శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్న వన్నెకుల క్షత్రియులు (పల్లె రెడ్లు) ఏకతాటి పైకి వచ్చారు. శ్రీకాళహస్తిలోని వారి కుల సంఘ కార్యాలయంలో ఆదివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి… నూతన కార్యవర్గాన్ని ఎన్నకున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా సమావేశం నిర్వహించి… ఇకపై పల్లెరెడ్లు అందరూ ఐకమత్యంగా ఉండాలని తీర్మానించారు.
వీరి అత్యవసర సమావేశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారడంతో పాటు… ఆసక్తి రేకిత్తిస్తోంది. ఇందుకు కారణం శ్రీకాళహస్తి, రేణిగుంట, ఏర్పేడు, తొట్టంబేడు మండలాల్లో రాజకీయాలను శాసించ గలిగే స్థాయిలో వీరు ఉండటమే కారణం.
ఈ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే ఒకసారి శ్రీకాళహస్తి నుంచి సత్రవాడ మునిరామయ్య శాసనసభ్యునిగా గెలుపొందారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున ఇదే సామాజిక వర్గానికి చెందిన రష్ ఆస్పత్రి అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం శ్రీకాళహస్తి నుంచి పోటీ చేసి 30వేలు పై చిలుకు ఓట్లు సంపాదించారు. ఆ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆ పార్టీలో క్రియాశీలకంగా లేరు. అయినా తన అభిమానులు, తన వర్గ ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు.
ఇక ఇదే సామాజిక వర్గానికి చెందిన పేట రాధారెడ్డి శ్రీకాళహస్తి పురపాలకసంఘం ఛైర్మన్ గా పని చేస్తూ… అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఈయన మరణానంతరం ఇదే సామాజిక వర్గానికి చెందిన మిన్నల రవికి తెలుగుదేశం వారు పురపాలక సంఘం వైస్ ఛైర్మన్ పదవి ఇచ్చారు. ఇదిలా ఉండగా వైసీపీ ఆవిర్బావం నుంచి ఆ పార్టీ అభివృద్ధి కోసం టీఎంవీకండ్రిగకు చెందిన వడ్లతాంగళ్ బాలాజీ ప్రసాద్ రెడ్డి కృషి చేశారు. పార్టీ కోసం రూ.కోట్లు ఖర్చు చేశారు.
ఈయన ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పని చేస్తున్నారు. వైసీపీ ఎంతో కృషి చేసిన వడ్లతాంగళ్ బాలాజీ ప్రసాద్ రెడ్డికి… ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక స్థానిక నేతలు పూర్తిగా ప్రాధాన్యత తగ్గించారు. కనీసం పార్టీ కార్యక్రమాలకు కూడా పిలవడం లేదు.
ఈ కారణంగా బాలాజీ ప్రసాద్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు సత్రవాడ ప్రవీణ్ కూడా వైసీపీ విజయం కోసం శక్తి వంచన లేకుండా పని చేశారు. అధికారంలోకి వచ్చాక ఈయనకూ ప్రాధాన్యత తగ్గించారు. శ్రీకాళహస్తీశ్వర ధర్మకర్తల మండలి ఛైర్మన్ పదవి కోసం వడ్లతాంగళ్ బాలాజీ ప్రసాద్ రెడ్డి, సత్రవాడ ప్రవీణ్ తీవ్రంగా ప్రయత్నం చేశారు. అయితే శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి సహకరించక పోవడంతో వీరిలో ఎవరికీ ఈ పదవి దక్కలేదు. వీరికే కాదు… ఈ సామాజిక వర్గానికి చెందిన వారికి వైసీపీలో ప్రాధాన్యత బాగా తగ్గించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఈ సామాజిక వర్గానికి చెందిన వారు సంఖ్యాపరంగానే కాకుండా… ఆర్థికంగా కూడా బలంగా ఉన్న కుటుంబాలు చాలానే ఉన్నాయి. ఇలా ఉన్నప్పటికీ తమను రాజకీయంగా ఎదగకుండా కొంతమంది నేతలు అణగదొక్కుతుండటం వీరు సహించలేక పోతున్నారు. రాజకీయంగా ప్రాధాన్యత లభించాలంటే… ఐకమత్యం అవసరమని వారు గుర్తించారు. అందుకే వారు రాజకీయ పార్టీలరకు అతీతంగా శ్రీకాళహస్తిలో అత్యవసర సమావేశం నిర్వహించి… నూతన కార్య వర్గం ఎన్నుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
నూతన కార్యవర్గం ఇదే…
శ్రీకాళహస్తి నియోజకవర్గం వన్నెకుల క్షత్రియ నియోజకవర్గం అధ్యక్షులుగా కారూరు జనార్దన్ రెడ్డి, గౌరవ అధ్యక్షులుగా ఆర్కాడు ముత్తు రెడ్డి, ప్రధాన కార్యదర్శి మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, ఉపాధ్యక్షులు నెల్లూరు సుబ్రమణ్యం రెడ్డిని ఎన్నకున్నారు. ఇక సమావేశానికి ముఖ్యఅతిథిలుగా సత్రవాడ ప్రవీణ్ రెడ్డి, రెడ్డివారి గురవారెడ్డి, పేట బాలాజీ రెడ్డి, వడ్లతంగాళ్ బాలాజీ ప్రసాద్ రెడ్డి, స్వామి రెడ్డి భరత్ రెడ్డి, మిన్నల రవి, వేలూరు గుణశేఖర్ రెడ్డి, రేణిగుంట బిజెపి మండల అధ్యక్షులు ధర్మారెడ్డి బొబ్బిలిరెడ్డి, ఏర్పేడు మండల బిజెపి అధ్యక్షులు కొంగర మునస్వామి రెడ్డి, కేయం. బాలమురుగన్, మాజీ కౌన్సిలర్ మన్నసముద్రం చెంగల్రాయ రెడ్డి, దొరై రాజ్ రెడ్డి, వసంత రామిరెడ్డి, ప్రతాప్ రెడ్డి, కె. చిన్న మునిరెడ్డి, ఎం. కనెప్ప రెడ్ది, లాయర్ తులసి రెడ్డి, ముని సుబ్బరెడ్డి, బందారుపల్లి మునికృష్ణ రెడ్డి, కందప్ప రెడ్డి, జయశంకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ చెంబేటీ మునిరత్నం రెడ్డి, ఎమ్మెస్ రెడ్డి, మస్తాన్ రెడ్డి, నాగరాజు, వెంకటమునిరెడ్డి, జి. కృష్ణా రెడ్డి, ఆవుల రాజశేఖర్ రెడ్డి, పి. ముని బాబు, సుందరం రెడ్డి, మోహన్ రెడ్డి, జి. మాధవ రెడ్డి, ఏలుమలై రెడ్డి, ఆదిమూలం రెడ్డి, ఢిల్లీ, మొదలైనవారు పాల్గొన్నారు.
.