పరమశివుడంటే ఎవరు? మనకు తెలిసిన శివతత్వం ఏమిటి? శివరాత్రి సందర్భంగా ఈ విషయాల్ని చర్చించుకోవడం అవసరమే. మనకు తెలిసినంత వరకు ఐహికమైన కోణంలోంచి చూస్తే.. సింప్లెస్ట్ లోకెల్లా సింప్లెస్ట్ జీవన శైలితో బతికేవాడు శివుడు. జంతుచర్మం ఒంటికి చుట్టుకుంటాడు.. పశువునే ఎక్కి ప్రయాణిస్తుంటాడు.. పామును మెళ్లో వేసుకుని తిరుగుతుంటాడు… ఒళ్లంతా బూడిద పూసుకుంటాడు.. శ్మశానంలో బతికేస్తుంటాడు… ఇలాంటి వాడికి భోగాలు అవసరమా? సౌఖ్యాలను సమకూరిస్తే ఎక్కువ సంతోషించి.. మనల్ని మరింత బాగా కరుణిస్తాడా?
ఆ సంగతి ఏమో గానీ.. భారత ప్రభుత్వం మాత్రం సదరు శివుడి కోసం రైల్లో ఒక ఏసీబెర్తును రిజర్వు చేసింది. ఏదో ఒక ప్రయాణానికి కాదు.. ఒక బెర్తును పర్మినెంటుగా రిజర్వు చేసేసింది! అవును చోద్యంగా అనిపించినా ఇది నిజం!
వారణాశి నుంచి ఇండోర్ దాకా.. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని, ఓంకారేశ్వర్ లను కలుపుతూ వెళ్లే రైలును రెండు రోజుల కిందట ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ ట్రైన్ సర్వీసు పేరు ‘కాశీ మహాకాళ్ ఎక్స్‌ప్రెస్’! ఈ రైలులో సాక్షాత్తూ పరమశివుడికి ఒక బెర్తు కేటాయించారు. బి5 పెట్టెలో 64వ నెంబరు బెర్తు పరమశివుడిది అన్నమాట. ఆ బెర్తును మరెవ్వరికీ ఏరోజూ కూడా కేటాయించరు. శాశ్వత ప్రాతిపదికన ఆ బెర్తును ఖాళీగా వదిలేయాలని ఆలోచిస్తున్నారు.
ఆ బెర్తు మీద శివుడి ఆలయాన్ని చిత్రీకరించి.. అది మహాశివుడికోసం ప్రత్యేకించిన బెర్తు అని ప్రత్యేకంగా తెలిసేలా చేస్తాం అని రైల్వే అధికారులు ప్రకటిస్తున్నారు. కాబట్టి, మూడు జ్యోతిర్లింగ క్షేత్రాల్లోనూ సంచరిస్తూ ఉండడానికి.. అదృశ్యరూపుడైన పరమశివుడు ఎప్పుడు రైలెక్కుతాడో తెలియదు కాబట్టి.. ఆయనకు తన బెర్తు ఏదో గుర్తు తెలియడం కోసం ఆలయాన్ని చిత్రించి.. ఆ బెర్తును ఎప్పటికీ ఖాళీగానే ఉంచుతారన్నమాట.
ఇదేదో కాశీ మహాకాళ్ ఎక్స్‌ప్రెస్ గురించి ప్రచారగిమ్కిక్కు లాగా మీకు అనిపిస్తే మనం చేయగలిగింది ఏమీ లేదు. అయినా మన పిచ్చి గానీ.. నిత్యం శ్మశానాల్లో బూడిద పూసుకుని తిరిగే పరమశివుడు.. వీరు బెర్తు వేశారు కదాని.. ఏసీ పెట్టెలో ప్రయాణించాలనుకుంటాడా? ఒక వేళ రైలెక్కి వెళ్లాలనుకున్నా.. జనరల్ బోగీలో వెళ్తాడు గానీ.. అనుకుంటున్నారు జనం. ఏదేమైనా.. బీ5-64 సీటుకు ఎదురుగా ఉండే బెర్తులకు, ఆ పెట్టె మొత్తానికి కూడా టికెట్లకు బాగా డిమాండు ఉంటుందనడంలో సందేహం ఏముంది?
.

Discussion about this post