ఎన్నో తరాల్ని ప్రభావితం చేసి, విశ్వ సాహిత్యంలో మకుటాయమానంగా నిలిచిన నవల లే మిజరబుల్స్ . పంతొమ్మిదో శతాబ్దపు అత్యున్నత నవల్లో ఇది ఒకటి. అన్ని ప్రపంచ భాషల్లోకి అనువాదం అయి మూల నామధేయంతోనే ప్రాచుర్యం పొందింది.
ఫ్రెంచి రచయిత విక్టర్ హ్యూగో గొప్ప నవలా రచయిత మాత్రమే కాదు కవి, నాటక కర్త కూడా. 1862 లో ప్రచురితమైన ఈ నవలను చెలంచర్ల భాస్కర రెడ్డి గారు జీన్ వాల్ జీన్ పేరుతో తెలుగు లోకి చక్కగా అనువాదం చేయడమే కాదు గొప్పగా క్లుప్తీకరించారు.
ఈ నవలలో ప్రధానంగా మూడు పాత్రలు ఉన్నాయి. జీన్ వాల్ జీన్, ఫాంటైన్, జూవెర్ట్. వాల్ జీన్ పాత ఖైదీ. ఫాంటైన్ అమాయకపు పల్లె పడచు. జూవెర్ట్ నిజాయతీ కలిగిన పోలీసు అధికారి. రొట్టి ముక్క దొంగిలించినందుకు జీన్ వాల్ జీన్ పట్టుబడతాడు. పంతొమ్మిది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తాడు. బిషప్ బోధనల వల్ల మారతాడు. వేశ్యగా మారిన ఫాంటైన్ ను ఆదరిస్తాడు. పోలీసు అధికారి జూవెర్ట్ తన అతి నిజాయితీ తో ఈ ఇద్దరిని ఇబ్బంది పెడతాడు.
కథలో ఎన్నో మలుపులు. హృదయాన్ని ఆకట్టుకునే ఎన్నో సన్నివేశాలు ఉన్నాయి. ముగింపు అద్భుతంగా వుంది. ఈ శాపగ్రస్తుల గుండెల్లోకి విక్టర్ హ్యూగో గొప్పగా తొంగిచూశాడు. వాటర్ లూ ( 1815) యుద్ద కాలం నుంచి జూన్ పోరాటం / ప్యారిస్ తిరుగుబాటు (1832) నేపథ్యంలో ఈ కథ జరుగుతుంది. జూన్ తిరుగుబాటుకు దారి తీసిన పరిస్థితులన్నీ ఒక్కక్కటిగా విస్పోటనమవుతాయి.
ప్రాచీన కావ్యాలను, నాటకాలను, ఇతిహాసాలను ఆధునిక భాషలోకి క్లుప్తంగా తర్జుమా చేయడం పాశ్చాత్యులు చేస్తున్న గొప్ప ప్రయత్నం. ఆ అలవాటు మనకు తక్కువ. తెలుగు భాష పట్ల తనకున్న ప్రేమాభి మానాలతో ఈ బృహత్కర కార్యక్రమం చేపట్టారు చెలంచర్ల భాస్కర రెడ్డి. ఈ అనువాదంలో ఈ విశ్రాంత బ్యాంక్ అధికారి పూర్తిగా సఫలీకృతుయ్యారు.
ఫ్రెంచ్ ఆలోచనా వ్యవహారాలకే కాక, యూరోపియన్ పునరుజ్జీవ చేతనకు భూమికగా నిలిచిన ఈ నవలను మనమంతా తప్పక చదవాలి. గొప్ప నవల ఏదో ఒక కథ చెప్పేసి ఊరుకోదు. ఎప్పటి కథ చెప్పినా, ఎక్కడి కథ చెప్పినా, ఎవరి కథ చెప్పినా ఆ నవల మన కథే చెబుతుంది.

.
Discussion about this post