చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె జడ్పీటీసీ గీతారెడ్డి భర్త.. వైసీపీ నేత మద్దిరెడ్డి కొండ్రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తంబళ్లపల్లెలో తాలిబన్ల రాజ్యం నడుస్తోందంటూ స్థానిక శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్ఢిపై ఆయన విమర్శలు చేశారు.
ద్వారకనాథరెడ్డి ఎమ్మెల్యే అయిన తరువాత మహిళలకు రక్షణ లేకుండా పోతోందని.. ఆయన అనుచరులు ఓ వివాహితను ఇంటి నంచి బలవంతంగా లాక్కెళ్లారని.. తంబళ్లపల్లెలో ప్రస్తుతం భూదందాలు పెరిగి పోతున్నాయని… కొండ్రెడ్డి ఆరోపించారు.
ప్రశ్నించే సొంత పార్టీ నేతలపై కక్ష సాధింపు ధోరణులకు పాల్పడుతున్నారని… తంబళ్లపల్లె నియోజకవర్గంను ముఖ్యమంత్రి జగనే కాపాడాలంటూ మూడు రోజుల కిందట మద్దిరెడ్డి కొండ్రెడ్డి తిరుపతిలో ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఒత్తిడితో పోలీసులు తనపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేయడానికి కుట్ర చేస్తున్నారని.. ఆ భయంతో తాను అజ్ఞాతంలో ఉన్నానని కూడా కొండ్రెడ్డి ఆ ఇంటర్వ్యూలో ఆందోళన వ్యక్తం చేశారు.
ఆయన చెప్పినట్లే తంబళ్లపల్లె పోలీసులు శనివారం సాయంత్రం ఆయన అరెస్టు చేశారు. ములకలచెరువులో ఈ అరెస్టు చూపారు. 2008లో కొండ్రెడ్డి ఏడుగురి నుంచి డబ్బు తీసుకుని… అప్పటి ఇన్ ఛార్చి తహసీల్దారు సంతకం ఫోర్జరీ చేసి పట్టాలు ఇచ్చారనేది ఆయనపై ఆరోపణ.
ఆ ఏడుగురు శుక్రవారం తహసీల్దారు కార్యాలయానికి వెళ్లి తమకు స్థలం చూపించాలని కోరగా.. అవి నకిలీ పట్టాలు అని తహసీల్దారు తేల్చడం.. అపుడే కొండ్రెడ్ఢిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఆ మరుదినమే కొండ్రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం ఆఘమేఘాలపై జరిగిపోయాయి.
మద్దిరెడ్డి కొండ్రెడ్డి అధికార పార్టీ నేత.. తంబళ్లపల్లె జడ్పీటీసీ గీతారెడ్ఢి భర్త అయినప్పటికీ.. ఆయన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది. ఆయన్ను మీడియా ముందు ప్రవేశ పెట్టినపుడు దొంగతనం, అత్యాచారం కేసుల్లో అరెస్టు చేసిన నిందుతుని లాగా ఆయన ముఖానికి ముసుగు వేశారు.
తంబళ్లపల్లె శాసనసభ్యులు పెద్దిరెడ్ఢి ద్వారకనాథరెడ్డి, ఆయన అనుచరుల దౌర్జన్యాలను ప్రశ్నించనందుకే కొండ్రెడ్డిపై పాత కేసులు బయటకు తీసి అరెస్టు చేశారనే విమర్శలు వినపడుతున్నాయి. తమను ప్రశ్నిస్తే ప్రతిపక్ష నేతలే కాదు.. అధికార పార్టీ నేతలైనా వదలమని హెచ్చరికలు చేయడానికే ఈ అరెస్టు జరిగిందనే ప్రచారం జరుగుతోంది.
ఏది ఏమైనా 2008లో జరిగిన సంఘటనకు సంబంధించి దాదాపు 12ఏళ్ల తరువాత అధికార పార్టీ నేతను పోలీసులు అరెస్టు చేయడం తంబళ్లపల్లెలో చర్చనీయాంశంగా మారింది.
.

Discussion about this post