సర్వాంతర్యామి అయిన శ్రీకాళహస్తీశ్వరుడు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజైన సోమవారం రాత్రి శేష వాహనం పైనా… జ్ఞానప్రసూనాంబ అమ్మవారు యాళి వాహనం పైనా భక్తకోటికి దర్శన భాగ్యం కల్పించారు. నాగరాత్రి పరమార్థాన్ని భక్తులకు తెలిసేలా పురవీధుల్లో విహరించారు. భక్తవత్సలుడుగా తలపై ఒకటి, కంఠంలో ఒకటి… భుజకీర్తులుగా రెండు…చేతులకు రెండు.. కాళ్లకు రెండు.. నడుముకు ఒకటి చొప్పున మొత్తం 9 సర్పాలను అలంకరించుకుని పన్నగ భూషణుడుగా భక్తులకు దర్శనమిచ్చారు.
నిస్వార్థమైన భక్తిలో ఎలాంటి వైషమ్యాలు, వైరుధ్యాలు ఉండకూడదనే పరమార్థాన్ని తెలిసేలా స్వామి, అమ్మవార్లు భక్తులకు అభయమిచ్చారు. వినాయకస్వామి మూషిక వాహనం పైనా… శ్రీవళ్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, చండికేశ్వరుడు, భక్తకన్నప్ప చప్పరాల పైనా అధిష్టించి స్వామి, అమ్మవార్లను అనుసరిం చారు. శేష, యాళి స్వర్ణకాంతులతో దేదీప్యమానమై వెలుగుతూ పురవిహారం చేస్తున్న స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు.
కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కాగా ఉదయం స్వామి వారు బంగారు హంస వాహనం పైనా.. అమ్మవారు చిలుక వాహనం పైనా పురవిహారం చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
రేపు నందిసేవ
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ రోజైన మంగళవారం రాత్రి నందిసేవ నిర్వహించనున్నారు. శ్రీకాళహస్తీశ్వరస్వామి బంగారు నందిపైనా… జ్ఞానప్రసూనాంబ అమ్మవారు సింహ వాహనం పైపా అధిష్టించి పురవిహారం చేయనున్నారు.
తిరుమల బ్రహ్మోత్సవాలలో గరుడసేవకు ఎంత ప్రాధాన్యం ఉందో… శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే నందిసేవకు అంతే ప్రాధాన్యత ఉంది. నంది, సింహ వాహనాలపై ఊరేగుతున్న శివ, పార్వతులను దర్శించుకోవడానికి భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తారు. నందిసేవ సందర్భంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఉదయం స్వామి వారు ఇంద్ర విమానం పైనా… అమ్మవారు చప్పరం పైనా భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు.
.

Discussion about this post