కరోనా కలవరం పుట్టిస్తోంది. పాజిటివిటీ రేటు రోజు రోజుకూ పైపైకి పోతోంది. మరోవైపు ఒమిక్రాన్ విజృంభిస్తోంది. ఇవిలా ఉండగానే ఫ్రాన్స్ లో ‘ఇహూ’ అనే కొత్త వైరస్ వెలుగు చూసింది. కరోనా మరణాల సంఖ్యా పెరుగుతోంది. ఈ పరిస్థితులను బట్టి చూస్తే థర్డ్ వేవ్ తప్పదేమోననే భయం అందరినీ వెంటాడుతోంది.
థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యోంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో అయితే వారాంతపు కర్ఫ్యూ ప్రకటించారు. కొన్ని రాష్ట్రాల్లో ముందు జాగ్రత్త్తగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో జనం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
రాష్ట్రంలో గత 24 గంటల్లో 28,311 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 334 మందికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. పాజిటివిటీ రేటు 1.17శాతంగా నమోదైంది. పాజిటివిటీ రేటు 1శాతం దాటడం గత రెండు నెలల్లో ఇదే మొదటి సారి కావడం గమనార్హం. ఏపీలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనమని వైద్యశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఈ నెల 1న 1,227… 2న 1,260… 3న 1,278 ఉండగా 4న ఏకంగా 1,516కి యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగింది. మొదటి, రెండవ దశల్లో చిత్తూరు, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ ప్రభావం చూపగా… ప్రస్తుతం విశాఖలో కరోనా ప్రభావం ఎక్కువ ఉన్నట్లు వైద్యశాఖ నివేదికలు చెబుతున్నాయి. థర్డ్ వేవ్ లో విశాఖతో పాటు… చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో కొవిడ్ ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్యశాఖ అధికారులు అభిప్రాయ పడుతున్నారు.
ఒమిక్రాన్ ప్రమాదం..
రాష్ట్రంలో కొత్తగా మరో 7 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఒమిక్రాన్ సోకిన వారి సంఖ్య 24కు చేరింది. కొత్తగా ఒమిక్రాన్ సోకిన వారిలో ఇటీవల ఒమన్, యూఏఈ నుంచి తూర్పుగోదావరికి వచ్చిన ఇద్దరికి… అమెరికా, సౌత్ సూడాన్ నుంచి కృష్ణాకు వచ్చిన ఇద్దరికి…ఒమన్, యూఏఈ నుంచి పశ్చిమ గోదావరికి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణ అయింది. వీరు డిసెంబరు 19 నుంచి 29వ తేదీల మధ్య ఆయా జిల్లాలకు వచ్చారు. అదేవిధంగా గోవా నుంచి కృష్ణా జిల్లాకు వచ్చిన ఓ యువకునికి కూడా ఒమిక్రాన్ ఉన్నట్లు తేలింది.
విద్యార్థులకు కొవిడ్ సోకుతుండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంటోంది. విజయనగరం జిల్లా కొత్తవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 19మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు కొవిడ్ బారిన పడ్డారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం పిల్లలపై అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో ఒమిక్రాన్ బాధితుల్లో 22శాతం మంది చిన్నారులే ఉండటం ఆందోళన కలిగించే అంశం. భారత్ లో కూడా అదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని అమెరికాకు చెందిన చిన్న పిల్లల నిపుణులు అంటున్నారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో పిల్లలను బడులకు పంపు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఓ వైపు కరోనా కేసులు.. మరోవైపు ఒమైక్రాన్ వేరియంట్ దేశ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రోజువారీ కరోనా కేసులు 50వేలు దాటుతుండగా… ఒమైక్రాన్ వేరియంట్ కేసులు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ఒమైక్రాన్ కేసుల సంఖ్య 2,135కి చేరింది. అలాగే ఒమైక్రాన్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 828గా ఉంది. రాష్ట్రాల వారీగా ఒమైక్రాన్ కేసులు ఈ విధంగా ఉన్నాయి. మహారాష్ట్ర 653, ఢిల్లీ 464, కేరళ 185, రాజస్థాన్ 174, గుజరాత్ 154, తమిళనాడు 121, తెలంగాణ 84, కర్ణాటక 77, హర్యానా 71 ,ఒడిశా, ఉత్తరప్రదేశ్ 31, ఆంధ్ర ప్రదేశ్ 24, వెస్ట్ బెంగాల్ 20 , మధ్యప్రదేశ్ 9 ,ఉత్తరాఖండ్ 8, గోవా 5 కేసులు నమోదు అయ్యాయి.
.

Discussion about this post