శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మహిళలకు అన్ని వేళలా అండగా ఉంటానని దివంగత రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బొజ్జల బృందమ్మ భరోసా ఇచ్చారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్టీఆర్ భవన్ లో బుధవారం తెలుగు మహిళల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు బొజ్జల బృందమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు మహిళలతో కలసి ఆమె కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ… ఇటీవల కాలంలో మహిళలకు రక్షణ కరువవుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం అత్యాచార వార్తలు మనం చూస్తున్నామన్నారు. బాలికలపై కూడా అత్యాచారాలు జరగడం ఆందోళన కలిగించే అంశమన్నారు. రేణిగుంట మండలంలో కూడా ఓ బాలికపై గత ఏడాది అత్యాచారం జరిగిందని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు, రేణిగుంట మండలాలల్లో మహిళలకు ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకు రావాలని ఆమె కోరారు.
వాట్సాప్ లో సమాచారం ఇచ్చినా తాను అక్కడకు వచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రశ్నించే మహిళలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 70 ఏళ్లు దాటిన వృద్ధ మహిళలపై కూడా అక్రమ కేసులు పెట్టడం చాలా బాధాకరమన్నారు. తనతో ఫోటో దిగిన మహిళలపై కూడా అధికార పార్టీ వారు వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె చెప్పారు.
మహిళలకు అండగా నిలిచే తనపై కూడా అక్రమ కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదన్నారు. మహిళలకు న్యాయం చేయడానికి తాను దేనికైనా సిద్ధంగా ఉంటానని ఆమె స్నష్టం చేశారు. గోపాలన్న, హరిన్న లేని లోటు పూడ్చలేనిదన్నారు. వారి బాధ్యతలను తాను తీసుకుని నియోజకవర్గం ప్రజలకు న్యాయం చేస్తానని బొజ్జల బృందమ్మ భరోసా ఇచ్చారు. ముఖ్యంగా మహిళలకు ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు.
మహిళల సమస్యలు తీర్చడానికి తాను అన్ని వేళలా అందుబాటులో ఉంటానని ఆమె హామీ ఇచ్చారు. మహిళల సమస్యలు చెబితే తాను వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలు అందరూ తెలుగుదేశానికి అండగా ఉండాలని ఆమె కోరారు. కాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో బొజ్జల బృందమ్మ తెలుగు మహిళలతో కలసి పాల్గొన్నారు.
ఇక బొజ్జల బృందమ్మ సమక్షంలో మాధవి అనే మహిళ టీడీపీలో చేరారు. ఈ సమావేశంలో తెలుగు మహిళలు సుమతమ్మ, రేణుకమ్మ, మల్లీశ్వరమ్మ, చంద్రమ్మ, దుర్గమ్మ, కృష్ణ వేణి, కుమారి, శ్రీ లక్ష్మి, ఊహ, జయశ్రీ, సునీత, సునీమా, చంద్రకళ, రమాదేవి, సుభాషిణి, మాధవి, సంధ్య, భారతి తదితరులు పాల్గొన్నారు.
.

Discussion about this post