పసికూన కంటె తక్కువగానే క్రికెట్ ప్రపంచం పరిగణించే ఆఫ్గనిస్తాన్.. ప్రపంచ మేటి జట్టుల్లో ఒకటైన భారత్ ను ఓ ఆటాడుకుంది. సూపర్ ఫోర్ లో జరిగిన మ్యాచ్ లో అత్యద్భుతమైన పాటవాన్ని ప్రదర్శించి.. మ్యాచ్ ను టై గా ముగించింది. ఇంకా ఒక బంతి మిగిలి ఉండగానే… భారత్ ను ఆలౌట్ చేసి.. ఈ అరుదైన ఫీట్ ను సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్తాన్.. ఏమాత్రం భారత్ కు భయపడకుండా.. 252 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఆ జట్టులో మొహ్మద్ షాజాద్… కేవలం 116 బంతుల్లో 124పరుగులు చేసి.. భారత బౌలర్లను బెంబేలెత్తించాడు. మొహ్మద్ నబీ కూడా 64 పరుగులతో జట్టు మంచి స్కోరు సాధించడానికి తోడ్పడ్డాడు.
వారిని కట్టడి చేయడంలో దారుణంగా విఫలమైన భారత్, తర్వాత బ్యాటింగ్ లో కూడా అలాగే సాగిపోయింది. ఓపెనింగ్ వికెట్లలో రాహుల్ 60, రాయుడు 57, కార్తీక్ 44 తర్వాత జడేజా చేసిన 25 మాత్రమే మంచి స్కోరు. ఆఫ్గనిస్తాన్ ను తేలికగా తీసుకున్న భారత్ అహంకారానికి గట్టి దెబ్బే పడింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆటలోకే దిగలేదు.
భారత బ్యాట్స్ మెన్ ను బెంబేలెత్తించిన ఆఫ్గాన్ బౌలర్లు, క్రమంతప్పకుండా వికెట్లు తీసుకుంటూ.. ఒక బంతి మిగిలి ఉండగానే.. స్కోర్లు సమమైన మ్యాచ్ ను ముగిస్తూ భారత్ ను ఆలౌట్ చేశారు. మ్యాచ్ టై గా ముగిసింది.
.
Discussion about this post