అప్పు మన అంతు చూస్తుంది. మన అంతు తేలుస్తుంది. మన అంతాన్ని నిర్దేశిస్తుంది. మనకు మరణశాసనం రాస్తుంది. అవును.. నయా ప్రపంచంలో పుడుతున్న అప్పులు.. మన అవసరాలు తీర్చడంతో ఆగడం లేదు. తీర్చడం కొంత అటు ఇటు అయితే మన పరువు తీయడం పనిగా పెట్టుకుంటున్నాయి. తద్వారా మన మరణాన్ని కూడా శాసిస్తున్నాయి.
హైదరాబాదు నగరంలో.. మాథ్స్ ట్యూషన్లు చెప్పుకుంటూ హాయిగా బతుకుతున్న ఓ యువకుడు.. కేవలం అయిదువేల అప్పు తీసుకున్న పాపానికి.. వారి ఉచ్చులో చిక్కుకుని.. పరువు పోతోందని భయపడి, అవమాన భారంతో.. అర్థంతరంగా తన జీవితాన్ని కడతేర్చుకున్నాడు.
తెలంగాణ జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ గ్రామానికి చెందిన సింగటి రమేష్ (24) హైదరాబాదులో ఉప్పల్లో మిత్రులతో కలిసి ఉంటున్నాడు. ఆన్ లైన్ లో మాథ్స్ ట్యూషన్లు చెబుతుంటాడు. అప్పులు ఇస్తాం తీసుకోండి అంటూ ఊరించి ఇచ్చే మొబైల్ యాప్ ల ఉచ్చులో చిక్కుకున్నాడు. అతడు తీసుకున్నది పెద్ద మొత్తమేమీ కాదు. కేవలం అయిదువేలే. అయితే తీర్చడం కొంత ఆలస్యం అయింది. ఈలోగా ఆ యాప్ వాళ్లు.. అతని పోన్ కాంటాక్ట్స్ ద్వారా సేకరించిన బంధుమిత్రుల నెంబర్లందరికీ.. అతను అప్పు చెల్లించలేదనే విషయం చేరవేశారు. ఇది అవమానంగా భావించి రమేష్ గదిలో ఉరి వేసుకుని చనిపోయాడు.
ఇది ఒక సంఘటన మాత్రమే. మొబైల్ లో మీనుంచి ఎలాంటి పూచీకత్తు తీసుకోకుండానే.. రుణాలు అందించే యాప్ లు చేసే మాయాజాలంలో రకరకాలుగా బలవుతున్న వారు, ఒత్తిడికి గురవుతున్న వారు అనేకమంది ఉన్నారు.
అప్పు దొరుకుతోందనగానే.. ఆశపడితే అంతే..
మనకు డబ్బు అవసరం నిజంగా ఉన్నదో లేదో మనకు కూడా తెలియదు. ఈలోగా మొబైల్ కు ఒక మెసేజీ వస్తుంది.. ‘చిల్లర ఖర్చులకు డబ్బు కావాలా ఇస్తాం’ అంటుంది! ‘పేపర్ వర్క్ ఏమీ లేదు.. పూచీ అక్కర్లేదు’ అంటుంది. మనకు ఆశ పుడుతుంది. సింపుల్గా మా యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ వివరాలు ఎంటర్ చేస్తే చాలు.. అప్పు ఇచ్చేస్తాం అంటుంది.
‘అవసరం’తో సంబంధం లేని అప్పు అలా మొదలవుతుంది. ‘పోయేదేముంది.. తీసేసుకుందాం..’ అని అవసరం లేకపోయినా.. యాప్ ల ద్వారా చిన్న చిన్న మొత్తాలు అప్పులు తీసేసుకుంటారు. అందుకోసం యాప్ లో మన వివరాలు నమోదు చేస్తారు. మన బ్యాంక్ అకౌంట్ తో సహా. పైగా సదరు యాప్.. మన ఫోన్ లోని వివరాలకు సంబంధించి అడిగిన పర్మిషన్లు అన్నీ ఇచ్చేస్తారు. మన ఫోన్ కాంటాక్టులు అన్నీ సేవ్ చేసుకున్న సదరు అప్పులిచ్చే యాప్.. వారందరినీ కూడా అప్పులు కావాలా అని అడగడం మొదలు పెడుతుంది. మనం సిఫారసు చేసినట్టుగా కూడా వారికి మెసేజీలు పెడుతుంది.
