‘‘బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, బొజ్జల హరినాథరెడ్డి లేని లోటు తీర్చలేనిది. అందుకే శ్రీకాళహస్తి నియోజకవర్గం ప్రజల బాగు కోసం నేను గోపాలన్న పాత్ర పోషిస్తా. వచ్చే నెల నుంచి ‘త్రిమూర్తులు’ (బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, బొజ్జల సురేష్ రెడ్డి, తులసీరామ్ రెడ్డి) ను రంగంలోకి దిగుతారు. సుధీర్ సతీమణి రిషిత కూడా ఇకపై ప్రజల్లోనే ఉంటారు. యువగళం పాదయాత్రలో మహిళల ఆదరణ మరువలేనిది. అందరూ నన్ను సొంత ఆడబిడ్డలా చూసుకున్నారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా పని చేస్తాం’’ అంటున్నారు. దివంగత మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బొజ్జల బృందమ్మ. శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరులో శనివారం బొజ్జల బృందమ్మ ‘ఆదర్శిని’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆమె మాటల్లోనే…
‘‘తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర శ్రీకాళహస్తి నియోజకవర్గంలో విజయవంతం కావడం ఆనందంగా ఉంది. తొట్టంబేడు, శ్రీకాళహస్తి పట్టణం, శ్రీకాళహస్తి మండలం, ఏర్పేడు, రేణిగుంట మండలాల్లో నారా లోకేష్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. యువగళం పాదయాత్ర విజయవంతం చేయడానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు చేసిన కృషి మరువలేనిది. వీరందరికీ మా కుటుంబం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.
భగభగ మండే ఎండను సైతం లెక్క చేయకుండా తెలుగుదేశం శ్రేణులు, అభిమానులు నారా లోకేష్ అడుగులో అడుగు కలిపి నడవడం నాకు చాలా ఆనందంగా ఉంది. యువగళం పాదయాత్రకు ప్రజలు రాకుండా చేయడానికి వైసీపీ నేతలు వలంటీరు వ్యవస్థ ద్వారా అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అయినా మా కార్యకర్తలు వారి కుట్రలను భగ్నం చేశారు. ప్రజలు కూడా స్వచ్ఛంధంగా నారా లోకేష్ అడుగులో అడుగు కలిపి సంఘీభావం తెలిపారు. నిర్బంధాల మధ్య ప్రజలు ఇలా స్వచ్చంధంగా ముందుకు రావడం అభినందించ దగ్గ విషయం. ఇది మార్పుకు నాందీ అని నేను భావిస్తున్నాను. యువత కూడా బాగా ఆలోచిస్తోంది. నారా లోకేష్ పాదయాత్ర చూడటానికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా రావడం శుభపరిణామం.
వైసీపీ విధానాలతో ప్రజలు విసిగి పోయారు. జగన్ పాలనలో భావ ప్రకటనా స్వేచ్ఛ హరించి వేశారు. రౌడీయిజం పెరిగి పోయింది. ప్రశ్నించే వారి గొంతు నొక్కేస్తున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు ఎక్కువయ్యాయి. ఏ తప్పు లేక పోయినా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలను భయపెట్టడానికి గంజాయి కేసులు కూడా పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కొంతమంది నేతలపై అక్రమ మద్యం కేసులు కూడా బనాయించారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన పత్రికా స్వేచ్ఛను కూడా ఇక్కడ హరిస్తున్నారు. వైసీపీ నేతల అక్రమాలను వెలికి తీసే పాత్రికేయులను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. పత్రికా స్వేచ్ఛను హరిస్తే అది ప్రజాస్వామ్యానికే చేటు. ఇది పాలకులు గుర్తించాలి. పత్రికల్లో వచ్చే విమర్శనాత్మక కథనాలను పాలకులు పాజిటివ్ గా తీసుకోవాలి. అంతేగానీ కక్ష సాధింపు ధోరణి అవలంబించ కూడదు.
