దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తాగ్రేసురుడైన భక్తకన్నప్పకు తొలిపూజతో జంగమయ్య బ్రహ్మోత్సవాలకు గురువారం అంకురార్పణ జరిగింది. పరమశివునికి అత్యంత ప్రీతి పాత్రుడైన భక్తకన్నప్ప ధ్వజారోహణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
బ్రహ్మోత్సవాలలో భాగంగా ముక్కంటి ఆలయంలో భక్తకన్నప్ప ఉత్సవమూర్తికి విశేష అలంకరణ చేశారు. స్వామి వారిని సర్వాలంకారణ భూషితుణి చేశారు. ఈ అలంకరణలో భక్తకన్నస్ప దేదీప్యమానమై వెలిగి పోయారు. అలంకరణ పూర్తి చేసిన తరువాత ఆలయ పండితులు మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మధ్యాహ్నం 3గంటల తరువాత భక్తకన్నప్ప ఉత్సవమూర్తిని మంగళవాయిద్యాలు, మేళ తాళాల మధ్య భక్తకన్నప్ప కొండపైకి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న ఆలయంలో ఉత్సవమూర్తిని ఉంచారు. ఆలయంలో స్వామి వారికి పూజలు చేశారు.
ఆ తరువాత భక్తకన్నప్ప ఆలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభానికి కొడిని ఎగురవేసి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలు తిలకించడానికి వందలాది మంది భక్తులు భక్తకన్నప్ప కొండపైకి తరలి వచ్చారు.
ధ్వజారోహణం వీక్షించి మంత్రముగ్దులయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు, పలువురు ప్రముఖులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
భక్తకన్నప్ప పురవిహారం
భక్తకన్నప్ప కొండపై గల ఆలయంలో ధ్వజారోహణం కార్యక్రమం పూర్తయిన తరువాత స్వామివారి ఉత్సవమూర్తిని పురవీధుల్లో ఊరేగించారు. రాజగోపురం గుండా ఈ ఊరేగింపు వచ్చింది. చతుర్మాడవీధుల్లో ఊరేగుతున్న భక్తకన్నప్పను పలువురు భక్తులు దర్శించుకున్నారు. కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
.

Discussion about this post