అక్కడి వాతావరణం చూస్తే.. ఆధ్యాత్మికత శోభించదు. దేవదేవుడి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యమూ కనిపించదు. అంత రాజకీయ భజన ఫ్లెక్సిల మయంగా ఉంటుంది. భక్తులు ఎవరైనా దేవుడిని దర్శించుకోవడానికి వీధిలోకి వస్తే.. ‘దేవుడిని తర్వాత చూడొచ్చు.. ముందు మమ్మల్ని చూసి తరించు’ అన్నట్టుగా ఫ్లెక్సిల్లోని పలుపార్టీల నాయకులు నవ్వులతో పలకరిస్తుంటారు. వీరి ఆర్భాటపు ఫ్లెక్సిల మధ్య.. ఊరేగింపుగా వచ్చే పరమశివుడు భక్తులకు కనిపించే పరిస్థితే లేకుండా పోతోంది.
దక్షిణకాశిగా గుర్తింపు ఉన్న సద్యోముక్తి క్షేత్రం శ్రీకాళహస్తిలో ఎంతో వైభవంగా జరిగే శివరాత్రి ఉత్సవాల నేపథ్యంలోని దుస్థితి ఇది. ఉత్సవాలు జరిగే అన్ని రోజులపాటూ ముక్కంటి ఊరేగా నాలుగు వీధులు.. మామూలుగా అయితే.. ఆధ్యాత్మికతకు ఆనవాళ్లుగా ఉండేవి. ఇప్పుడు రాజకీయ వాసన కొడుతున్నాయి. పెద్దపెద్ద రాజకీయ ఆర్భాటపు, బడాయి ఫ్లెక్సిలు కొలువు తీరిన నాలుగు వీధుల్లో.. మహదేవుడు శ్రీకాళహస్తీశ్వరుడు అయినా సరే.. బిక్కుబిక్కుమంటూ ఊరేగాల్సిన దుస్థితి!
దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తి క్షేత్రంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. పదమూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ముక్కంటి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంటే శ్రీకాళహస్తి ప్రజలు ఇంటి పండుగలా భావిస్తారు.
బ్రహ్మోత్సవ వేళ శివ, పార్వతులు ఊరేగే చతుర్మాడ వీధుల్లో అయితే స్వామి, అమ్మవార్లను తిలకించడానికి భక్తులు బారులు తీరుతారు. ఇలాంటి చోట నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ నేతలకు సంబంధించి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మాడవీధుల పవిత్రత కాపాడాలని కూడా వారు కోరుతున్నారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఛైర్మన్ గా పేట రాధారెడ్డి ఉన్న సమయంలో శివ, పార్వతులు విహరించే చతుర్మాడ వీధుల్లో పవిత్రతను దృష్ట్టిలో ఉంచుకుని ఎలాంటి రాజకీయ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని కౌన్సిల్ తీర్మానం చేశారు. కలెక్టరు కూడా ఈ తీర్మానాన్ని ఆమోదించారు.
ఇలా జరిగిన తరువాత ఓ పర్యాయం అప్పటి మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జన్మదినం పురస్కరించుకుని మాడవీధుల్లో భాగమైన భేరివారి మండపం, పెళ్లి మండపం వద్ద ఆయన అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిపై పురపాలక సంఘం అధికారులకు కొందరు ఫిర్యాదు చేయడంతో వెంటనే తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ విషయాన్ని కొందరు టీడీపీ నేతలు బొజ్జల దృష్టికి తీసుకొచ్చారు.
స్వామి, అమ్మవార్లు ఊరేగే చతుర్మాడ వీధుల్లో రాజకీయ నేతల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని.. తన ఫ్లెక్సీలు అక్కడ ఎందుకు ఏర్పాటు చేశారని.. వాటిని వెంటనే తీసేయాలని నేతలను మందలించారు. దీంతో ఎలాంటి సమస్యలేకుండా పురపాలక సిబ్బంది వాటిని తొలగించారు. టీడీపీ హయాంలో మాడవీధుల్లో రాజకీయ నేతల ఫ్లెక్సీలు లేకుండా పూర్తిగా ఆపగలిగారు.
అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి నప్పటి నుంచి మాడవీధుల్లో మళ్లీ రాజకీయ నేతల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం మొదలు పెట్టారు. అయినా పురపాలక సంఘం అధికారులు ఏమీ పట్టించుకోవడం లేదు. వాటిని గురించి ప్రజలు కూడా వదిలేశారు. అయితే బ్రహ్మోత్సవాల వేళ ఆలయ పరిసరాలు, గోపురాల వద్ద, చతుర్మాడవీధులు, పట్టణ ప్రధాన మార్గాల్లో రాజకీయ పార్టీల నేతలు పోటీలు పడి మరీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు.
శివ, పార్వతుల ఫోటోల కంటే వీరివే పెద్దగా కనిపిస్తున్నాయి. ఇలా ఉండటం వలన ముక్కంటి భక్తులు మానసిక వేదనకు గురవుతున్నారు. రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఆలోచించి… బ్రహ్మోత్సవ వేళ శ్రీకాళహస్తి క్షేత్ర పవిత్రతను కాపాడటానికి స్వచ్చంధంగా రాజకీయ ఫ్లెక్సీలు తొలగించాలని భక్తులు కోరుతున్నారు. నేతలు కూడా ఈ దిశగా ఆలోచించి సహకరించాల్సి ఉంది.
.

Discussion about this post