మనం తీర్చడంలో ఆలస్యం అయినప్పుడు.. మనం అప్పు తీర్చట్లేదని మన కాంటాక్ట్స్ లో ఉన్న వారందరికీ చెప్పడమూ ప్రారంభిస్తుంది. అలాంటి దశలో అయిదువేలు అప్పు తీసుకున్నందుకు పరువుపోతోందని భయపడి రమేష్ లాంటి వాళ్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
యాప్ లో ఎందుకు తీసుకోవాలి..?
రమేష్ సంగతే చూద్దాం. కుర్రాడు ఆన్ లైన్ లో మాథ్స్ ట్యూషన్లు చెబుతున్నాడు. ఇవాళ్టి రోజుల్లో ఆన్ లైన్ ట్యూషన్లు మరీ చిన్న వ్యాపారమేం కాదు. అతడికి నిజంగా అయిదువేల రూపాయల అవసరం వస్తే.. ఆ అవసరం తీరడానికి వేరే దారే కనిపించకుండా పోతుందా? ఇద్దరు మిత్రులతో కలిసి రూంలో ఉంటున్నాడు. వారిద్దరిలో అయిదువేలు సర్దుబాటు చేయగలవారు లేరా? కనీసం.. ఆన్ లైన్ లో ట్యూషన్లు చెబుతున్న పిల్లల కుటుంబాల్లోని వారిని అవసరం కోసం అడగొచ్చు కదా.. ఎడ్వాన్సుగా తీసుకున్నా అవసరం గడుస్తుంది కదా! రుణాలు చిటికెలో ఇస్తాం అనే మాటలతో యాప్ లు విసిరే వలకు ఆకర్షితులు కావడం వలన వచ్చిన చిక్కు ఇది!
అప్పుల యాప్లు చాలా ప్రమాదకరం..
యాప్ రుణం ఇస్తోందంటే.. ఆశపడడంలో ఇవి మాత్రమే కాదు.. ఇంకా అనేక చిక్కులు ఉన్నాయి. సాధారణంగా నమ్మదగిన ప్లాట్ ఫారమ్స్ లోంచి కాకుండా ఇతరత్రా వచ్చే యాప్ లను డౌన్లోడ్ చేసుకోవడమే భద్రతపరంగా ప్రమాదకరం అని సైబర్ నిపుణులు హెచ్చరిస్తుంటారు. పైగా ఆ యాప్ లకు మన కాంటాక్ట్స్ సహా ఫోన్ లో ఉండే డేటా మొత్తానికి యాక్సెస్ ఇవ్వడం కూడా జరిగిపోతుంది. మనకు అప్పనంగా అప్పు ఇచ్చే యాప్ గనుక.. మన బ్యాంకు వివరాలు కూడా ఇచ్చేస్తాం.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
ఇవాళ్టి రోజుల్లో బ్యాంకు అకౌంట్ వివరాలు తెలిస్తే చాలు.. ఉన్నపళంగా దాన్ని దోచేసే యాప్ లు అనేకం తయారవుతున్నాయి. రుణయాప్ లకు మనమే వివరాలు అందిస్తే.. వారు మన అకౌంట్ దోచుకోరు అనే గ్యారంటీ ఏమీ లేదు. మనం యాప్ లో ఇచ్చే బ్యాంక్ అకౌంట్ లో ఎప్పటికీ పెద్ద మొత్తాలు లేకపోతే పర్లేదు గానీ.. పెద్ద మొత్తాలు ఉండే స్థితి వస్తే.. ఆ వివరాలు తెలిసిన యాప్ నిర్వాహకులు మరో రూపంలో దాన్ని తస్కరించకుండా ఉంటారనే గ్యారంటీ లేదు.
‘అప్పు లభిస్తుంది’ అని మెసేజి రాగానే ఆశ పడడం మానేయాలి. ఆ ఆశలో యాప్ అడిగిన మన వివరాలన్నింటికీ యాక్సెస్ ఇవ్వడం కూడా మానేయాలి. స్వీయ నియంత్రణ ఉండాలి. లేకపోతే.. ఈ యాప్ ల అప్పుల వలలు.. రమేష్ లాంటి వేలమంది యువతరం జీవితాలను చిదిమేస్తాయి.
.

Discussion about this post