ప్రస్తుత సమాజంలో మహిళలకు రక్షణ కరువైందని పలువురు మహిళా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
112వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని తిరుపతి నగరంలోని యశోదనగర్ లో గల ఎంబీ భవన్ లో ఐద్వా, సీఐటీయూ, యూటీఎఫ్ సంఘాలు సంయుక్తంగా సోమవారం ‘మహిళలపై జరుగుతున్న హింస’ అనే సదస్సు నిర్విహించారు.
ఈ సదస్సు మహిళా సంఘం నగర కార్యదర్శి జయంతి అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి, సాయిలక్ష్మి, సీఐటీయూ నాయకురాలు వాణిశ్రీ, యూటీఎఫ్ నాయకురాలు పద్మ, రైతు సంఘం నాయకురాలు హేమలత, శ్రామిక మహిళా నాయకురాలు లక్ష్మీ హాజరై ప్రసంగించారు .
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్త చేశారు.
మహిళల వస్త్రధారణపై పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నారన్నారు. అత్యాచారాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల కోసం చేస్తున్న చట్టాలు అమలుకు నోచుకోవడం లేదన్నారు.
ప్రభుత్వ ఉదాసీనత వల్ల అత్యాచారాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడటం లేదన్నారు. ఇపుడు ఉన్న చట్టాలు అన్నీ కూడా మహిళలకు రక్షణ కల్పించే విధంగా లేవన్నారు.
ఒకవేళ నిందితులను జైల్లో నిర్బంధించి కోర్టులో శిక్షలు వేయాలన్నా.. రాజకీయ ఒత్తిళ్లతో శిక్షలు అమలు కావడం లేదన్నారు. మహిళలను వంట గదికి పరిమితం చేయాలని నేటి ప్రభుత్వాలు చూస్తున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పురుషాధిక్య సమాజంలో ఉన్న పాలకవర్గాలు మహిళలను అందలం ఎక్కనివ్వకుండా చేస్తున్నారని ఆరోపించారు. మహిళలు విమానాలు నడపడంతో పాటు అంతరిక్షం లోకి ప్రవేశిస్తున్నప్పటికీ ఇంకా మహిళల పట్ల చిన్న చూపు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదని.. మహిళల వద్ద వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని ఆరోపించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడానికి నిందితులకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వారు డిమాండు చేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ప్రభుత్వాలు తీసుకువచ్చిన చట్టాలను కఠినంగా అమలు చేయాలన్నారు. మహిళలకు రక్షణ కల్పించక పోతే ఐక్యంగా ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర అద్యక్షురాలు సుజాతమ్మ, రేఖ, పౌర్ణమి, రేణుక, సాయిదీప్తి, లలిత తదితరులు పాల్గొన్నారు.
.

Discussion about this post