దక్షిణకాశి శ్రీకాళహస్తి క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఎంత వైభవంగా జరుగుతాయో అందరికీ తెలిసిందే. ఈ ఉత్సవాలకు సంబంధించి.. శ్రీకాళహస్తితో ముడిపడిఉన్న స్థానిక ప్రజాప్రతినిధులందరికీ సమానంగానే ప్రాధాన్యం ఉంటుంది. అలాంటిది.. శ్రీకాళహస్తి ప్రాంతం తిరుపతి ఎంపీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే నేపథ్యంలో తిరుపతి ఎంపీని ఎలా మరచిపోతారు? ఆహ్వానపత్రికల్లో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులందరి పేర్లను ఫోటోలో సహా ముద్రించి.. స్థానిక ఎంపీ గురుమూర్తిని మరచిపోవడం వివాదం అవుతోంది. కేవలం ఆయన దళితుడు కావడం వల్లనే పక్కన పెట్టారనే విమర్శలు వస్తున్నాయి.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆహ్వాన పత్రికల వివాదం చోటు చేసుకుంది. ఆలయ అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సరిదిద్దు కుంటున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఈ నెల 24వ తేదీ నుంచి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయం తరపున ఆహ్వాన పత్రికలు ముద్రించడం ఆనవాయితీ. ఈ ఏడాది కొన్ని రోజుల కిందటే ఆహ్వాన పత్రికలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేశాయి. అందులో చాలా తప్పులు ఉండటంతో అప్పట్లో విమర్శలు వచ్చాయి.
సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఆహ్వాన పత్రికలు ఆలయం తరపున ముద్రించ లేదని అధికారులు వివరణ ఇచ్చు కోవాల్సి వచ్చింది. వాటి కథ పక్కన పెడితే… ఆలయం తరపున ముద్రించిన బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికలు రెండు రోజుల కిందట కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి సతీమణి వాణి, ఎమ్మెల్యే కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి చేతుల మీదుగా ఆలయంలోని గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఆవిష్కరించారు.
ఆలయం తరపున ముద్రించిన ఆహ్వాన పత్రికల్లో ముఖ్యమంత్రి జగన్, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా ఇన్ ఛార్జి మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి, దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణి మోహన్, కమిషనరు హరి జవహర్ లాల్ ఫోటోలు ముద్రించారు. అయితే తిరుపతి (స్థానిక) పార్లమెంటు సభ్యులు మద్దెల గురుమూర్తి ఫోటీ మాత్రం ముద్రించలేదు.
ఎంతో ముఖ్యమైన బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలో స్థానిక పార్లమెంటు సభ్యులు గురుమూర్తి ఫోటో ముద్రించక పోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా దళిత సంఘాలు ఆలయ అధికారుల తీరుపై మండి పడ్డాయి. గురుమూర్తి దళితుడు అయినందునే ఇలా విస్మరించారని వారు ఆరోపిస్తూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు.
దీంతో ఆలయ అధికారులు మేల్కొన్నారు. జిల్లా ఇన్ ఛార్జి మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణం చెందడంతో ఆయన ఫోటో తొలగించి… ఆ స్థానంలో ఎంపీ మద్దెల గురుమూర్తి ఫోటో ఉంచి… కొత్తగా ఆహ్వాన పత్రికలు ముద్రిస్తున్నట్లు ప్రకటన చేశారు. ఆలయ అధికారులకు ముందు చూపు కొరవడటం… అవగాహన లేని వారి సలహాలు తీసుకుని ఆహ్వాన పత్రికలు ముద్రించడం వలనే ఈ పొరబాటు చోటు చేసుకుందనే విమర్శ వస్తోంది. ఆలయ అధికారులు ఇకనైనా పొరబాట్లు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.
.

Discussion about this post