స్వర్ణాలంకార భూషితులై.. విద్యుత్ దీపకాంతుల్లో ధగధగలాడే గంగాదేవి సమేత పరమేశ్వరుడు, మరోవైపు పార్వతీదేవి… నారద పుష్కరణి చుట్టూ వందలాదిగా భక్తజనం… మార్మోగుతున్న శివ నామ స్మరణ.. అందమైన తెప్పలపై ఆశీసునులై పుష్కరణిలో విహరించే స్వామి అమ్మవార్లను చూడటానికి భక్తులకు రెండు కనులు చాలలేదు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బుధవారం రాత్రి నారద పుష్కరణిలో శివపార్వతుల తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది.
మొదట అలంకార మండపంలో గంగాభవానీ సమేత శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించారు. ఆలయ పురోహితులు శాస్త్రోకంగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను చప్పరాలపై అధిష్టించి మంగళ వాయిద్యాలు, మేళ తాళాల మధ్య బాబు అగ్రహారంలోని నారద పుష్కరణి వద్దకు తీసుకు వచ్చారు.
వినాయకస్వామి, శ్రీవళ్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, చండికేశ్వరుడు, భక్తకన్నప్ప వీరిని అనుసరించారు. ఇక నారద పుష్కరణిలో గంగాభవానీ సమేత శ్రీకాళహస్తీశ్వరుడు ఒక తెప్పపై.. జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు మరో తెప్పపై ఆశీనులయ్యారు.
పుష్కరణిలో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. విద్యుత్ దీపకాంతుల వెలుగుల్లో దేదీప్యమానమై వెలిగి పోతూ పుష్కరణిలో విహరిస్తున్న గౌరీశంకరులను చూడటానికి భక్తులకు రెండు కనులు చాలలేదు. భక్తులందరూ స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ఆనంద పరవశులయ్యారు.

.

Discussion about this post