‘మాట తప్పడు. మడమ తిప్పడు.’ తమ అధినేతను గురించి వైసీపీ నేతలు చెప్పే మాట ఇది. సామాజిక భధ్రతా పింఛన్ల పంపిణీ విషయంలో జగన్ ఇది నిరూపించుకుంటున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మొదటే ఒక్కొక్కరికి రూ.2,250 వంతున ఇచ్చారు. ఏడాది తరువాత మరో రూ.250 పెంచుతామన్నారు. కొద్దిగా ఆలస్యమైనా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సామాజిక భధ్రతా పింఛను రూ.2,500కు పెంచడంతో అవ్వాతాతల కళ్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. తమ బతుక్కు భరోసా కల్పిస్తున్న జగన్ పది కాలాల పాటు చల్లగా ఉండాలని పింఛనుదారులు దీవిస్తున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్ఢి సామాజిక భద్రతకు పెద్దపీట వేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే సామాజిక భద్రతా పింఛను రూ.2,250కి పెంచారు. తీవ్ర కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారితో పాటు తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా, హిమోఫీలియా, పక్షపాతం, కండరాల క్షీణత వంటి వ్యాధులతో దీర్ఘకాలికంగా మంచానికే పరిమితం అయిన వారికి రూ.10వేల వంతున పింఛను ఇస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రెండేళ్లలో ఏకంగా 18,44,812 మందికి కొత్త పింఛన్లు మంజూరు చేశారు.
వృద్దాప్య పింఛన్ల వయసు 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించారు. ఈ నిర్ణయం వలన రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి లబ్ది చేకూరింది. ప్రస్తుతం రాష్ట ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్లకు నెలకు రూ.1,570కోట్ల్లకు పైగా ఖర్చు చేస్తోంది. అంటే ఏడాదికి రూ.18వేల కోట్లు పైగా పింఛన్ల కోసం వెచ్చిస్తోంది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటి వరకు పింఛన్ల కోసం చేసిన ఖర్చు రూ.45వేల కోట్లు. సామాజిక వర్గాల వారీగా పింఛను లబ్దిదారులు పరిశీలిస్తే… బీసీలు 30,37,048 మంది, ఈబీసీలు 10,98,616 మంది, బ్రాహ్మణులు 23,190 మంది, కాపులు 3,93,265మంది, మైనార్ఠీలు 2,30,510మంది, ఎస్సీలు 10,29,440 మంది, ఎస్టీలు 3,62,523 మంది ఉన్నారు. గతంలో పింఛన్ల లబ్దిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉండేది.
అయితే నేడు లబ్దిదారుల ఎంపికలో పారదర్శకత పాటిస్తున్నారు. ఇలా చేయడం వలన అర్హులందరికీ న్యాయం జరుగుతోంది. వలంటీరు వ్యవస్థ ద్వారా ప్రతి నెలా 1వ తేదీనే పింఛన్లు లబ్దిదారుల ఇళ్ల వద్దకే చేర్చుతున్నారు. ఇలా చేయడం వలన పింఛన్ల పంపిణీలో అవినీతి కూడా అంతరించి పోయింది. వృద్ధాప్య పింఛనుకు ఇచ్చే సొమ్ము పెంచడం వలన వారికి కుటుంబంలో గౌరవం కూడా పెరిగింది. వృద్ధాశ్రమాల్లో ఉన్న వారిని కూడా కొంతమంది ఇళ్లకు తీసుకెళుతున్నారు. ఇందుకు కారణం ప్రతి నెలా 1వ తేదీ నాటికి ఠంచనుగా వారికి ఫింఛను సొమ్ము రావడమే.
నూతన ఏడాదిని పురస్కరించుకుని ఈ నెల నుంచి పింఛను మరో రూ.250లు పెంచుతుండటంతో అవ్వాతాతల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. ప్రభుత్వం ఇస్తున్న సామాజిక భద్రతా పింఛను తమ బతుక్కు భరోసా కల్పిస్తోందని వారు చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ దశల వారీగా ఈ పింఛను తప్పకుండా రూ.3వేలకు పెంచురతారని లబ్దిదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నప్పటికీ… ఆడిన మాట తప్పకుండా పింఛన్లు పంపిణీ చేస్తున్న జగన్ ను పలువురు అభినందిస్తున్నారు.
వైసీపీ వర్గాలు పట్టరాని ఆనందంలో ఉన్నాయి. సామాజిక భద్రతా పింఛన్లు క్షేత్రస్థాయిలో వైసీపీ మరింత బలోపేతం కావడానికి సహకరిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
.