ఆకాశం పందిరిగా.. భూ మండలం వేదికగా.. సకల దేవతాగణాలు వీక్షిస్తుండగా.. అశేష భక్తజన వాహిని మధ్య ఆదిదంపతుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తెల్లవారు జామున 4.30గంటల ప్రాంతంలో జ్ఞానప్రసూనాంబ దేవికి శ్రీకాళహస్తీశ్వరునిచే మాంగల్యధారణ కార్యక్రమం పూర్తయింది. ఇదే శుభ ఘడియలో ఆది దంపతుల సమక్షంలో పలువురు జంటలు వివాహం చేసుకుని ఒక్కటయ్యారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం వేకువ జామున ఆది దంపతుల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంతకు మునుపు గురువారం రాత్రి ఆలయంలోని అలంకార మండపంలో శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానపమ్రసూనాంబ అమ్మవారిని స్వర్ణాభరణాలతో అలంకరించారు.
ఆలయ పురోహితులు స్వామి, అమ్మవార్లకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. పూజల అనంతరం స్వామి వారిని గజ వాహనం పైనా.. అమ్మవారిని సింహ వాహనం పైనా అధిష్టింప చేశారు. మంగళ వాయిద్యాలు, మేళ తాళాలు.. కళాకారుల ఆటలు, పాటల మధ్య ఆది దంపతులు పెండ్లి మండపం వద్దకు చేరుకున్నారు. పెండ్లి మండపం వద్దకు మొదట పరమేశ్వరుడు చేరుకున్నాడు.
మధ్యలో పార్వతీదేవి అలకబూనారు. చండికేశ్వరుడు మధ్యవర్తిత్వం నిర్వహించి అమ్మవారి అలక తీర్చారు. అందుకు సంతృప్తి చెందిన పార్వతీదేవి పెండ్లి మండపం వద్దకు చేరుకున్నారు. గంగాధరుడు, శివానీ పెళ్లి పీటలపై ఆశీసులయ్యారు. వేదపండితులు కలశ స్థాపన చేశారు. సంకల్పం, యజ్ఞాహుతి పూజలు పూర్తి చేశారు. ఈ పూజల అనంతరం వేదపండితులు మంత్రోచ్చరణలు చేస్తూ ఆది దంపతుల కల్యాణ ఘట్టాన్ని పూర్తి చేశారు. శివపార్వతుల కల్యాణం వీక్షించడానికి పట్టణ వాసులతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన వారు వేలాదిగా తరలి వచ్చారు.
కల్యాణం వీక్షించడానికి వచ్చిన భక్తజనంతో నగరివీధి, నెహ్రూవీధి నిండి పోయాయి. కాగా ఆది దంపతుల కల్యాణం సందర్భంగా వివాహం చేసుకున్న వారికి ఆలయం తరపున మంగళ సూత్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, దుస్తులు అందజేశారు. పార్వతీదేవికి మాంగల్యధారణ చేసిన ఘడియలోనే ఈ జంటలు కూడా మాంగల్య ధారణ కార్యక్రమం పూర్తి చేశారు.
రుద్రాక్ష చప్పరాలపై ఆది దంపతుల పురవిహారం
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం ఉదయం ఆది దంపతులు రుద్రాక్ష చప్పరాలపై పురవిహారం చేశారు. ఆది దంపతుల కల్యాణం ముగిసిన తరువాత ఉత్సవ మూర్తులను ఆలయానికి తీసుకెళ్లారు. ఉదయం 11గంటల ప్రాంతంలో అలంకార మండపంలో పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను రుద్రాక్ష చప్పరాలపై అధిష్టింప చేసి పురవిహారానికి తీసుకువచ్చారు. రుద్రాక్ష చప్పరాలపై పురవిహారం చేస్తున్న ఆది దంపతులను దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
రేపు కైలాసగిరి ప్రదక్షిణ
మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శనివారం కైలాసగిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. శివపార్వతుల కల్యాణానికి విచ్చేసిన సకల దేవతా గణాలకు వీడ్కోలు చెప్పేందుకు స్వామి, అమ్మవార్లు ఈ ప్రదక్షిణకు వెళ్లనున్నారు. కైలాసగిరి ప్రదక్షిణ పురస్కరించుకుని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలను విజయవంతం చేయాలని ఆలయ అధికారులు కోరుతున్నారు.
.

Discussion about this post