ఆత్మకథలు రాసే అలవాటు పాశ్చాత్యులదే తప్ప మనది కాదు. అయితే భారతీయులు ఈ కళలో ఆరితేరిపోయారని అనిపిస్తోంది. మహాత్మా గాంధీ, ప్రకాశం పంతులు గారి ఆత్మకథ లు మన మీద ఎంత ప్రభావం చూపాయో అందరికీ తెలుసు. డాక్టర్ అవధానం రఘు కుమార్ గారిని ఒక మేధావిగా భావిస్తుంటాను నేను. అయన విస్తృతంగా చదివారు. బీ ఎస్ ఎన్ ఎల్ లో పనిచేస్తూ కార్మిక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు.
న్యాయశాస్త్రంలో పీ హెచ్ డీ చేసిన రఘు కుమార్ గారు ఒక మర్యాద పురుషోత్తముడు. చర్చల్లో ఎంతో పరిణతితో, పెద్దరికం తో మాట్లాడే రఘు కుమార్ గారిలో ఇంత బడబాగ్ని ఉందని మనం ఊహించం. అరవై ఏళ్ల వయసు దాటాక తనలోని సంఘర్షణకు అందంగా, వివరణాత్మకంగా “ఆశ్రమం -ఆధునికత” పుస్తకంలో రఘు కుమార్ గారు చెప్పడంతో నేను మొదట ఆశ్చర్య పోయాను. తర్వాత ఉద్వేగానికి లోనయ్యాను.
గాంధీ, మార్క్స్, లోహియాల ప్రభావానికి లోనైన రఘు కుమార్ గారిని ఒక ” భద్ర లోక్” గా నేను భావించినందుకు ఇప్పుడు చింతిస్తున్నాను. అయనలో ఉన్న సంఘర్షణ ను అయన చదువు పెంచిందా అనే అనుమానం నాకు ఇప్పుడు వస్తోంది. తన మూలాల పట్ల అపేక్ష, తల్లితండ్రుల పట్ల బాధ్యత, ఆధునిక జీవితం కల్పించిన గందర గోళం, తనను తాను నిర్వచించుకునే రఘు కుమార్ గారి ప్రయత్నం ఈ పుస్తకం లో అడుగడుగునా కనిపించాయి.
జీవనయానం లో అయన ఎన్నో భావాలను వంటబట్టించుకున్నారు. అవి ఆయనను తల్లితండ్రులు శాంత, రమణ మూర్తి గార్ల నుంచి మానసికంగా విడదీశాయి. మార్క్సిజం పట్ల తర్వాతి కాలంలో అయన నిరాశ చెందారు. ప్రభుత్వ ఉద్యోగం నుంచి మధ్యలో బయటకు వచ్చారు. ఎన్నో మార్పులు, ఎన్ని సంఘటనలు ఆయనను మనో వేదన కు లోను చేశాయి. పాశ్చాత్యులు అయితే దీనిని మధ్య వయసు సంక్షోభం (MIDLIFE CRISIS) అంటారు.
రాయల సీమ నుంచి అయన హైదరాబాద్ ప్రయాణం లో చాలా గమ్మత్తులు కూడా ఉన్నాయి.
తండ్రి రమణ మూర్తి గారు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తండ్రిలోని రాయలసీమ వాదం, హిందుత్వం, బ్రాహ్మణీకం రఘు కుమార్ గారిని ఆలోచనలో పడేసేవి. రమణులను కొడుకు రఘుకుమార్ గారు ఆవిష్కరించే తీరు గొప్పగా, ఒక్కోసారి మనను విస్మయానికి లోనుచేస్తుంది.
తల్లి శాంత గారు రమణ మూర్తి గారికి చేదోడు వాదోడుగా నిలిచిన తీరు మన హృదయాన్ని తాకుతుంది. అవధానం, వారణాసి కుటుంబాలు ప్రత్యేకమైనవి. మా నాన్న కమ్యూనిస్ట్ అని గర్వంగా చెప్పే శాంతమ్మ గారి వ్యక్తిత్వం నన్ను ఆకట్టుకుంది. ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో వచ్చిన తేనె మనసులు సినిమాలో హీరో కృష్ణ తో పాటు నటించిన రామ్మోహన్ గారు రఘు కుమార్ గారి మేనమామ. మద్రాస్ లో రామ్మోహన్ గారి దగ్గర గడిపిన రోజులు రఘు కుమార్ పై ప్రభావం చూపాయి.
తన కుటుంబం లోని ఏ ఒక్కరిని రఘు కుమార్ గారు విస్మరించలేదు. ఇంకా చెప్పాలంటే ఉన్నది ఉన్నట్లుగా రాశారు. ఒక్కోసారి తప్పు పట్టారు. తనని తాను తప్పు పట్టుకున్నారు. ఈ పుస్తకం రాయడం ద్వారా తన తల్లిదండ్రులతో తనకు ఉన్న సంబంధాన్ని తిరిగి కనుగొనే ప్రయత్నం చేశారు. ఆ పనిలో అయన విజయం సాధించారు. శాంత, రమణలకు శాశ్వతత్వం కల్పించారు. ఇంకో పక్క సమాజ రుణం తీర్చుకున్నారు. ఒక మంచి పుస్తకాన్ని ప్రచురించిన అనల్ప సంస్థకు అభినందనలు.
.. రాజేంద్ర ప్రసాద రెడ్డి
సీనియర్ పాత్రికేయుడు

.