చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీకాళహస్తీశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు మునుపు కంటే బ్రహ్మాండంగా నిర్వహిద్దామని శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి చెప్పారు. ముక్కంటి ఆలయ పరిపాలనా భవనం సమావేశ మందిరంలో శుక్రవారం మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా బియ్యపు మధుసూదనరెడ్డి మాట్లాడుతూ…. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకొని లోపాలు సరిదిద్దుకొని ఉత్సవాలను నిర్వహించాలని కోరారు. ప్రధానంగా విధ్యుత్ కాంతులు ఏర్పాటు బాగుండాలని… పట్టణంలో ఓం నమః శివాయ నినాదం మారు మ్రోగేలా సౌండ్ సిస్టం వుండాలని సూచించారు.
14 రోజుల పూల అలంకరణ విషయంలో 7 రోజులు కర్ణాటక , మరో 7 రోజులు తమిళనాడు వారి సహకారంతో చేపట్టనున్నామని అన్నారు. గత సంవత్సరం కన్నా ఈ సారి రవాణా కోసం బస్సులు పెంచాలని… మెడికల్ క్యాంపులను బస్టాండ్ లో కుడా ఏర్పాటు చేయాలని చెప్పారు. అంబులెన్స్ లు గతం లో రెండు మాత్రమె అందుబాటులో ఉంచారని… అయితే ఈ ఏడాది అవి నాలుగుకు పెంచాలని కోరారు. మహాశివరాత్రి పర్వదినాన విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తన బంధువులు, తెలిసిన వారిని పంపడం వంటివి మానుకోవాలని.. సామాన్య భక్తులకు సౌకర్యాలు కల్పించి పది కాలాల పాటు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు అద్భుతంగా వున్నాయని చెప్పుకునే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
లింగోద్భవ దర్శనంలో తోపులాట జరగకుండా చూడాలని… గుడిలో నుండి బయటకు వచ్చే భక్తులకు ప్రత్యెక ద్వారంపై దృష్టి త్వరగా బయటకు వెళ్ళే విధంగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. ఈ ఏడాది ఉత్సవాల్లో జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి ఉత్సవ మూర్తులను స్వర్ణముఖినదిలో పడవలపై ఉంచడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఇక భక్తకన్నప్ప కొండ నుంచి భరద్వాజతీర్థం (లోబావి) వరకు రోప్ వే ఏర్పాటు చేయాలని చెప్పారు. అదేవిధంగా శ్రీకాళహస్తి నాలుగు మాడవీధుల్లో భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని కూడా బియ్యపు మధు కోరారు. ఇలా చేయడం వలన భక్తులకు ఇబ్బందులు ఉండవని ఆయన అభిప్రాయ పడ్డారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల నిర్వహణకు సమయం తక్కువ ఉన్నందున అధికారులు అందరూ సయన్వయంతో పని చేసి విజయవంతానికి కృషి చేయాలని కోరారు. ఈ ఏడాది ఉత్సవాలు మునుపు కంటే భిన్నంగా అందరూ మెచ్చేలా ఉండాలని కోరారు. సమన్వయంతోనే ఇది సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు.
తిరుపతి అదనపు ఎస్పీ ఎస్పీ సుప్రజ మాట్లాడుతూ… మాడ వీధుల్లో గుడిలో వున్న 260 సి సి కెమెరాలతో పాటు అదనంగా మరో 60 ఏర్పాటు… మెగా కంట్రోల్ రూమ్ కు అనుసంధానం… కాల్ సెంటర్ ఏర్పాటు వంటివి చేపట్టనున్నామన్నారు. శాంతి భద్రతల విషయం లో సిబ్బంది, అధికారులు సమన్వయము తో పని చేస్తారని తెలిపారు. తిరువీధుల్లో ఉత్సవాల ఊరేగింపు సమయంలో హారతి ఇవ్వడానికి ప్రత్యేక స్థలాల గుర్తింపు చేయ గలిగితే ట్రాఫిక్ తగ్గుతుందనిసూచించారు .
తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డి మాట్లాడుతూ… రవాణా సౌకర్యాలు, శాంతి భద్రతలు ప్రధానమన్నారు. శానిటేషన్ విషయం లో మెరుగ్గా వుండాలని… అవసరమైన పరికరాలు, వస్తువులు కావాల్సినవి తెలియజేస్తే కలెక్టర్ దృష్టి లో వుంచి ఏర్పాటు చేస్తామని సూచించారు. నిరంతరం విద్యుత్ వుండేలా విద్యుత్ శాఖ, ఫైర్ సేఫ్టీ కి సంబంధించి అగ్ని మాపక అధికారులు అప్రమత్తంగా వుండాలని చెప్పారు. ఐసీడీ ఎస్ ప్రధానం గా బాల్య వివాహాలు జరగకుండా, ఉత్సవాలలో చిన్న పిల్లలు తప్పిపోకుండా చూసేందుకు సిబ్బందికి విధులు కేటాయించాలని సూచించారు.
