుకు దర్శకుడు సుకుమార్ కు థాంక్స్. ఆయన నాలో శ్రీవల్లిని ఎలా చూసాడో తెలియదు. ఏదైనా సినిమా అయిపోతే ఎమోషనల్ గా ఫీల్ అవుతారు కానీ పుష్ప అయిపోతే సంతోషంగా ఉంది.
ఎందుకంటే రెండు నెలల్లో మళ్లీ కలిసి పార్ట్ 2 కోసం పని చేయబోతున్నాం కాబట్టి. ఇది నా కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్. అది నాకు ఇచ్చిన నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్.. దర్శకుడు సుకుమార్.. హీరో అల్లు అర్జున్ కు థాంక్స్..’ అని తెలిపారు.
పుష్ప సినిమా థ్యాంక్ యూ మీట్ చాలా ఎమోషనల్‌గా జరిగింది. ముఖ్యంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. అల్లు అర్జున్ తనకు దేవుడు అంటూ చెప్పుకొచ్చాడు ఈయన. సుకుమార్ మాట్లాడుతూ.. ‘అల్లు అర్జున్ నాకు దేవుడు లాంటి వాడు. ఆయన చాలా గొప్ప నటుడు. మొహంలోనే అన్ని భావాలు పలికించగల గొప్ప నటుడు. అలాంటి నటుడు దొరకడం అదృష్టం. అన్ని ఎమోషన్స్ అద్భుతంగా పండించగల సత్తా అల్లు అర్జున్ సొంతం. ఆయనతో ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను..’ అని తెలిపారు.
హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘పుష్ప సినిమా జనవరి 6 వరకు కచ్చితంగా ప్రపంచ వ్యాప్తంగా 325 కోట్లకు పైగానే కలెక్ట్ చేస్తుందని నమ్మకంగా చెప్తున్నాము. ఇప్పటి వరకు 285 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. ఇంకా బాగా వెళ్తుంది. తమ బ్యానర్‌కు పాన్ ఇండియన్ స్థాయి గుర్తింపు ఇవ్వడమే కాకుండా.. ఇంత పెద్ద విజయం అందించినందుకు ముందుగా హీరో అల్లు అర్జున్ గారికి, దర్శకుడు సుకుమార్ గారికి ధన్యావాదాలు తెలుపుకుంటున్నాము..’ అని తెలిపారు.
.

Discussion about this post