శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి ఆలయ ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు సమర్పించారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ అగరం మోహన్ రెడ్డి, ఆలయ కార్య నిర్వహణాధికారి వెంకటేశ్వర్లు ఆద్వర్యంలో ఈ పట్టు వస్త్రాలు అందజేశారు.
పట్టు వస్త్రాలు తీసుకు వచ్చిన కాణిపాక ఆలయ అధికారులకు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి, ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ అధికారులు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు.
మంగళ వాయిద్యాలు, మేళ తాళాల మధ్య పట్టు వస్త్రాలను తీసుకెళ్లి అలంకార మండపంలో ఆలయ వేద పండితులకు అందజేశారు. అనంతరం వారు జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు.
గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఈవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముక్కంటికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం దక్కడం ఆనందంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ముక్కంటి ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు, డిప్యూటీ ఈవో ఎన్ ఆర్ కృష్ణారెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.
.

Discussion about this post