టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన యుగళ గళం వైకాపా పతన యాత్రని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పుంగనూరు పరిశీలకుడు డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ విషయం అర్ధం కావడం వల్లే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లోకేష్ పాదయాత్రను చూసి భయపడి అవాకులు చవాకులు పేలుతున్నారని అన్నారు.
పెద్దిరెడ్డి శుక్రవారం మాట్లాడుతూ లోకేష్ టిడిపికి గుదిబండ అన్నారని, అయితే వైకాపా నెత్తిన బండ రాయని గుర్తిస్తే మంచిదని చెప్పారు. మరో మంత్రి ఆర్ కె రోజా అన్నట్టు లోకేష్ ఐరన్ లెగ్ కాదని వైకాపా పాలిట పెద్ద ఐరన్ రాడ్ అని చెప్పారు.
లోకేష్ యువ గళం ప్రారంభం కాగానే వైకాపాలో అసమ్మతి గళం వినిపిస్తున్నదన్నారు. జగన్ అవినీతి, అణచివేత ధోరణి నచ్చని ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారని తెలిపారు. నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ జగన్ పై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.
అలాగే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, ఆదం ప్రభాకర్ రెడ్డి తిరుగుబాటుకు సిద్దమవుతున్నారని చెప్పారు. ఆఖరికి జగన్ నమ్ముకున్న రెడ్డి సామాజిక వర్గం నుంచే అసమ్మతి ప్రారంభం అయ్యిందని చెప్పారు.
లోకేష్ పాదయాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారని చెప్పారు.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్టు రాష్ట్ర పాలన పిచ్చి వాడి చేతిలో రాయిలా మారిందన్నారు. ప్రజల్లో కూడా నిరసన ప్రారంభం అయిందన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు టిడిపి గాలి వీస్తోందని చెప్పారు. ఈసారి టిడిపి ప్రభంజనంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ కె రోజా కొట్టుకుని పోక తప్పదని సుధాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
.

Discussion about this post