ముక్కంటి ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు మాట్లాడుతూ… గత ఐదేళ్లుగా నిర్వహిస్తున్న విధంగానే ఈ ఏడాది కూడా మహాలఘు దర్శనం ఏర్పాటు చేస్తామన్నారు. ఉచిత దర్శనం రంగుల గోపురం నుంచి… స్థానికులకు ఇచ్చే రూ.200 దర్శనం, రూ. 50ల దర్శనం శివయ్య గోపురం నుంచి… రూ. 500 టోకెన్ దర్శనం సుపథ మండపం నుంచి ప్రవేశం ఉంటుందన్నారు.
పార్కింగ్ స్థలాలు మార్కెట్ యార్డ్ , ఏపీసీడ్స్ , నారాయణ స్కూల్ , స్కిట్ కాలేజి, కృష్ణ మందిరం వెనుక, ఎం జీ ఎం లాండ్స్ లో పార్కింగ్ ఏర్పాటు చేస్తమన్నారు. బస్టాప్ ల నుంచి స్కూల్ బస్సుల ద్వారా భక్తులకు ఉచిత ఏర్పాటు ఉంటుందని చెప్పారు. ఉత్సవాల నిర్వహణ లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు .
సమావేశంలో ఐసీడీ ఎస్ బాల్య వివాహాల నిషేధం, గుడి మల్లం మహాశివరాత్రి ఉత్సవాల గోడ పత్రికలను ఆవిష్క రించారు. ఈ సమీక్ష లో స్వామి గురుకుల్, మునిసిపల్ కమీషనర్ బాలాజీ నాయక్ , ఇరిగేషన్ అధికారి గోపాల్, ఆర్ టీసీ డిపో మేనేజరు ఎం. సుబ్రహ్మణ్యం, ఐ సీడీఎస్ పీడీ నాగపద్మజ, సీ డీ పీవో శాంతి దుర్గ , ఎలక్ట్రికల్ ఈఈ వాసు రెడ్డి, తహసీల్దార్ షేక్ జరీనా , డిప్యూటీ ఈవో కృష్ణా రెడ్డి, ఈఈ వెంకట నారాయణ, పోలీస్ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి మహా శివరాత్రి బ్రహ్మొత్సవములు – 2022 ఉత్సవాల వివరాలు
24.2.2022 వ తేది గురువారం శ్రీ కన్నప్ప ధ్వజారోహణము
25.2.2022 వ తేదీ శుక్రవారం- శ్రీ స్వామి వారి ధ్వజారోహణము
26.2.2022 వ తేదీ శనివారం- 2 వ తిరునాళ్ళు- భూత రాత్రి
27.2.2022 వ తేదీ ఆదివారం- 3 వ తిరునాళ్ళు- గాంధర్వ రాత్రి
28.2.2022 వ తేదీ సోమవారం -4 వ తిరునాళ్ళు- నాగ రాత్రి
01.03.2022 వ తేదీ మంగళవారం- మహా శివరాత్రి – నంది సేవ (రాత్రి) లింగోద్భవము
02.03.2022 వ తేదీ బుధవారం- రధోత్సవము (పగలు) బ్రహ్మ రాత్రి – తెప్పోత్సవము (రాత్రి)
03.03.2022 వ తేదీ గురువారం- శ్రీ స్వామి అమ్మవర్ల కళ్యాణోత్సవము (రాత్రి) స్కంధ రాత్రి
04.03.2022 వ తేదీ శుక్రవారం- సభాపతి కళ్యాణము -ఆనంద రాత్రి
05.03.2022 వ తేదీ శనివారం- కైలాసగిరి ప్రదక్షిణము -శ్రీ స్వామి అమ్మవార్లు ఋషిరాత్రి
06.03.2022 వ తేదీ ఆదివారం- తీర్ధవారి (ఉదయం) ధ్వజావరోహణము
07.03.2022 వ తేదీ సోమవారం- పల్లకీ సేవ (రాత్రి)
08.03.2022 వ తేదీ మంగళవారం- ఏకాంత సేవ (లోపల పల్లకి)
09.03.2022 వ తేదీ బుధవారం -అభిషేకము/ నిత్యోత్సవ ఆరంభం
.

Discussion about this post