భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను నెత్తిన పెట్టుకునే ప్రయత్నం లో తప్పేమీ లేదు. సాధారణంగా ఎవరైనా సరే, తమ వ్యక్తిగత భావజాలానికి అనుగుణంగా ఉండే వారినే ఎక్కువగా అభిమానిస్తూ ఉంటారు. ఆ కోణం నుంచి చూసినప్పుడు… ట్రంప్ ని తిని పెట్టుకుంటూ, మోడీ తన భావజాలాన్ని నిరూపించుకున్నారని అనిపిస్తోంది. తాజాగా అకాడమీ ఆస్కార్ అవార్డులు ఇచ్చిన తీరుపై అమెరికా అధ్యక్షుడు స్పందన గమనిస్తే ఆయన ఫ్యూడల్ భావజాలం అర్థమవుతుంది.
ఈసారి ఆస్కార్ అవార్డులు, దక్షిణ కొరియా చిత్రం పారసైట్ అవార్డుల పంట పండించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆశ్చర్యకరమైన రీతిలో ఈ చిత్రానికి వివిధ విభాగాల్లో అవార్డులు లభించాయి. ఉత్తమ విదేశీ భాషా చిత్రం అనే కేటగిరీని, విదేశీ చిత్రంగా మార్చిన తర్వాత మొట్టమొదటిసారి దక్షిణ కొరియాకు చెందిన ఈ సినిమా సంచలనాలు నమోదు చేసింది.
మోడీ ప్రతిష్టను భంగపరుస్తున్న యూపీ సీఎం యోగి
అయితే దీనికి అవార్డు ఇవ్వడం మాత్రం ట్రంప్ ఎగతాళి చేస్తున్నారు. ఈసారి అకాడమీ అవార్డులు చాలా చెత్తగా ఉన్నాయి… అసలే దక్షిణ కొరియాతో వ్యాపార పరమైన సమస్యలు చాలా ఉన్నాయి… ఇలాంటప్పుడు మీరు అవార్డు కూడా ఇస్తారా అంటూ వ్యాఖ్యానించడం గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. సినిమాలకు ఇచ్చే అవార్డులు కూడా రాజకీయంగా దేశాల మధ్య ఉండే భేదాలను అనుసరించి ఇవ్వాలా? అనే ప్రశ్న ఉదయిస్తుంది. కళా సంస్కృతి తన రాజకీయ భావజాలానికి అనుగుణంగా మాత్రమే గౌరవం పొందాలని కోరుకునే ట్రంప్ తెంపరితనం కనిపిస్తుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో… తన మాట, తన ఆలోచన, తన దృక్పథం శిలా శాసనంగా చెలామణీ కావాలని కోరుకునే నాయకుడు నరేంద్ర మోడీ. ట్రంప్ ఆలోచనా వైఖరి మోడీకి రుచించడంలో ఆశ్చర్యం లేదు. అందుకే భారత్ కు ఆహ్వానించి… తన సొంత రాష్ట్రంలో కార్యక్రమం ఏర్పాటు చేసి.. ప్రయాణించే రోడ్డు పొడవునా… లక్షలాది మందిని జేజేలు కొట్టడానికి నియమిస్తూ మోడీ, ట్రంప్ పట్ల తన భక్తిని, సమానంగా చాటుకుంటున్నారు.
ట్రంప్.. తన దేశంలో ఇచ్చే సినిమా అవార్డులు కూడా తనకు నచ్చినట్లుగా కోరుకోవడం చిత్రమేమీ కాదు. ఆయన సాధారణంగా అంతకంటె భిన్నమైన ప్రజాస్వామిక భావజాలాన్ని ఎన్నడూ ప్రదర్శించలేదు. మన ప్రధాని గూడా అలాంటి ఆలోచనా సరళిని అలవాటు చేసుకోవాలి.
.
Discussion about this post