తెలుగుదేశం పార్టీ హయాంలో ఎపుడూ ఇలా జరగలేదు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తన మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇలా అరాచకాలు చేయలేదు. విమర్శను స్వాగతించే వారు. వ్యక్తి కంటే సామూహిక ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అందుకే ఆయన శ్రీకాళహస్తి నియోజకవర్గం ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు, రేణిగుంట మండలాల్లో ప్రస్తుతం కనిపించే అభివృద్ధి మొత్తం ఆయన హయాంలోనిదే. ఇపుడు ఉన్న పాలకులు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో శాశ్వత ప్రాతిపదికన ఏం అభివృద్ధి చేశారో చెప్పమనండి. గోపాలన్న 30ఏళ్లలో ఏమీ చేయలేదని ఇక్కడి వైసీపీ నేతలు అంటున్నారు. ఇది విచారకరం.
అభివృద్ధికి మారుపేరు గోపాలన్న. అది అందరికీ తెలిసిన సత్యం. ఆయన అవినీతి మచ్చలేని నేత. మంచి మనసున్న గొప్ప ప్రజానేత. అలాంటి గొప్ప వ్యక్తిని విమర్శించడం బాధాకరం. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎవరు ఎలాంటి వారో శ్రీకాళహస్తి ప్రజలకు తెలుసు. గోపాలన్న హయాంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో శాంతిభద్రతలకు ఎపుడూ విఘాతం కలుగలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శ్రీకాళహస్తిలో ప్రజలు స్వేచ్చగా తిరగలేని పరిస్థితి ఏర్పడింది. భూ కబ్జాలు పెరిగి పోయాయి. ఇసుక అక్రమ రవాణా విచ్చల విడిగా చేస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అక్రమాలు పెరిగి పోయాయి.
ఇది చాలా ఆవేదన కలిగించే అంశం. అక్రమాలు, దౌర్జన్యాలు ప్రజలు గమనిస్తున్నారు. గోపాలన్న ఆరోగ్య పరిస్థితులు కారణంగా సుధీర్ బాబు కొంతకాలం శ్రీకాళహస్తి ప్రజలకు సక్రమంగా అందుబాటులో లేకుండా పోవాల్సి వచ్చింది. గోపాలన్న, హరినాథరెడ్డి పది రోజుల వ్యవధిలో మాకు దూరం కావడం మమ్మల్ని మానసికంగా కుంగదీసింది. ఆ బాధ నుంచి ఇపుడిపుడే కోలుకుంటున్నాం. శ్రీకాళహస్తి నియోజకవర్గం ప్రజల మనసులో గోపాలన్న శాశ్వతంగా ఉంటారు. వచ్చే నెల మార్చి మొదటి వారం నుంచి సుధీర్ బాబు నియోజకవర్గంలోని అన్ని పంచాయతీలకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటారు. పంచాయతీల పర్యటన పూర్తయిన తరువాత పల్లెపల్లెకు వెళతారు.
సుదీర్ బాబుతో పాటు సురేష్ రెడ్డి, తులసీరామ్ ప్రజల్లోకి వెళతారు. సుధీర్ బాబు సతీమణి రిషిత కూడా ఇకపై నిత్యం ప్రజల్లో ఉంటుంది. నేను కూడా ఇకపై ప్రజలకు అందుబాటులో ఉంటూ… వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. రేణిగుంట మండలంపై రిషిత ప్రత్యేక దృష్టి సారిస్తుంది. నేను తొట్టంబేడు మండలంపై ప్రత్యేక దృష్టి సారిస్తాను. గోపాలన్నతో సన్నిహితంగా ఉండే నేతలను కలిసి వారి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళతాను. మాకు బంధువులు కూడా మంచి మద్దతు తెలుపుతున్నారు.
మా కుటుంబంపై ప్రజలు చూపే అభిమానం ఎప్పటికీ మరువలేం. కష్ట కాలంలో మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడిన కార్యకర్తలను, ప్రజలను మేము ఎప్పటికీ మరువలేం. వారికి రుణపడి ఉంటాం. శ్రీకాళహస్తి ప్రజల్లో గోపాలన్నను, హరినాథ రెడ్డిని చూసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వీరందరికీ న్యాయం చేస్తాం. శ్రీకాళహస్తిని మళ్లీ అభివృద్ధి బాటలో నడిపిస్తాం. ప్రజలు కూడా ఇందుకు సహకరించాలి.’’ అని బొజ్జల బృందమ్మ కోరారు.
.

Discussion about this post