దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తి క్షేత్రంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మంగళవారం మహాశివరాత్రి ఉత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణలతో సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
శైవ క్షేత్రాల్లో చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి క్షేత్రం ఇల కైలాసంగా ఖ్యాతి గాంచింది. సృష్టిలోని భూమి, ఆకాశం, నీరు, వాయువు, అగ్ని అనే శక్తులను పరమేశ్వరు డు తనలో నిక్షేపించుకుని లింగాకారంలో ఇక్కడ ఆవిర్భవించాడు.
కంచిపీఠం మట్టిలింగంగా… చిదంబర క్షేత్రంలో ఆకాశలింగంగ.. జంబుకేశ్వరంలో జల లింగంగా… అరుణాచలంలో అగ్నిలింగంగా.. శ్రీకాళహస్తిలో వాయులింగంగా ఆవిర్భవించాడు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా శ్రీకాళహస్తీశ్వరుని గర్భాలయంలో రెండు దీపాలు లింగం యొక్క ఉచ్చ్వాస, నిశ్వాసలతో వచ్చే గాలితో కదులుతూ ఉంటాయి.
ఈ ఆలయంలోని లింగం స్వయంభులింగం. శ్రీకాళహస్తీశ్వర ఆలయం 12వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. రాజేంద్ర చోళుని పాలన 13వ శతాబ్దంలో ముగిసిన తరువాత విజయనగర రాజులైన సాలువ రాజు, శ్రీకృష్ణ దేవరాయలు, శ్రీకాళహస్తి జమీందారుల హయాంలో ఈ ఆలయం అనేక రకాలుగా అభివృద్ధి చెందిందని చెబుతారు.
శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దక్షిణ కైలాసమని, భాస్కర క్షేత్రమని, అఖండ బిల్వవనమని, సద్యోముక్తి క్షేత్రమని, శివానందైక నిలయమని పురాణాల్లో చెప్పబడింది. ఇక్కడ శివలింగాన్ని పూజించి సాలె పురుగు, పాము, ఏనుగు, మోక్షం పొందాయి. అందుకే ఈ క్షేత్రానికి శ్రీ(సాలె పురుగు)- కాళ(పాము)- హస్తి(ఏనుగు) అనే పేరు వచ్చింది.
ఇక తిన్నడనే భక్తుడు శివునికి తన కన్ను ఇచ్చి భక్తకన్నప్పగా పేరు గాంచాడు. అందుకే శ్రీకాళహస్తి క్షేత్రంలో భక్తకన్నప్పకే తొలిపూజ చేస్తారు. ఆ తరువాతనే శ్రీకాళహస్తీశ్వరునికి పూజలు చేస్తారు. ఈ ఆలయంలో జగన్మాత అయిన పార్వతీదేవి జ్ఞాన ప్రసూనాంబగా వెలిశారు. జ్ఞాన ప్రసూనాంబ దేవి తాను సంపాదించిన జ్ఞానం మొత్తం సర్వ జీవరాసులకు పంచి పెడుతుందని ప్రతీతి. అమ్మవారిని దర్శించుకుంటే జ్ఞానం సిద్దిస్తుందనే నమ్మకం భక్తుల్లో ఉంది.
రవాణా సౌకర్యం ఇలా
తిరుపతి నగరానికి శ్రీకాళహస్తి 38కి.మీ. దూరంలో ఉంది. తిరుపతి బస్టాండు నుంచి ప్రతి ఐదు నిమిషాలకు ఒక బస్సు సౌకర్యం ఉంది. అదేవిధంగా నెల్లూరు నుంచి వయా నాయుడుపేటు మీదుగా శ్రీకాళహస్తికి రావచ్చు. నాయుడుపేటకు 28 కి.మీ. దూరంలో శ్రీకాళహస్తి ఉంది. ఈ మార్గంలో కూడా బస్సు సౌకర్యాలు బాగానే ఉన్నాయి. ఇక చెన్నై నుంచి తడ మీదుగా శ్రీకాళహస్తికి రావాలంటే సుమారు 120 కి.మీ. దూరం ఉంటుంది.
.

Discussion about this post